logo

గడువు కుదించేశారు!

చేతివృత్తిదారులకు ఆర్థిక చేయూతనందిస్తామంటూ ప్రారంభించిన ‘జగనన్న చేదోడు’ పథకం లబ్ధిదారుల సంఖ్యను ఈ ఏడాది కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రయత్నిస్తోందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

Updated : 29 Jan 2023 04:18 IST

చేదోడు దరఖాస్తుకు   ఇబ్బందులు
ప్రచారం లేక అందని పథకం

రాజంపేట తహసీల్దారు కార్యాలయం

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, రాజంపేట, రాజంపేట గ్రామీణ: చేతివృత్తిదారులకు ఆర్థిక చేయూతనందిస్తామంటూ ప్రారంభించిన ‘జగనన్న చేదోడు’ పథకం లబ్ధిదారుల సంఖ్యను ఈ ఏడాది కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రయత్నిస్తోందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. గతానికి భిన్నంగా దరఖాస్తు చేసుకునేందుకు గడువును కుదించడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు 20 రోజుల గడువు ఇస్తుంటే, ఈ పథకానికి మాత్రం ఈసారి కొత్తవారు దరఖాస్తు చేసుకునేందుకు రెండు రోజులు, పాత లబ్ధిదారులు నవీకరించుకునేందుకు అయిదు రోజుల గడువే ఇవ్వడంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

* వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి సాయం చేసే దిశగా ప్రభుత్వం జగనన్న చేదోడు పథకం ప్రవేశపెట్టింది. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలు తదితరులకు ఆర్థిక సాయం అందించేందుకు రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఆయా వృత్తులు చేసుకునే వారికి ఏడాదికి రూ.10 వేల చొప్పున సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. తెలుపు రంగు రేషన్‌ కార్డు కలిగి 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు పథకానికి అర్హులు. అర్హులైనవారు బియ్యం కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, లేబర్‌ సర్టిఫికెట్‌తో పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆయా అర్హతలు కలిగినవారిని లబ్ధిదారులుగా సచివాలయ వాలంటీర్లు గుర్తిస్తే.. వారి పత్రాలను సచివాలయాల్లోని సంక్షేమ అసిస్టెంట్లు నవశకం బెనిఫిషరీ మేనేజ్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఎంపీడీవో లాగిన్‌ నుంచి సదరు జాబితాను పరిశీలించి జిల్లా అధికారులకు, అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి అధికారులకు పంపుతారు. అనంతరం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేస్తారు. ఈ ప్రక్రియ మొదటి, రెండో విడత సజావుగానే సాగింది. దీంతో లబ్ధిదారులు ఎవరూ పెద్దగా ఇబ్బందులు పడలేదు.

ఇప్పుడే ఎందుకీ మెలిక?

పథకంలోని లబ్ధిదారులను తగ్గించాలనే కుతంత్రంతో ఈ విడత సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో బియ్యం కార్డుతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా... ఈ ఏడాది బియ్యం కార్డుకు బదులుగా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని కోరింది. గతంలో మీ-సేవ, ఈ- సేవా కేంద్రాల నుంచి తీసుకున్న లేబర్‌ సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ ఏడాది మాత్రం సచివాలయాల వద్ద మాత్రమే తీసుకోవాలనే షరతు పెట్టింది. గతంలో దరఖాస్తు, నవీకరణ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందేందుకు కనీసం అయిదు నుంచి పది రోజుల సమయం పడుతుంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువు అయిదు రోజులే కావడంతో సగానికిపైగా లబ్ధిదారులు పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద పేదలు ఎదురుచూడడం కనిపిస్తోంది. గతేడాది పథకం కింద వైయస్‌ఆర్‌ జిల్లాలో 28,053 మంది రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ.28.05 కోట్లు, అన్నమయ్య జిల్లాలో 20,730 మందికి రూ.20.70 కోట్లు ఆర్థిక లబ్ధిని అందజేశారు. ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగాల్సి ఉండగా.. కొత్తగా తెచ్చిన నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారమే లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని