logo

పులివెందుల... ఎందుకిలా?

సాధారణంగా ముఖ్యమంత్రి నియోజకవర్గమంటే దానిపై ప్రత్యేకంగా పోలీసు నిఘా ఉంటుంది... ఏదైనా ఘటన జరిగినా వెంటనే దర్యాప్తు జరిపి భవిష్యత్తులో పునరావృత్తం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

Updated : 29 Jan 2023 04:45 IST

ముఖ్యమంత్రి ఇలాకాలో వాహనాల దహనం
సంచలనం కలిగిస్తున్న వరుస హత్య ఘటనలు

 

వేంపల్లెలో స్వల్పంగా దహనమైన కారును పరిశీలిస్తున్న యజమాని, స్థానికులు

సాధారణంగా ముఖ్యమంత్రి నియోజకవర్గమంటే దానిపై ప్రత్యేకంగా పోలీసు నిఘా ఉంటుంది... ఏదైనా ఘటన జరిగినా వెంటనే దర్యాప్తు జరిపి భవిష్యత్తులో పునరావృత్తం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు... ఈ పరిస్థితి పులివెందుల విషయంలో కనిపించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ప్రశాంత వాతావరణం... ప్రజల్లో మచ్చ లేకుండా తమకు ప్రత్యేక గుర్తింపు కావాలనే కోరుకుంటున్న ప్రజానీకం కల నెరవేరేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ దశగా అడుగులు పడాలి... ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి...   పోలీసుల వరకు ప్రత్యేక శ్రద్ధ   సారించాలి.

ఈనాడు డిజిటల్‌, కడప: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో తరచూ జరిగే నేరాలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలో ఇతర ప్రాంతాల కంటే ఇక్కడ ఎక్కువగా జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడాదిన్నర కాలంగా పలు హత్యలు జరగ్గా వీటిల్లో రెండు రాజకీయాలకు సంబంధించినవి కావడం గమనార్హం. మరికొన్ని వివాహేతర, భూతగాదాలకు సంబంధించినవిగా నమోదయ్యాయి.

* సింహాద్రిపురం మండలం దిద్దేకుంటకు చెందిన తెదేపా నేత పరమేశ్వరరెడ్డి(61) ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. డీజిల్‌ కోసం ద్విచక్ర వాహనంపై సింహాద్రిపురానికి వెళ్లి తిరిగొస్తుండగా అడ్డగించి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. పార్టీ పరంగా తెదేపా పలుమార్లు స్పందించి.. నిందితులందరినీ అరెస్టు చేయలేదంటూ ఆరోపించింది. సెప్టెంబరులో జరిగిన హత్యకు రాజకీయపరమైన కారణాలతో వైకాపాకు చెందిన వ్యక్తులు బండరాయితో కొట్టి చంపారు.

* తొండూరు మండలం అగడూరులో తెదేపా కార్యకర్త కుళాయప్ప అనే యువకుడు పాత కక్షల నేపథ్యంలో హత్యకు గురయ్యారు. 2021, ఆగస్టులో జరిగిన ఘటనలో రాళ్లతో కొట్టి దుండగులు దారుణంగా చంపేశారు.

* తాజాగా తొండూరు మండలం ఉడవగండ్లలో సహదేవరెడ్డికు గురయ్యారు. వివాహేతర సంబంధంతోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉడవగండ్లకు చెందిన ప్రహ్లాదరెడ్డిపై బాధిత కుటుంబ సభ్యులు అనుమానించారు.

* వేంపల్లె మండలం చింతలమడుగుపల్లెకు చెందిన మహేశ్వరరెడ్డి(40) సెప్టెంబరు 26న దారుణ హత్యకు గురయ్యారు. వేకువజామున 4.30 గంటలకు ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లిన ఆయన్ను ముందస్తు ప్రణాళికతో మారణాయుదాలతో దాడి చేసి శరీర భాగాలను, తలను గుర్తుపట్టని విధంగా కిరాతకంగా చంపారు. అనంతరం తాడుతో కట్టి రహదారిపై ఈడ్చుకుంటూ వెళ్లి ఈదలబావి వద్ద మృతదేహాన్ని పడేశారు. హత్యకు వివాహేతర, భూతగాదాలు కారణమని పోలీసుల విచారణలో తేలింది.

* గతేడాది ఆగస్టులో పులివెందుల పట్టణం వైఎస్‌ భారతినగర్‌లో ఆదినారాయణరెడ్డి(50) హత్యకు గురయ్యారు. ఆయన తన నివాసంలో ఉండగానే దుండగులు కారంపొడి చల్లి... కత్తులతో హత్య చేశారు. అంతకు పులివెందుల పట్టణంలో ఇద్దరు మహిళలను పట్టపగలే హత్య చేసి చంపేశారు. ఇలా పలు నేరాలు.. హత్యలు జరిగాయి.


మిస్టరీగా వాహనాల దహనం

పులివెందులలో అర్ధరాత్రి వాహనాల దహనం ఘటనలు మిస్టరీగా మారాయి. ఇటీవల వరుసగా మూడు రోజులుగా వేంపల్లె పట్టణంలో అయిదు వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటనలు భయాందోళనను కలిగిస్తున్నాయి. ఆకతాయిల పనిగా ప్రచారం జరుగుతున్నా.. పోలీసులు నిందితులను గుర్తించలేకపోతున్నారు. దీనికి ఓ మతిస్థిమితం లేని వ్యక్తే కారణమని నెపం నెట్టేస్తున్నారు. యజమానులు తెల్లవారు జామున బయటకొచ్చి చూసుకుంటే.. వాహనాలు తగులబడి పోయిన ఘటనలు కనిపిస్తున్నాయి.

* వేంపల్లె రామాలయం వీధిలో ఓ స్కూటీని కాల్చేశారు. ఆ ఇంటికి ఎదురుగానే మరో స్కూటీకి నిప్పుపెట్టారు. మేదరవీధిలో రెండు ద్విచక్ర వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.

*  కడప నుంచి వేంపల్లెలోని తన బంధువుల ఇంటికి వచ్చిన ఓ మహిళ స్కూటీని బయటపెట్టగా తగలబెట్టారు.

* ఎస్బీఐ కాలనీలో కారును రాళ్లతో ధ్వంసం చేసి... నిప్పు పెట్టారు. పట్టణంలో జరిగిన వరుస ఘటనలన్నీ కూడా అర్ధరాత్రి దాటిన తర్వాతే జరిగాయని బాధితులు వాపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆకతాయిలు ద్విచక్ర వాహనాల్లో తిరుగుతూ ఇలాంటి ఘటనలు చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనూ పులివెందులతో పాటు కడప నగరంలో ఆకతాయిలు వరుసగా ఇళ్ల ముందు నిలిపిన వాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలు వెలుగు చూశాయి. వేంపల్లెలో కూడా ఆకతాయిలే చేసి ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

తాజా ఘటనేమంటే

వేంపల్లెలో వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం మళ్లీ మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో నాలుగు ద్విచక్ర వాహనాలతోపాటు కారుకు నిప్పు పెట్టారు. పోలీసులు నిఘా పెట్టి ఒక మానసిక రోగిపై అనుమానంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజులుగా మౌనంగా ఉన్న గుర్తు తెలియని దుండగులు మళ్లీ రంగంలోకి దిగి వాహనాలకు నిప్పు పెడుతున్నారు.

* వేంపల్లెలో తిరుమల సినిమా హాల్‌ వద్ద గత గురువారం తెల్లవారు జామున మహమ్మద్‌ రఫీ పార్కింగ్‌ చేసిన కొత్త కారుపై పెట్రోల్‌ పోసి నిప్పు పెడుతుండగా స్థానిక మహిళ చూసి కేకలు వేశారు. దీంతో దుండగులు పరారైనట్లు వారు తెలిపారు. వేంపల్లెలో వరుసగా వాహనాలకు నిప్పు పెడుతుండడం పోలీసులకు సవాలుగా మారింది. వేంపల్లె సీఐ నివాసం ఉంటున్న ఇంటి కిందనే ఘటన జరగడం విశేషం.

ప్రత్యేక నిఘా పెట్టాం

వారం రోజుల విరామం అనంతరం మరో వాహనం దహన ఘటన గురువారం వేకువజామున జరిగింది. ప్రత్యేక నిఘా పెట్టాం. వివిధ బృందాలను నియమించాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. నేరాలను నియంత్రిస్తాం.

శ్రీనివాసులు, డీఎస్పీ, పులివెందుల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు