logo

మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి : కలెక్టర్‌

మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేలా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు.

Updated : 05 Feb 2023 03:27 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయరామరాజు, పక్కన జేసీ సాయికాంత్‌వర్మ, అధికారులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేలా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు. శనివారం కడప కలెక్టరేట్‌లోని వీసీ హాలులో వివిధ శాఖల అధికారులు, శివాలయాల కమిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పొలతల, నిత్యపూజస్వామికోన,  బ్రహ్మంగారి మఠం, ఈశ్వరీదేవి, అగస్త్యేశ్వరస్వామి, మల్లెంకొండేశ్వరస్వామి, అల్లాడుపల్లె వీరభద్రస్వామి, లంకమల్లేశ్వరస్వామి, కన్యతీర్థం, అగస్త్యేశ్వరకోన, నాగనాదేశ్వరస్వామి, భానుకోటేశ్వరస్వామి తదితర శైవక్షేత్రాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి క్షేత్రం వద్ద పోలీసు కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్తు సరఫరా, 108, 104 వాహనాలు, వైద్య శిబిరాలు, రహదారులు  తదితర అన్ని అంశాలపై ఇప్పటి నుంచే దృష్టిసారించాలన్నారు. ట్రాఫిక్‌, రహదారి, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ద్విచక్రవాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. తక్షణమే అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జేసీ సాయికాంత్‌వర్మ మాట్లాడుతూ ఆలయాల వద్ద విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవాల గోడపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, డీఆర్వో గంగాధర్‌గౌడ్‌, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌మీనా, ఆర్డీవోలు శ్రీనివాసులు, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, డీఎస్పీ శివారెడ్డి, దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ శంకర్‌బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ః జిల్లాలో పేదరిక నిర్మూలనకు స్వయం సహాయ బృందాలు చొరవచూపాలని కలెక్టర్‌ విజయరామరాజు సూచించారు. కలెక్టరేట్‌లోని వీసీ హాలులో డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ఆయన సమీక్ష చేపట్టారు. సామాజిక భద్రతలో భాగంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి సంఘాల పటిష్టతకు చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్‌, మెప్మా పీడీ రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని