logo

సంపన్న వర్గాల అనుకూల బడ్జెట్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేవలం సంపన్న వర్గాల కోసమే కేటాయించబడిందని, ఇది సామాన్యులను నిరాశకు గురిచేసిన బడ్జెట్‌ అని సీపీఎం, సీపీఐ నాయకులు ధ్వజమెత్తారు.

Published : 03 Feb 2023 00:50 IST

వేర్వేరు ప్రాంతాల్లో సీపీఐ, సీపీఎం ఆందోళన

నీరుగట్టువారిపల్లెలో రాస్తారోకో చేస్తున్న సీపీఎం నాయకులు

మదనపల్లె పట్టణం, మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేవలం సంపన్న వర్గాల కోసమే కేటాయించబడిందని, ఇది సామాన్యులను నిరాశకు గురిచేసిన బడ్జెట్‌ అని సీపీఎం, సీపీఐ నాయకులు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వార్షిక బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సీపీఎం నాయకులు రాస్తారోకో చేశారు. గురువారం నీరుగట్టువారిపల్లెలోని మార్కెట్‌యార్డు ఎదురుగా సీపీఎం రాస్తారోకో, సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కృష్ణప్పల ఆధ్వర్యంలో జరిగిన ఆ ఆందోళన కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ సామాన్యులకు ఉపయోగం లేకుండా, మూల ధన వ్యయం కూడా సందపన్నులకు లబ్ధి చేకూరే విధంగా ఉందని, ప్రజా, కార్మిక, శ్రామిక వ్యతిరేక బడ్జెట్‌గా ఆరోపించారు. రూ.42 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెడితే అందులో సామాన్యులకు అందించే పథకాలకు కోత విధించారని, రైతులకు సంబంధించి రాయితీల్లో, ఉపాధి హామీ పథకంలో, ఆహార ధాన్యాల్లో, డీజల్‌, గ్యాస్‌, పీఎం పోషక పథకాల్లో కోతలు పెట్టారన్నారు. రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదాగాని, విభజన హామీలుగాని పారిశ్రామిక కారిడార్‌, యూనివర్సిటీలు, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు నిధులు ఊసేలేదని, దీంతో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆ రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్‌ ఇచ్చారని విమర్శించారు. రాస్తారోకో కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు నాగరాజు, సురేంద్ర, వెంకటేష్‌, రమణ, కందస్వామి ధర్నాలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ, పట్టణ కార్యదర్శి మురళి, రెడ్డెప్ప, రవి, తిరుమల, నవీన్‌, శోభ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని