logo

గడప దాటని బిల్లులు!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పనుల బిల్లులకూ మోక్షం లభించడంలేదు.

Published : 03 Feb 2023 01:08 IST

వైయస్‌ఆర్‌లో నాలుగింటికే మోక్షం
అన్నమయ్య జిల్లాలో కాస్త నయం
ఈనాడు డిజిటల్‌, కడప

జమ్మలమడుగు పట్టణ పరిధిలోని వేంకటేశ్వర కాలనీలో సిమెంటు రోడ్డు నిర్మాణం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పనుల బిల్లులకూ మోక్షం లభించడంలేదు. ఓ వైపు కార్యక్రమం సక్రమంగా నిర్వహించడంలేదంటూ సీఎం జగన్‌ ఎమ్మెల్యేలకు అక్షింతలు వేస్తున్నారు. రాష్ట్రంలో 40 మంది వెనుకబడిన ఎమ్మెల్యేలుండగా, వారిలో నలుగురు అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల నుంచి ఉన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి సీఎం సమీక్షిస్తూ.. ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సైతం బిల్లులు కాకపోవడం గమనార్హం.

* ఇతరత్రా కార్యక్రమాల తరహాలోనే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోంది. బిల్లుల విషయమై అధికార పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కింద బిల్లుల చెల్లింపు ఆలస్యం ఉండదంటూ అభయం ఇవ్వడంతో నేతలు పనులు చేయడానికి ముందుకొచ్చారు. బిల్లులు అప్‌లోడ్‌ చేయడంలో సాంకేతికంగా సమస్యలు ఎదురవుతున్నాయి. వైయస్‌ఆర్‌ జిల్లాలో 1,217 పనులకు పరిపాలనాపరమైన అనుమతులు లభించగా 1,034 పనులు చేపట్టారు. వీటిలో 122 పనులు పూర్తికాగా తొమ్మిదింటిని మాత్రమే సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేయగలిగారు. నాలుగు బిల్లులకు సంబంధించి చెల్లింపులు జరిగాయి. వైయస్‌ఆర్‌ జిల్లా కంటే అన్నమయ్య జిల్లా కాస్త నయమనిపిస్తోంది. జిల్లాలో 46 బిల్లులను అప్‌లోడ్‌ చేయగలిగారు. రాష్ట్రంలోనే ముందంజలో ఉండే విధంగా నిలబడిగలిగారు. గ్రామీణ ప్రాంతాలకు నిధులు వచ్చినప్పటికీ పురపాలక, నగర పాలక సంఘాల పరిధిలో పనులకు నిధులు అందుబాటులోకి రాలేదు. చాలా వరకు నగర, పట్టణాల్లోనే పనులకు ఆమోదం లభించింది.

మందగించిన కార్యక్రమం

ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా సూచించినా అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టితో నిర్వహించడంలేదు. రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల్లో పూర్తిస్థాయిలో ఒక్క సచివాలయంలోనూ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఆరింటిలో కార్యక్రమాన్ని పాక్షికంగానే పూర్తిచేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. పులివెందులలో 90 సచివాలయాలకుగానూ  12 చోట్ల మాత్రమే బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డి నిర్వహించగలిగారు. ప్రొద్దుటూరులో మాత్రం 82 గానూ 74 పూర్తి చేశారు. జమ్మలమడుగులో 99 గానూ 48, కమలాపురంలో 82గానూ 40, కడపలో 94 గానూ 37, మైదుకూరులో 83 గానూ 33, బద్వేలులో 96 గానూ 34 సచివాలయాల్లో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇలా వైయస్‌ఆర్‌ జిల్లా పరిధిలో 645 సచివాలయాలకుగానూ 278 పూర్తి చేశారు. అన్నమయ్య జిల్లాలో 501 గానూ 207 సచివాలయాల్లో కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో నిర్వహించారు. ఇటీవల రెండు జిల్లాలోనూ కార్యక్రమం నిర్వహణ మందగించింది. 

పట్టణాలకు నిధులు రావాల్సి ఉంది

గ్రామీణ ప్రాంతాల పనులకు నిధులు కేటాయించినప్పటికీ పట్టణ/ నగర ప్రాంతాల్లోని పనులకు రావాల్సి ఉంది. సాంకేతికపరమైన కారణాలతో నిధులు కేటాయింపులో జాప్యం జరిగింది. త్వరలోనే నిధులొచ్చే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని పనులకు ఆయా విభాగాలకు కేటాయింపులు జరిగాయి. 

వెంకట్రావు, సీపీవో, వైయస్‌ఆర్‌ జిల్లా

రెండు జిల్లాల్లో చేపట్టిన పనులివే

సిమెంటు రహదారులు, మురుగు కాలువల నిర్మాణం, మరమ్మతులు, తాగునీటి సరఫరా, విద్యుత్తు లైన్లు, స్తంభాల ఏర్పాటు, ప్రహరీలు, కల్వర్టుల

నిర్మాణ పనులు నిర్వహించిన శాఖలు: పంచాయతీరాజ్‌, పుర/నగరపాలక సంస్థలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఎస్పీడీసీఎల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు