logo

పాత కక్షలే హత్యకు కారణం

కడప ఒకటో పట్టణ ఠాణా పరిధిలో జరిగిన జంట హత్యల కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటశివారెడ్డి తెలిపారు.

Published : 03 Feb 2023 01:31 IST

ముగ్గురు నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటశివారెడ్డి, పక్కన సీఐ నాగరాజు,సిబ్బంది

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప ఒకటో పట్టణ ఠాణా పరిధిలో జరిగిన జంట హత్యల కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటశివారెడ్డి తెలిపారు. పాత కక్షలే హత్యకు కారణమని వెల్లడించారు. ‘కడప రాజారెడ్డి వీధికి చెందిన పేట రేవంత్‌ (22), కో-ఆపరేటివ్‌ కాలనీకి చెందిన చెరువుపల్లి అభిలాష్‌(24) ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ బుధవారం రాత్రి మద్యం తాగడానికి సాయిబాబా థియేటర్‌ సమీపంలో ఉన్న బార్‌కు వెళ్లారు. ఎర్రముక్కపల్లెకు చెందిన గంగాధర్‌తో రేవంత్‌కు పాతకక్షలున్నాయి. గంగాధర్‌ కూడా అదే బార్‌లో మద్యం తాగుతున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రేవంత్‌ను హత్య చేయాలని నిర్ణయించుకుని గంగాధర్‌ తన సోదరుడైన రాఘవ, స్నేహితుడు ఇందిరానగర్‌కు చెందిన షేక్‌ ఖాదర్‌వలీకి ఫోన్‌ చేసి పిలిపించారు. బార్‌ ఆవరణలో రేవంత్‌తో ఘర్షణ పడ్డారు. నిందితులు ముగ్గురు తమ వద్ద ఉన్న పిడిబాకుతో విచక్షణారహితంగా పొడవడంతో రేవంత్‌ అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డుకున్న అభిలాష్‌ను కత్తితో పొడవడంతో అతను చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. నిందితులు సీకేదిన్నె మండలం, పబ్బాపురం వద్ద ఉండగా అరెస్టు చేసి వారి నుంచి రెండు పిడిబాకులు, రెండు చరవాణులు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. హత్యలు జరిగిన 24 గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసిన సీఐ నాగరాజును అభినందించారు. సమావేశంలో ఎస్సై పెద్దఓబన్న, సిబ్బంది పాల్గొన్నారు.


కత్తి పోట్లకు గురైన యువకుడి మృతి

కడప నేరవార్తలు : ప్రత్యర్థుల నుంచి స్నేహితున్ని విడిపించే యత్నంలో కత్తిపోట్లకు గురైన అభిలాష్‌ (24) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. కడప రాజారెడ్డివీధికి చెందిన రేవంత్‌ (27), కో-ఆపరేటివ్‌ కాలనీకి చెందిన అభిలాష్‌ (24) స్నేహితులు. బుధవారం రాత్రి ఇద్దరూ సాయిబాబా థియేటర్‌ సమీపంలో ఉన్న బార్‌ వద్ద జరిగిన ఘర్షణలో రేవంత్‌ను ప్రత్యర్థులు హత్య చేసిన విషయం విధితమే. అడ్డొచ్చిన అభిలాష్‌పైనా దాడిచేసి కత్తులతో పొడిచారు. గాయపడిన యువకుడిని సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గురువారం ఉదయం తిరుపతికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. తల్లిదండ్రులిచ్చిన ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నెల రోజుల్లో ఉద్యోగం

కడప కో-ఆపరేటివ్‌ కాలనీకి చెందిన సి.ప్రసాద్‌ సిద్దవటం ఠాణాలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తూ 2021లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రసాద్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వారిలో రెండో కొడుకు అభిలాష్‌. డిగ్రీ వరకు చదువుకున్నారు. మరో నెల రోజుల్లో కారణ్యనియామకం కింద ఉద్యోగం వస్తుందని, కుటుంబానికి అండగా ఉంటాడని ఆశిస్తే ఇలా హత్యకు గురయ్యారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని