logo

ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి : కలెక్టర్‌

జిల్లాలోని వైద్య సిబ్బంది తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు వేయాలని కలెక్టర్‌ గిరీష ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు.

Updated : 05 Feb 2023 03:37 IST

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి, న్యూస్‌టుడే: జిల్లాలోని వైద్య సిబ్బంది తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు వేయాలని కలెక్టర్‌ గిరీష ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో 192 మంది హైరిస్క్‌ గర్భిణులున్నారని,. వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రసవ తేదీలకు ముందే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వైద్యసేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పక్కాగా ఫ్యామిలీ ఫిజీషియన్‌ అమలు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా 10 నుంచి 19 ఏళ్ల వయసు గల బాలబాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వసతిగృహాలను సందర్శించి విద్యార్థులకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు బాధ్యతగా వైద్య సేవలందించడంతోపాటు ఆరోగ్య గుర్తింపు కార్డుల తయారీ పక్కాగా జరగాలన్నారు. ఆసుపత్రులకొచ్చే వారికి తప్పనిసరిగా రక్తపోటు, మధుమేహం, హిమోగ్లోబిన్‌లను తరచూ పరీక్షించి తగిన సూచనలు, సలహాలివ్వాలన్నారు. బాలింతల మరణాలు సంభవిస్తే ఏఎన్‌ఎం, సంబంధిత వైద్యాధికారిని బాధ్యులను చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


ప్రభుత్వ ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలి: పాడి రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అమూల్‌ పాలసేకరణ 70 శాతం పెరగాలని, పాడి రైతులకు అవసరమైన రుణాలు విరివిగా అందించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 12,871 మంది పాడి రైతులు నమోదైనట్లు తెలిపారు. డీసీసీ బ్యాంకుల ద్వారా పాడి రైతులకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలివ్వాలని, సక్రమంగా చెల్లించినవారికి గేదెల కొనుగోలుకు రుణ వసతి కల్పించాలని ఆదేశించారు. నాణ్యమైన దాణా, మినరల్‌ మిక్చర్‌, కాల్షియం తదితర వాటిని రాయితీపై రైతులకు అందిస్తామన్నారు. అమూల్‌కు పాలు పోసే వారికి లీటరుకు రూ.35 నుంచి రూ.40 వరకు చెల్లించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ తమీమ్‌అన్సారియా, డీఎంహెచ్‌వో కొండయ్య, పశుసంవర్ధకశాఖ జేడీ గుణశేఖర్‌పిళ్లై, డిప్యూటీ సీఈవో రమణారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, ఆర్డీవో రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని