logo

నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు : ఎస్పీ

ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారి భద్రతపై ఏజెంట్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు సూచించారు.

Published : 05 Feb 2023 02:22 IST

ఏజెంట్లతో చర్చిస్తున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

రాయచోటి, న్యూస్‌టుడే: ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారి భద్రతపై ఏజెంట్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు సూచించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన ఏజెంట్లు, బాధితులతో సమావేశమయ్యారు. పాస్‌పోర్టులు, వీసాలు జారీ విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేకుంటే సంబంధిత ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వాసులను గల్ఫ్‌ దేశాలకు పంపిన అనంతరం వారికి అక్కడ సరైన ఉపాధి లేకపోవడంతోపాటు ఇతర ఇబ్బందులు పడుతుంటే వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని సూచించారు. జిల్లాలో 40 శాతం మంది పేదలు ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాల బాట పడుతున్నారని, కేవలం ఏజెంట్లను నమ్మి వెళ్లేవారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఏజెంట్లపై ఉందన్నారు. ఆయా దేశాల్లో ఇబ్బందులు తలెత్తినా, అకాల మరణాలు సంభవించినా ఎవరిని సంప్రదించాలి? ఎలా ఇబ్బందుల నుంచి బయటపడాలో సూచించి వారికి సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. అనారోగ్యం, ఇతర కారణాలతో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను స్వగ్రామాలకు రప్పించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. డబ్బులకు ఆశపడి నకిలీ వీసాలతో గల్ఫ్‌దేశాలకు పంపే ఏజెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడిన కొంతమంది బాధితుల ద్వారా అక్కడి కష్టాలను ఏజెంట్లకు వివరించారు. జిల్లాలోని బాధితులకు పోలీసుశాఖ ద్వారా న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలోని పీలేరు, మదనపల్లె, రాయచోటి, రాజంపేట ప్రాంతాలకు చెందిన పలువురు బాధితులు ఎస్పీకి తమ సమస్యలు విన్నవించారు. సమావేశంలో ఏఎస్పీ రాజ్‌ కమల్‌, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ సత్యనారాయణ, ఎస్‌.ఐ.మహమ్మద్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని