బాలికలు... రక్తహీనత బాధలు!
బాలికలను రక్తహీనత వెంటాడుతోంది... పోషకాహార లోపం ఎక్కువగా కనిపిస్తోంది... నీరసం, నిస్సత్తువ, ఆయాసంతో ఇబ్బందులు పడుతున్నారు.
వైద్య, ఆరోగ్యశాఖ పరీక్షల్లో వెల్లడి
న్యూస్టుడే, కడప
బాలికల నుంచి రక్తపూతలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది
బాలికలను రక్తహీనత వెంటాడుతోంది... పోషకాహార లోపం ఎక్కువగా కనిపిస్తోంది... నీరసం, నిస్సత్తువ, ఆయాసంతో ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. ఇది వీరి ఎదుగుదల, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖాధికారులు నిర్వహించిన పరీక్షల్లో వెలుగు చూసిన ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి మందు బిళ్లలిస్తూ నెట్టుకొస్తున్నారు.
పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆర్థిక కష్టాలతో రోజువారీగా తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు తగిన పరిమాణంలో. ఉండటం లేదు. పాలు, కోడిగుడ్లు, చేపలు, మాంసం తక్కువగా తింటున్నారు. ఏదైనా పనిచేసినా, ఎక్కువ సేపు నిలబడినా, కాస్త దూరం నడిచినా వెంటనే అలసిపోతున్నారు. తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీ పడలేకపోతున్నారు. అంతులేని అలసట, నీరసం, తలనొప్పి, కాళ్లనొప్పులు, తిమ్మిర్లు, ఆయాసం తదితర సమస్యలతో బాధపడుతున్నారు. తాత్కాలికంగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఇనుము (ఐరన్) పోషకాలు అందించే మందు బిళ్లలు అందజేస్తున్నారు.
* వైయస్ఆర్ జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న రాష్ట్రీయ కిశోర స్వస్త్య కార్యక్రమం (ఆర్కేఎస్కే) అమలులో భాగంగా 10-19 ఏళ్లలో బాలికల్లో రక్తహీనత సమస్య ఉందని గుర్తించారు. దీనికి సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 1,457 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 49,880 మంది అమ్మాయిల నుంచి రక్తపూతలు సేకరించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే 1,280 బడుల్లో చదువుతున్న 45,663 మందిని పరీక్షించారు. వీరిలో 29,640 మంది (64.91 శాతం)లో రక్తహీనత ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో 15,371 మందికి 100 గ్రాముల రక్తంలో 8-10 గ్రాములు, 14,269 మందికి 10-11.9 గ్రాముల్లోపు హిమోగ్లోబిన్ ఉన్నట్లు తేల్చారు. ఒంటిమిట్ట సచివాలయం పరిధిలో ఇటీవల 236 మంది బాలికలను పరీక్షిస్తే 204 మంది, కొత్తమాధవరంలో 208 మందికి 153 మంది, మంటపంపల్లెలో 80 మందికి 63 మంది, చింతరాజుపల్లెలో 109 మందికి 54 మందిలో రక్తహీనత ఉన్నట్లు నిర్ధారించారు. ఇక్కడే కాకుండా జిల్లాలోని మిగతా మండలాల్లోనూ ఇదే పరిస్థితి.
* అన్నమయ్య జిల్లాలో రుధిరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పేద కుటుంబాల్లో అమ్మాయిలకు పోషకాహారం లోపం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న బాలికలకు మధ్యాహ్నం పూట ‘జగనన్న గోరుముద్ద’లో రుచికర భోజనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినా పెద్దగా మార్పు రావడం లేదు. ప్రతి 100 గ్రాముల రక్తంలో సగటున 12 గ్రాములు హిమోగ్లోబిన్ ఉండాల్సి ఉండగా 49,681 మందికి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సమస్యను అధిగమించేందుకు ఇనుము ఔషధాలిస్తున్నా చాలామంది ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మందులు ఇస్తున్నాం
10-19 ఏళ్ల వయసు ఉన్న బాలికల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించాం. ఒంట్లో తగినంత రక్తం లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యను అధిగమించేవిధంగా ఇనుము మందు బిళ్లలు పంపిణీ చేస్తున్నాం. క్రమం తప్పకుండా తినేవిధంగా వైద్యసిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న బాలికలు తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, పాలు, కోడిగుడ్లు, మాంసం, చేపలను బాగా తీసుకోవాలి.
డాక్టరు కె.నాగరాజు, డీఎంహెచ్ఓ, కడప
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!