logo

ఈ సారీ రిక్తహస్తమే!

ప్రొద్దుటూరు-కంభం రైల్వేలైను పనులకు 2023-24కు రూ.కోటి నిధులు కేటాయించారు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖకు మూలధన కేటాయింపులు ఈసారి రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ జిల్లాలోని నాలుగు రైళ్ల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అరకొరే.

Published : 04 Feb 2023 05:05 IST

ర్రైల్వేబడ్జెట్‌లో ఉమ్మడి కడప జిల్లాకు నిధుల కేటాయింపులు అరకొర
కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ మార్పుతో సమస్యలు
రైల్వేలైను పూర్తవ్వడానికి మరి కొన్నేళ్లు సమయం పట్టే అవకాశం
- న్యూస్‌టుడే, కడప ఏడురోడ్లు

పెండ్లిమర్రి వద్ద కడప - బెంగళూరు రైల్వేట్రాక్‌పై పెరిగిన పిచ్చిమొక్కలు

ప్రొద్దుటూరు-కంభం రైల్వేలైను పనులకు 2023-24కు రూ.కోటి నిధులు కేటాయించారు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖకు మూలధన కేటాయింపులు ఈసారి రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ జిల్లాలోని నాలుగు రైళ్ల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అరకొరే. రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో ఎంపీలున్నప్పటికీ నిధులు తెప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు.

ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గం 126 కిలోమీటర్లు. ఈ మార్గం నాలుగేళ్ల కిందటే పూర్తయ్యింది. ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. అందుబాటులోకి వచ్చిన ఈ మార్గానికి 2023-24 బడ్జెట్‌లో రూ.1.70 కోట్లు కేటాయించారు.

ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో బడ్జెట్‌లో రైల్వేశాఖకు రూ.2.42 లక్షల కోట్లు కేటాయించారు. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా విషయానికొస్తే కడప-బెంగళూరు రైల్వే మార్గం జిల్లా వాసుల చిరకాల కోరిక. రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గానికి సంబంధించిన అలైన్‌మెంట్‌ మార్చడం, దానికి కేంద్రం ఇంతవరకు అనుమతులు ఇవ్వకపోవడంతో ఈ ఏడాది నిధులు కేటాయించలేదు. అయిదేళ్లలో పూర్తిచేస్తామన్న ఈ ప్రాజెక్టు 12 ఏళ్లు గడిచినా ఏమాత్రం పురోగతి లేకపోవడం గమనార్హం. ఎర్రగుంట్ల-నంద్యాల మార్గాం పూర్తయినప్పటికీ అక్కడ డబ్లింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. విద్యుద్దీకరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఓబులవారిపల్లె- కృష్ణపట్నం రైల్వేలైనులో గూడ్సు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ మార్గంలో ప్యాసింజరు రైళ్లకు ఇప్పటికీ అనుమతి రాలేదు. ప్రొద్దుటూరు-కంభం రైల్వేలైను పనులు జరగడం లేదు. మొత్తం మీద ఉమ్మడి కడప జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు కావాల్సిన రైలు మార్గాలు, ఇతరత్రా సదుపాయాల కల్పనకు కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు శూన్యమనే చెప్పాలి.

* ప్రధానంగా కడప-బెంగళూరు రైల్వేలైన్‌పై ఉమ్మడి కడప జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సుమారు 255.4 కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ నిర్మించాలని భావించారు. తొలుత ఈ ప్రాజెక్టును రూ.1023 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం అనుమతి పొందినప్పటికీ శంకుస్థాపన నాటికి అంచనా వ్యయం రూ.1,784.64 కోట్లకు చేరింది. 2010-11లో రూ.29 కోట్లు, 2011-12లో రూ.50 కోట్లు, 2012-13లో రూ.38 కోట్లు, 2013-14లో రూ.70 కోట్లు, 2014-15లో రూ.30 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో కడప-పెండ్లిమర్రి వరకు 22 కిలోమీటర్ల మేర రైల్వేట్రాక్‌ ఏర్పాటు చేశారు. పెండ్లిమర్రి నుంచి గండి వరకు భూసేకరణ చేపట్టారు. ఆపై రాష్ట్ర ప్రభుత్వం తాను ఇవ్వాల్సిన 50 శాతం వాటాను నిధుల లేమితో ఇవ్వలేకపోవడం... రోజులు గడిచే కొద్దీ నిర్మాణ వ్యయం పెరగడంతో కడప-బెంగళూరు రైల్వేలైను అలైన్‌ మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వద్దనడం... దాని స్థానంలో ముద్దనూరు నుంచి ముదిగుబ్బ వరకు కేవలం 72 కిలోమీటర్లు రైల్వేట్రాక్‌ నిర్మిస్తే కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, పులివెందుల మీదుగా అనంతపురం జిల్లా ముదిగుబ్బకు వెళ్లి అక్కడి నుంచి కనెక్టివిటీ ట్రాక్‌ ద్వారా బెంగళూరుకు చేరవచ్చునని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించుకుంది... ఈ విధంగా చేయడంతో రైల్వేట్రాక్‌ నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా పనులను కూడా వేగవంతంగా చేయవచ్చునని రాష్ట్రప్రభుత్వం భావించి అందుకు సంబంధించిన నూతన అలైన్‌మెంట్‌ను కేంద్ర ప్రభుత్వానికి గతేడాది పంపింది. ఈ అలైన్‌మెంట్‌ మార్పునకు ఇంత వరకు ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. ఈ మార్గం నిర్మాణానికి 2015-16 నుంచి నిధులు నిలిచిపోగా, ఈసారి రైల్వే బడ్జెట్‌లో కేవలం రూ.10.01 లక్షలు కేటాయించారు.

* ఓబులవారిపల్లె-కృష్ణపట్నంకు 113 కిలోమీటర్ల పొడవునా రైలు మార్గం నిర్మించారు. ఈ మార్గంలో గతేడాది నుంచి గూడ్సు రైళ్లు తిరుగుతున్నాయి. ఈ మార్గంలో ప్యాసింజరు రైళ్లను నడపాల్సి ఉంది. అందుకు సంబంధించిన అనుమతులు ఇంతవరకు లభించలేదు. సరకు రవాణా ద్వారా వచ్చే ఆదాయంపైనే రైల్వేశ్రద్ధ కనబరుస్తోందని, ప్రయాణికుల గురించి పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఈ మార్గంలో ప్యాసింజరు రైళ్లను నడిపితే కడప నుంచి నెల్లూరుకు వెళ్లేందుకు దూరం తగ్గుతుంది. ప్రస్తుతం కడప నుంచి తిరుపతికి వెళ్లి అక్కడ నుంచి శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు మీదుగా నెల్లూరుకు పోవాల్సి ఉంటుంది. ఓబులవారిపల్లె నుంచి కృష్ణపట్నంకు వెళితే చాలా దూరం తగ్గుతుంది. దీంతోపాటు జిల్లా నుంచి విజయవాడకు వెళ్లేందుకు కూడా ప్రయాణ దూరం తగ్గుతుంది. ఓబులవారిపల్లె నుంచి కృష్ణపట్నం /నెల్లూరుకు చేరుకున్న అనంతరం నెల్లూరు నుంచి ప్రకాశం, గుంటూరు మీదుగా విజయవాడకు వెళ్లవచ్చు. ఇప్పటికే గూడ్సు రైళ్లు నడుస్తున్న ఈ మార్గానికి బడ్జెట్‌లో కేవలం రూ.1,000 కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు