logo

తితిదేపై పూల భారం!

ఉమ్మడి కడప జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న విలీన ఆలయాల్లో మూలవరులు, ఉత్సవ, దేవతామూర్తులకు రోజువారీగా పుష్పాలంకరణ చేస్తున్నారు.

Published : 03 Feb 2023 01:08 IST

ఈసారి ధరలను పెంచిన గుత్తేదారులు
టెండరు పత్రాలు పరిశీలించిన అధికారులు

గుత్తపత్రాలను పరిశీలిస్తున్న తితిదే అధికారులు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఉమ్మడి కడప జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న విలీన ఆలయాల్లో మూలవరులు, ఉత్సవ, దేవతామూర్తులకు రోజువారీగా పుష్పాలంకరణ చేస్తున్నారు. పూలతో పూజా కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. సరఫరా చేయడానికి అధికారులు గుత్తపత్రాలను ఆహ్వానించారు. ఈసారి గుత్తేదారులు మునుపటి కంటే అధికంగా ధరలను నమోదు చేశారు. ఇలా ఆమాంతం పెంచడంతో తితిదేపై అదనపు భారం పడనుంది. వైయస్‌ఆర్‌ జిల్లాలో జమ్మలమడుగు నారాపుర వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రతిరోజూ 33 కిలోలు పూలు అవసరం. ప్రస్తుతం కిలో రూ.95 వంతున తీసుకుని గుత్తేదారులు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఒప్పంద గడువు ముగియడంతో ఒంటిమిట్ట ఉప కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో గురువారం గుత్తపత్రాలను ఆహ్వానించారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దేవళంపల్లికి చెందిన పి.అమరావతి కిలోకి రూ.130, ఇదే గ్రామ నివాసి పి.పద్మావతి రూ.136, రాయచోటి మండలం కొత్తపేటకు చెందిన సి.రవీంద్రరాజు రూ.145కి సరఫరా చేస్తామని గుత్తపత్రాలను సమర్పించారు. డిప్యూటీ ఈవో నటేష్‌బాబు, అకౌంట్సు విభాగం ఏఈవో గోపాల్‌రావు, పర్యవేక్షకుడు వెంకటేశయ్య ఆధ్వర్యంలో పరిశీలించారు. ముగ్గురిలో ధరలను తక్కువగా నమోదు చేసిన పద్మావతితో అధికారులు మధ్యేమార్గంగా చర్చించారు. చివరికి కిలోకి రూ.110 ఇస్తే సరఫరా చేస్తామని ఆమె అంగీకరించారు. ఇప్పటి కంటే కిలోపై రూ.15 భారం పెరిగింది. ఈ లెక్కన రోజుకి 33 కిలోలపై రూ.495 భారం పడనుంది. ఏడాదికి రూ.1.80 లక్షల మేర తితిదేపై అదనపు వడ్డన పడనుంది. అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో చెన్నకేశవ, సిద్దేశ్వర ఆలయాలకు ప్రతిరోజూ 30 కిలోలు తెప్పించాలని ఉన్నతాధికారులు అనుమతిచ్చారు. ప్రస్తుతం కిలోకి రూ.68 మేర చెల్లిస్తున్నారు. తాజాగా టెండర్లు పిలవడంతో ముగ్గురు పోటీ పడ్డారు. పి.పద్మావతి కిలోకి రూ.105, ఎస్‌.వినోద్‌కుమార్‌ రూ.120, సి.రవీంద్రరాజు రూ.140 వంతున ఇస్తే సరఫరా చేస్తామని నమోదు చేశారు. వీరిలో పి.పద్మావతితో ఇప్పటి కంటే అధికంగా నమోదు చేశారు. ఇంత ఎక్కువగా ఇవ్వలేమని అధికారులు చర్చించారు. చివరికి రూ.95కు ఇవ్వడానికి సమ్మతించారు. ఇప్పటి ధర కంటే కిలోపై అదనంగా రూ.27 వంతున, రోజుకి 30 కిలోలకు రూ.810 భారం పడుతుంది. ఏడాదికి రూ.2.93 లక్షలకుపైగా అదనం భారం కానుంది. జమ్మలమడుగు, తాళ్లపాక ఆలయాలకు పూల సరఫరా గుత్తేదారులు అధికంగా నమోదు చేసిన ధరలపై డిప్యూటీ ఈవో పి.వి.నటేష్‌బాబుతో ‘న్యూస్‌టుడే’ మాట్లాడగా గుత్తపత్రాలను పరిశీలించామని, ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఉన్నతాధికారుల అనుమతి కోసం ప్రతిపాదనలు పంపుతున్నామని, అక్కడ నుంచి అనుమతులొస్తే పూల సరఫరా చేయాలని గుత్తేదారుతో ఒప్పందం చేసుకుంటామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని