logo

హార్సిలీహిల్స్‌ అవుట్‌పోస్టు తెరిచేదెప్పుడు?

ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో పోలీసు అవుట్‌ పోస్టు మళ్లీ మూతపడింది. గతేడాది ఆగస్టులో అవుట్‌ పోస్టుకు రాయచోటి నుంచి ఇద్దరు ఏఆర్‌ ఎస్‌.ఐ.లతోపాటు మరో ఇద్దరు సిబ్బందిని ఎస్పీ నియమించారు.

Published : 25 Jan 2023 01:07 IST

విధుల్లో ఉన్నది ఒకే ఒక్క హోంగార్డు
రాయచోటికి వెళ్లిపోయిన ఏఆర్‌ సిబ్బంది
- న్యూస్‌టుడే, బి.కొత్తకోట

మూతబడిన హార్సిలీహిల్స్‌లోని పోలీసు అవుట్‌ పోస్టు

ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో పోలీసు అవుట్‌ పోస్టు మళ్లీ మూతపడింది. గతేడాది ఆగస్టులో అవుట్‌ పోస్టుకు రాయచోటి నుంచి ఇద్దరు ఏఆర్‌ ఎస్‌.ఐ.లతోపాటు మరో ఇద్దరు సిబ్బందిని ఎస్పీ నియమించారు. అప్పటి నుంచి కొండపై ఏఆర్‌ పోలీసులతో పాటు బి.కొత్తకోట పోలీసులు పర్యాటకులకు భద్రత కల్పించారు. అయితే ఇటీవల అవుట్‌ పోస్టుకు నియమించిన నలుగురిని తిరిగి జిల్లా కేంద్రమైన రాయచోటికి పిలిపించారు. దీంతో కొండపై విధుల నిర్వహణకు ఓ హోంగార్డు మాత్రమే మిగిలారు. మరోవైపు బి.కొత్తకోట పోలీసుస్టేషన్‌లో సిబ్బంది కొరత సమస్యగా మారింది. కొండపై ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే సత్వరం పర్యాటకుల భద్రత కల్పించడం కష్టంగా మారుతోంది.

* బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌కు గతంతో పోల్చితే పర్యాటకుల తాకిడి పెరిగింది. నూతన సంవత్సరంతో పాటు సెలవు రోజుల్లో కొండపైకి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది. కొండపై అటవీ, పర్యాటకశాఖలతో పాటు ప్రైవేటు సంస్థలు అతిథి గృహాలు నడుపుతున్నాయి. వివిధ స్థాయిల్లోని వీఐపీలతో పాటు పర్యాటకులు కొండపై తరచూ బస చేయడం ఆనవాయితీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కొండపై రాత్రింబవళ్లు భద్రతను కల్పించాల్సిన అవసరం పెరుగుతోంది. సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్యాటక కేంద్రానికి మృత్యు మలుపులతో కూడిన ఘాట్‌ రోడ్డులో వెళ్లాల్సి ఉంటుంది. ఈ రహదారిలో తరచూ ప్రమాదాలు పునరావృతమవుతుండటంతో సందర్శకులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పటికప్పుడు ఘాట్‌ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనాలను నియంత్రించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంది. గతంలో కొండపై అనేక సందర్భాల్లో గొడవలు జరిగి పోలీసుల జోక్యంతో సద్దుమణిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కొండపై ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రానున్న వేసవిలో పర్యాటకుల తాకిడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాగా కొండపై అవవసరాలను దృష్టిలో ఉంచుకుని అవుట్‌ పోస్టుకు నిబంధనల మేరకు శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని హార్సిలీహిల్స్‌ టౌన్‌షిప్‌ కమిటీ సభ్యులు సూచించారు. కొండపై అవుట్‌ పోస్టుకు మరమ్మతులు చేయిడంతో పాటు సిబ్బంది బస చేయడానికి సదుపాయాలు కల్పించాలని, తద్వారా పర్యాటకులకు భద్రత లభిస్తుందని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై మదనపల్లె డీఎస్పీ కేశప్ప మాట్లాడుతూ హార్సిలీహిల్స్‌లో పర్యాటకులకు భద్రత కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అవుట్‌ పోస్టుకు మరమ్మతులు చేయించి సిబ్బందిని నియమిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని