logo

జమ్మలమడుగు వైకాపాలో భగ్గుమన్న విభేదాలు

జమ్మలమడుగు వైకాపాలో విభేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వ్యతిరేక వర్గం బహిరంగంగా ఓ వేదికపై చేరింది.

Updated : 29 Jan 2023 04:39 IST

ఎమ్మెల్యేపై అసమ్మతి నాయకుల ఆరోపణలు
మళ్లీ టిక్కెట్‌ ఇస్తే  పనిచేయబోమంటూ శపథం  

మాట్లాడుతున్న రాజశేఖర్‌రెడ్డి, పక్కన నాయకులు పవన్‌కుమార్‌రెడ్డి, నాగేశ్వరరావు, రాముడు

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, ఎర్రగుంట్ల: జమ్మలమడుగు వైకాపాలో విభేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వ్యతిరేక వర్గం బహిరంగంగా ఓ వేదికపై చేరింది. ఆయనపై ఆరోపణలు గుప్పించింది. ఎమ్మెల్యే స్వయంగా మట్టి, ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారని ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇస్తే పని చేయబోమని స్పష్టం చేసింది. పార్టీ కోసం పాటుపడిన వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని.. ఆర్థికంగానూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ వర్గం నాయకులు ఆరోపించారు. ఎర్రగుంట్లలో శనివారం గంగవరం రాజశేఖర్‌రెడ్డి (గంగవరం శేఖర్‌రెడ్డి) అధ్యక్షతన అసమ్మతి నాయకులు భేటీ అయ్యారు. ఇక్కడే ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీని కాపాడుకోవడానికి ఎర్రగుంట్లలోనే నివాసం ఉండి కార్యకర్తలకు అండగా ఉంటానని శేఖర్‌రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి నివాసాన్ని సైతం కడప నుంచి ఎర్రగుంట్లకు మార్చుకున్నానని తెలిపారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటూనే ఎమ్మెల్యే అక్రమాలను ఎదుర్కొని... నాయకులు, కార్యకర్తలను ఆదుకునేందుకు అన్ని రకాలుగా పాటుపడతామన్నారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలను సహించేది లేదని హెచ్చరించారు.

ఎమ్మెల్యేకు టిక్కెట్‌ ఇవ్వరాదు: గంగవరం శేఖర్‌రెడ్డి గృహప్రవేశానికి హాజరైన పలువురు నాయకులు విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి టిక్కెట్‌ ఇవ్వరాదని, అభ్యర్థిని మార్చాలని పార్టీని డిమాండు చేశారు. గంగవరం శేఖర్‌రెడ్డి, వైఎస్‌ కుటుంబం సభ్యులు పోటీ చేసే పక్షంలో గెలుపునకు కృషి చేస్తామని... సుధీర్‌రెడ్డికి మాత్రం మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఆయన్ను నమ్మి ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోయామని చిన్నదండ్లూరు సర్పంచి రాముడు, జమ్మలమడుగు పురపాలక సంఘం కౌన్సిలర్‌ జ్ఞాన ప్రసూన, నాయకులు నాగేశ్వరరావు, పవన్‌కుమార్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, జువారీ రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఓబుళరెడ్డి, సుధాకర్‌రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా గంగవరం రాజశేఖర్‌రెడ్డి ఏకంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యాలయాన్ని ప్రారంభించడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్న నేతలు గంగవరం రాజశేఖర్‌రెడ్డిని ఆశ్రయిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు