logo

సీపీఎస్‌ రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్‌, ఎస్‌.జాబీర్‌ పేర్కొన్నారు.

Published : 06 Feb 2023 02:27 IST

రాయచోటి రెవెన్యూ కార్యాలయం ఎదుట సంకల్ప దీక్ష చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు

రాయచోటి, న్యూస్‌టుడే: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్‌, ఎస్‌.జాబీర్‌ పేర్కొన్నారు. విజయవాడలో ఈ నెల 3వ తేదీన నిర్వహించిన సంకల్ప దీక్షను నిరంకుశత్వంతో అడ్డుకోవడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రమైన రాయచోటి రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆదివారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి సంకల్ప దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని ఆశ కల్పించి అధికారంలోకి వచ్చిన అనంతరం జీపీఎస్‌ పేరుతో కొత్త ప్రయోగం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీంతో ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు. జీపీఎస్‌ విధానంతో ఉద్యోగులకే కాదని ప్రభుత్వానికి నష్టమేనన్నారు. దేశంలో సీపీఎస్‌ రద్దు చేసిన రాష్ట్రాలకు నిధులివ్వమని కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగడాన్ని తప్పుబట్టారు. పాలకులు ఉద్యోగ, ఉపాధ్యాయుల వ్యతిరేక విధానాలతో రాజ్యాంగపరమైన హక్కులను కాలరాయడాన్ని అడ్డుకోవాలని ప్యాప్టో జిల్లా కార్యదర్శి రవిశంకర్‌ పిలుపునిచ్చారు. ఉద్యోగులకు సమస్యలు సృష్టించిన ప్రభుత్వాలేవీ మనుగడ సాగించలేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రమణమూర్తి, సుధాకర్‌నాయుడు, చంద్రశేఖర్‌, వెంకటరమణ, నాగేంద్ర, కిపాయత్‌రెడ్డి, సుధాకర్‌, శ్యాంసుందర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని