logo

వేతనాలకు ఎదురుచూపులు!

వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో పనిచేస్తున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి గత కొన్ని నెలలుగా వేతనాలందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated : 29 Jan 2023 04:19 IST

వైయస్‌ఆర్‌లో రూ.5.11 కోట్లు, అన్నమయ్యలో రూ.4.36 కోట్ల బకాయిలు
ఎనిమిది నెలలుగా చెల్లింపుల్లేవంటున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బంది

రైల్వేకోడూరు మండలంలో అరటి తోటను పరిశీలిస్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే, కడప: వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో పనిచేస్తున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి గత కొన్ని నెలలుగా వేతనాలందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమై అవగాహన కల్పిస్తూ సహజ సాగులో మహాయజ్ఞంలా పనిచేస్తున్న వీరు వేతనాలకు పడిగాపులు కాస్తున్నారు. నెలలకొద్దీ ఎదురుచూసినా నిరాశే ఎదురవుతోంది.

* వైయస్‌ఆర్‌ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ద్వారా 2022-23 సంవత్సరంలో 64,262 మంది రైతులను భాగస్వామ్యం చేయాల్సి ఉండగా, 57,224 మందికి అవగాహన కల్పించి ఆసక్తి కల్పించారు. ఈసారి 74,935 ఎకరాలు లక్ష్యం కాగా, ఇప్పటికే 70,160 ఎకరాల్లో సాగు చేయించామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రామ, మండల, డివిజన్‌, జిల్లా స్థాయిల్లో 757 మంది పనిచేస్తున్నారు. వీరిలో రెగ్యులర్‌ సిబ్బందికి మాత్రం క్రమం తప్పకుండా వేతనాలిస్తుండగా, మిగతావారికి గతేడాది మే నుంచి డిసెంబరు వరకు వేతనాలు చెల్లించలేదు. ఎనిమిది నెలలకు మొత్తం రూ.5.11 కోట్లు చెల్లించాల్సి ఉంది.

* అన్నమయ్య జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 51,772 మంది రైతుల ద్వారా 62,396 ఎకరాల్లో సహజ సేద్యం ద్వారా పంటలు పండించాలని ప్రణాళికను రూపొందించారు. ఇప్పటికే 44,279 మంది రైతుల ద్వారా 52,762 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో గతేడాది మే నుంచి డిసెంబరు వరకు పనిచేస్తున్న సిబ్బందికి రూ.4.36 కోట్లు వేతనాలు ఇవ్వాల్సి ఉంది.

కుటుంబ జీవనం సాగేదెలా?

ఐబీ ఐసీఆర్‌పీకి నెలకు రూ.3 వేలు, ఐసీఆర్‌పీ సొంత పంచాయతీలో పనిచేస్తే రూ.6 వేలు, ఇతర పంచాయతీల్లో సేవలందిస్తే రూ.9 వేలు, పొరుగు మండలంలో విధులు నిర్వర్తిస్తుంటే రూ.11 వేలు ఇస్తున్నారు. సకాలంలో వేతనాలు రాకపోవడంతో కొంతమంది మధ్యలోనే మానేస్తున్నారు. తిరిగి కొత్త వారిని తీసుకుని శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటోంది. నెలల తరబడి వేతనాలందకపోవడంతో కుటుంబ జీవనం ఎలా సాగుతుందని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. తమ గోడు ఎవరికీ చెప్పుకొన్నా అరణ్యరోదనగా మారిందని ఆక్రోశిస్తున్నారు. వేతనాల చెల్లింపుల్లో జాప్యంపై ఉన్నతాధికారులను ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని నిలదీసినా ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుందని భయపడి ఎలాంటి ఆందోళన కార్యక్రమాలను చేయడం లేదని వాపోతున్నారు.

నిధులు రాగానే వేతనాలు చెల్లిస్తాం

ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి గతేడాది మే నుంచి నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే సమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు రాగానే అందరికీ వేతనాలు చెల్లిస్తాం. త్వరలో వేతనాలొచ్చే అవకాశం ఉంది.                                  

రామకృష్ణమరాజు, రమేష్‌బాబురావు, డీపీఎంలు, వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని