logo

నేడు కడప నగరానికి నారా లోకేశ్‌ రాక

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ బుధవారం కడప నగరంలో పర్యటించనున్నారు. ఈ నెల 27వ తేదీన కుప్పం నుంచి ‘యువగళం’ పేరుతో మహా పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో కడపలో సర్వమత ప్రార్థనాలయాలను సందర్శించాలని లోకేశ్‌ సంకల్పించారు.

Updated : 25 Jan 2023 06:30 IST

దేవుని కడప శ్రీలక్షీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరి కాయలు కొడుతున్న తెదేపా నాయకులు

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, జిల్లా సచివాలయం: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ బుధవారం కడప నగరంలో పర్యటించనున్నారు. ఈ నెల 27వ తేదీన కుప్పం నుంచి ‘యువగళం’ పేరుతో మహా పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో కడపలో సర్వమత ప్రార్థనాలయాలను సందర్శించాలని లోకేశ్‌ సంకల్పించారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం విమానంలో హైదరాబాద్‌ నుంచి కడపకు చేరుకుని ఆలయాలు, దర్గా, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెదేపా నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మొదటగా దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. అమ్మవారిసమేత శ్రీవారి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి సమీపంలోని ప్రసిద్ధి గాంచిన పెద్ద దర్గాకు చేరుకుని ప్రత్యేక చాదర్‌ను సమర్పించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మతపెద్దల నుంచి ఆశీస్సులు అందుకుని అనంతరం మరియాపురంలోని రోమన్‌ కేథలిక్‌ చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ విధంగా సర్వమత ప్రార్థనాలయాల్లో పాల్గొనే విధంగా పర్యటన షెడ్యూలులో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. కడప నుంచి రాజంపేట, రైల్వేకోడూరు, కరకంబాడి మీదుగా రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని అనంతరం కుప్పం చేరుకుంటారు. లోకేశ్‌ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఉదయం ఎన్టీఆర్‌ కూడలి నుంచి పాదయాత్రగా బయలుదేరి దేవుని కడప శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ 108 కొబ్బరి కాయలు కొట్టి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి, కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జి అమీర్‌బాబు, నాయకుడు లక్ష్మీరెడ్డి, వికాస్‌ హరికృష్ణ, శివారెడ్డి, పీరయ్య, రాంప్రసాద్‌, సురేష్‌, జిలానీబాషా, గుర్రప్ప, శ్రీనివాసులు, అమరనాథరెడ్డి, శివ, జియావుద్ధీన్‌, సుబ్బరాయుడుయాదవ్‌, రాము యాదవ్‌, వెంకటేశ్‌యాదవ్‌, రెడ్డెయ్యయాదవ్‌, జయశేఖర్‌, జనార్దన్‌రెడ్డి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Ysr News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని