logo

19 మంది జూదరుల అరెస్టు రూ.5.98 లక్షల నగదు స్వాధీనం

కలికిరి-వాల్మీకిపురం మండలాల సరిహద్దులోని శివారు ప్రాంతమైన వసంతరాయుని గుట్టపై భారీ ఎత్తున పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు శనివారం సాయంత్రం ఆయా స్థావరాలపై దాడులు నిర్వహించి పెద్దఎత్తున నగదు, జూదరులను పట్టుకున్నారు.

Published : 05 Feb 2023 02:22 IST

కలికిరి గ్రామీణ, న్యూస్‌టుడే: కలికిరి-వాల్మీకిపురం మండలాల సరిహద్దులోని శివారు ప్రాంతమైన వసంతరాయుని గుట్టపై భారీ ఎత్తున పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు శనివారం సాయంత్రం ఆయా స్థావరాలపై దాడులు నిర్వహించి పెద్దఎత్తున నగదు, జూదరులను పట్టుకున్నారు. ఈ దాడుల్లో 19 మంది జూదరులు పట్టుబడినట్లు వాల్మీకిపురం సీఐ పి.నాగేంద్ర తెలిపారు. జిల్లాలోని కలికిరి, పీలేరు, రాయచోటి, కలకడ, కేవీపల్లె తదితర మండలాలకు చెందిన జూదరులను అరెస్టు చేసి 21 ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్లు, రూ.5.98 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ దాడుల్లో రాయచోటి సీఐ శంకర మల్లయ్య, పీలేరు, కలికిరి ఎస్సైలు నరసింహులు, లోకేష్‌రెడ్డి, సివిల్‌, ఎస్టీఎఫ్‌, ఏఆర్‌ పోలీసులు పాల్గొన్నట్లు తెలిపారు.


గురుకుల ఉపాధ్యాయుడిపై వేటు
విద్యార్థుల పరారీ వ్యవహారంలో కలెక్టర్‌ ఆదేశాలు

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: బి.కొత్తకోట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ఉపాధ్యాయుడు లోక్‌నాథరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ గిరీష శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యాలయానికి చెందిన 29 మంది విద్యార్థులు ఈనెల రెండోతేదీ మధ్యాహ్నం గోడదూకి పరారు కావడం, కొన్ని గంటల వ్యవధిలోనే వారిని గుర్తించి పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అదే రోజు రాత్రి మదనపల్లె ఆర్డీవో మురళి, డీఎస్పీ కేశప్పలు ఈ ఘటనపై ప్రాథమిక విచారణ నిర్వహించారు. మరోవైపు ఈ నెల మూడో తేదీన గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త (డీసీవో) వెంకట్రావు విద్యాలయంలో శాఖాపరమైన విచారణ చేశారు. తెలుగు పీజీటీ ఉపాధ్యాయుడు లోక్‌నాథరెడ్డి వేధింపులకు గురవుతున్నామని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో పాటు వివిధ సమస్యలను డీసీవోకు వివరించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారని డీసీవో శనివారం సాయంత్రం ‘న్యూస్‌టుడే’కు ధ్రువీకరించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని