logo

Kadapa: యూట్యూబ్‌ చూసి నకిలీ నోట్ల ముద్రణ

కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న నకిలీ నోట్ల కేసులో కీలక వివరాలను దర్యాప్తు అధికారులు సేకరించారు.

Updated : 28 Jan 2023 09:34 IST

ఈనాడు డిజిట్‌ కడప, న్యూస్‌టుడే, బెంగళూరు (మల్లేశ్వరం) : కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న నకిలీ నోట్ల కేసులో కీలక వివరాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నలుగురు నిందితుల్లో ఒకరైన పుల్లలరేవు రాజు వ్యవహారమే ప్రత్యేకాంశంగా మారింది. నకిలీ నోట్లను కాస్త పరిజ్ఞామున్న వారు ఇట్టే గుర్తిస్తారు. రాజు తయారు చేసిన నోట్లు అసలును పోలినట్లే నాణ్యంగా ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది. దీనికి కారణం.. యూట్యూబ్‌ చూసి నోట్లు ముద్రించే విధానం రాజు నేర్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజు ముద్రించే నోట్లను నకిలీవని త్వరగా గుర్తించడం సాధ్యం కాదని,  ముద్రణ అవసరాల కాగితం కోసం పలు ప్రాంతాలలో పరిశీలించి ఎంపిక చేసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. బార్లు, థియేటర్లు, పెట్రోలు బంకులు, పబ్‌లను లక్ష్యంగా చేసుకుని నగదును మార్చేందుకు నిందితులు రజని, చరణ్‌సింగ్‌ తదితరుల సహకారం తీసుకున్నట్లు వివరించారు.

* దొంగనోట్ల కుంభకోణంలో కీలక పాత్రధారిణి, ప్రొద్దుటూరు వైకాపా నాయకురాలు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టరుగా రజనీ తమ పదవుల అండతోనే నేర సామ్రాజ్యం వైపు అడుగులు వేశారు. గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి రూ.లక్షలాదిగా వసూళ్లకు పాల్పడి చివరికి ఐపీ పెట్టి అందరినీ మోసం చేయడంతో అప్పట్లో ఆమెపై పోలీసు కేసు నమోదైంది. కొంత కాలం కడప కేంద్రంగా నివాసం ఉంటూ కార్యకలాపాలు నడిపించిన ఆమె వైకాపా అధికారంలోకి రాగానే ప్రొద్దుటూరు చేరుకుని నేతలకు పరిచయమైంది. స్థానిక నేతల నుంచి మంత్రులు, సలహాదారులతో ఫొటోలు తీసుకుని వీటిని ఆసరా చేసుకుని అక్రమాలకు తెరలేపారు. దొంగనోట్ల వ్యవహారంలో నిందితుడైన చరణ్‌సింగ్‌ రజనికి సమీప బంధువుగా ప్రచారం జరుగుతోంది. ఈయన ప్రొద్దుటూరులో ప్రజారోగ్యశాఖ డీఈ కార్యాలయంలో పొరుగుసేవల కార్మికునిగా విధులు నిర్వహించారు, విధుల్లో ఉండగానే దొంగనోట్ల మార్పిడికి రజని రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతోంది. రజనికి విజయవాడలో ఆస్తులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈమె చరవాణి ఆధారంగా కర్ణాటక పోలీసులు విచారణ ముమ్మరం చేయడంతో స్థానికంగా కొందరి నేతల్లో వణుకు మొదలైంది. చరవాణి నంబర్లు, సందేశాలు, వాట్సాప్‌ల ఆధారంగా దొంగనోట్ల మార్పిడి ముఠాలో ఇంకా ఎవరున్నారనే విషయమై దర్యాప్తు సాగిస్తున్నారు. నోట్ల తయారీ ప్రాంతాలు, ఎక్కడెక్కడ మార్చారనే విషయాలు రాబట్టే ప్రయత్నాల్లో కర్ణాటక పోలీసులున్నారు. త్వరలో ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు ప్రాంతాల్లో విచారణకు కర్ణాటక పోలీసులు రానున్నట్లు సమాచారం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని