logo

పురపాలక ఆస్తులకేదీ రక్షణ?

పురపాలక సంఘాల్లోని ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరవైంది. రూ.కోట్ల విలువైన స్థలాలున్నప్పటికీ వాటిని గుర్తించి పరిరక్షించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది.

Updated : 06 Feb 2023 03:18 IST

ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కుల కన్ను

వివరాల సేకరణలో అధికారుల నిర్లక్ష్యం

పురపాలక సంఘాల్లోని ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరవైంది. రూ.కోట్ల విలువైన స్థలాలున్నప్పటికీ వాటిని గుర్తించి పరిరక్షించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న స్థలాలపై అక్రమార్కులు కన్నేసి కాజేస్తున్నారు. జిల్లాలోని రాయచోటి, రాజంపేట, మదనపల్లె పురపాలక సంఘాల్లో రూ.కోట్ల విలువైన స్థలాలున్నాయి. రెవెన్యూ, పురపాలక శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆస్తుల వివరాలను అధికారులు సేకరించి వాటిని పరిరక్షించడంలో విఫలమవుతున్నారు. ఇదే అవకాశంగా అక్రమార్కులు ఆక్రమణలకు తెగబడుతున్నారు.

రాయచోటి-మదనపల్లె ప్రధాన రహదారిపై ముళ్ల పొదలతో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం

న్యూస్‌టుడే, రాయచోటి: జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో ప్రధాన ప్రాంతాలు, రహదారులపైనే ప్రభుత్వ స్థలాలున్నాయి. ఇప్పటికే పట్టణ నడిబొడ్డున చేదబావుల స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. బస్టాండు రహదారిలోని రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను కొంతమంది ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టినా పురపాలక సంఘం అధికారులు కనీసం పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బండ్లపెంట సమీపంలో నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రం స్థలానికి హద్దులు నిర్ణయించి ప్రహరీ నిర్మించకపోవడంతో కొంత స్థలం పరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. రాయచోటి-మదనపల్లె ప్రధాన రహదారిపై 25 సెంట్ల ప్రభుత్వ స్థలం ముళ్లపొదల మాటున ఉండిపోయింది. ఈ స్థలంపై గతంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత కన్నేసి కాజేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో ‘ఈనాడు’లో వరుస కథనాలు రావడంతో కలెక్టర్‌ స్పందించి స్థలానికి హద్దులు నిర్ణయించి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూశాఖాధికారులు హెచ్చరికబోర్డు ఏర్పాటు చేసి అనంతరం వదిలేశారు. ఇక్కడ సెంటు ధర రూ.70 లక్షలకుపైగా పలుకు తోంది. చిత్తూరు రోడ్డులోని పెద్ద తూముల వద్దనున్న ప్రభుత్వ స్థలం ఇప్పటికే డీకేటీ పట్టాలుగా మారిపోయింది. గతంలో ఇక్కడ ఎల్‌ఐసీˆ కార్యాలయం, ఇతర అవసరాలకు స్థలాన్ని కేటాయించినా ప్రస్తుతం పరాధీనంలోకి వెళ్లిపోవడం గమనార్హం. గున్నికుంట్ల రోడ్డు సమీపంలోని రింగ్‌ రోడ్డు తూర్పు, పడమర వైపు ఉన్న ప్రభుత్వ భూములు సాగుకు యోగ్యం కాని గుట్టలు, బండరాళ్లు ఉన్నప్పటికీ డీకేటీ పట్టాల కింద అనర్హులకు కట్టబెట్టడంతో రూ.కోట్ల విలువైన భూములు చేతులు మారిపోయాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థలాన్ని ప్రధాన రహదారిపైకి ఆక్రమించి కొందరు తాత్కాలిక వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకున్నారు. మదనపల్లె రోడ్డు నుంచి కె.రామాపురం వెళ్లే దారిలోని 1.50 ఎకరాల కుంట పోరంబోకు స్థలాన్ని ఇటీవల పాఠశాల గదుల నిర్మాణానికి అధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. కొంత భాగంలో గదులు నిర్మించినా మిగిలిన భూమిలో ప్రహరీ నిర్మాణం చేపట్టకపోవడంతో ఆక్రమణలకు గురవుతోంది. ఇక్కడ సెంటు స్థలం కొనుగోలు చేయాలన్నా రూ.10 లక్షలకుపైగా ధర పలుకుతోంది.

ప్రభుత్వ కార్యాలయాల పక్కనే ఆస్తులు

రాయచోటి జిల్లా కేంద్రం కావడంతో సుమారు 90 శాఖలకు సంబంధించిన కార్యాలయాలు తరలి వచ్చాయి. ప్రధానంగా కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలతో పాటు వివిధ ప్రధాన శాఖలకు చెందిన కార్యాలయాలన్నీ ప్రధాన రహదారులకు అనుసంధానంగానే ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ కార్యాలయం ఉన్న ప్రాంతంలో సుమారు పదెకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ గతంలో కొందరు డీకేటీ పట్టాలు పొందడంతో ప్రస్తుతం ఆ స్థలాలు ప్రభుత్వ అవసరాలకు అడ్డుగా మారాయి. కార్యాలయ ప్రాంతంలోని స్థలాలను కాపాడుకుంటే అక్కడే కలెక్టర్‌, ఎస్పీల క్యాంపు కార్యాలయాలు నిర్మించుకునే వెసులుబాటు ఉంది. చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై స్థలాలుండడం, వాటికి హద్దులు నిర్ణయించి రక్షణ చర్యలు(కంచె, ప్రహరీలు) చేపట్టకపోవడంతో రూ.కోట్ల విలువైన ఆస్తులు అన్యాక్రాంతమవుతాయన్న ఆందోళన నెలకొంది. రాజంపేట రోడ్డులోని ఓదివీడు సమీపంలోని మైనార్టీ వెల్ఫేర్‌ విద్యా వసతి కేంద్రంలో సుమారు పది శాఖలు ఏర్పాటు చేశారు. వాటికి ఎదురుగా ఉన్న గుట్ట పోరంబోకు భూములకు ఇంతవరకు అధికారులు రక్షణ చర్యలు చేపట్టలేదు. ఇప్పటికే ఇక్కడున్న సుమారు 20 ఎకరాలకుపైగా డీకేటీ భూమిగా మారిపోయింది. ఇక్కడ కొందరు బండరాళ్లను సైతం పెకలించి రహదారిని అనుబంధంగా ఆక్రమించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు రావడంతో అక్కడ రియల్‌ వ్యాపారం జోరందుకోవడంతో పక్కనున్న ప్రభుత్వ స్థలాలను కలిపేసుకుని విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి పట్టణం చుట్టూ రూ.కోట్ల విలువైన స్థలాలున్నప్పటికి వాటికి కొంత నిధులు వెచ్చించి రక్షణ చర్యలు (కంచెలు, ప్రహరీలు, దిమ్మెలు) చేపట్టడం లేదు. కేవలం సూచిక బోర్డులు ఏర్పాటు చేసి వదిలేస్తున్నారు. ఇవి కొన్ని రోజులకే మాయమవుతున్నాయి.

సూచికలు ఏర్పాటు చేశాం

పట్టణ పరిధిలోని ప్రభుత్వ భూములు గుర్తించి ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే చాలా స్థలాల్లో సూచికలు ఏర్పాటు చేశాం. ప్రహరీల నిర్మాణానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతులొస్తే నిర్మిస్తాం. పురపాలక సంఘం ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

రామాంజనేయులు, ఇన్‌ఛార్జి తహసీˆల్దారు, రాయచోటి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని