logo

వాయుబండపై బాదుడు

గ్యాస్‌ సిలిండర్‌ ఇంటికి తెచ్చినప్పుడు రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని.. అదనంగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.

Published : 04 Feb 2023 05:05 IST

ఒక్కో సిలిండర్‌ డెలివరీకి అదనంగా రూ.50 వసూలు
జిల్లాలో వినియోగదారుపై నెలకు రూ.1.80 కోట్ల భారం

గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్లు

జమ్మలమడుగు, పులివెందుల, న్యూస్‌టుడే: గ్యాస్‌ సిలిండర్‌ ఇంటికి తెచ్చినప్పుడు రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని.. అదనంగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ ఇటీవల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వసూలు చేసినట్లయితే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, ఇంధన సంస్థల మార్కెటింగ్‌ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. క్షేత్ర స్థాయిలో వాటిని అమ లు చేయాల్సిన జిల్లా పౌరసరఫరాల శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీలపైనే ఉంటోంది. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,111 ఉంది. ఇంటికి చేరాలంటే డెలివరీ చేసే బాయ్‌ రూ.30 నుంచి రూ.40 వరకు చేయి తడపాల్సి ఉంటుంది. లేకుంటే తర్వాత బుక్‌ చేసుకునే వాయుబండ తూకం తగ్గడమో, జాప్యం చేయడమో జరుగుతుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పైఅంతస్తుల్లో ఉన్నవారికి మరింత మొత్తం వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

* జిల్లాలో గృహ వినియోగదారులకు సంబంధించిన కనెక్షన్లు 5,99,802 ఉన్నాయి. కనీసం నెలకు ఒకసారి వాయుబండను సగటున బుక్‌ చేస్తున్నారు. అదనంగా వసూలు చేస్తున్న రూ.30తో లెక్కిస్తే సుమారు నెలకు రూ.1.80 కోట్లు అవుతోంది. ఏడాదికి అదనపు సొమ్ము విలువ రూ.21.60 కోట్లు అవుతోంది. పెద్ద పట్టణాల్లో రూ.40 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


5 కి.మీ.లోపు అయితే అవసరం లేదు

5 కి.మీ. లోపు బిల్లుపై పేర్కొన్న మొత్తం కంటే అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ పరిధి దాటితే నిబంధనల ప్రకారం ఇస్తే చాలు. డెలివరీ బాయ్‌లు డిమాండ్‌ చేస్తే స్థానిక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీలకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

సుబ్బారెడ్డి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని