logo

ప్రాధాన్యం ప్రగతి తడబాటు!

గ్రామీణులకు మెరుగైన సేవలందించాలని, పాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని పాలకులు సంకల్పించారు. కార్యాలయాల నిర్వహణకు శాశ్వత భవనాలను నిర్మించాలని ప్రభుత్వం ముందుకొచ్చింది.

Published : 06 Feb 2023 02:27 IST

భవన నిర్మాణాల్లో మందగమనం

ఒంటిమిట్ట : కొండమాచుపల్లిలో అసంపూర్తిగా డిజిటల్‌ గ్రంథాలయ భవనం

న్యూస్‌టుడే, కడప: గ్రామీణులకు మెరుగైన సేవలందించాలని, పాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని పాలకులు సంకల్పించారు. కార్యాలయాల నిర్వహణకు శాశ్వత భవనాలను నిర్మించాలని ప్రభుత్వం ముందుకొచ్చింది. ఉపాధిహామీ పథకం నిధులతో చేపట్టాలని అనుమతిచ్చారు. క్షేత్రస్థాయిలో పనుల ప్రగతి తడబడింది. బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు మందగమనంగా సాగుతున్నాయి. అయిదు రకాల ప్రాధాన్య భవనాల్లో మూడింటిపైనే అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మరో రెండింటిపై చిన్నచూపు చూడటంతో నిదానంగా చేపడుతున్నారు.  

జిల్లాలో 557 పంచాయతీలుండగా గ్రామ సచివాలయాలు 427 చోట్ల ఏర్పాటు చేశారు. పరిపాలనలో ప్రక్షాళన చేసి ప్రజలకు ఉత్తమ సేవలందించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, రాయితీ పథకాలను లబ్ధిదారులకు పారదర్శకంగా అందించాలని నిర్ణయించారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లీనిక్‌ భవనాలు 1,181 మంజూరు చేశారు. వీటి అంచనా విలువ రూ.319.9 కోట్లు. ఈ మూడు రకాలను ప్రాధాన్య విభాగం కేటగిరి-1లో చేర్చారు. ఇప్పటికీ 669 చోట్ల పూర్తి చేశారు. పునాది వరకు 66, గోడలు 148, పైకప్పు వరకు వచ్చినవి 293 ఉండగా, కొన్ని పల్లెల్లో మొదలుకాలేదని అధికారులు చెబుతున్నారు. కేటగిరి-2లో పాలశీతలీకరణ (బీఎంసీయూ) కేంద్రాలు, డిజిటల్‌ గ్రంథాలయాలను చేర్చారు. ఈ రెండు విభాగాల్లో 322 భవనాలను నిర్మించాలని అనుమతిచ్చారు. నరేగా నిధులను మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికీ కేవలం 12 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 234 చోట్ల అసలు భూమి పూజ కూడా చేయలేదు. గుంతల వరకు వచ్చినవి 17, పునాదులు 23, గోడలు 22, పైకప్పు వేసినవి 14 ఉన్నట్లు నిర్మాణ పనులను పర్యవేక్షణ చేస్తున్న పంచాయతీరాజ్‌శాఖ సాంకేతిక నిపుణులు తెలిపారు. వాస్తవంగా చూస్తే గతేడాది నుంచి ఆశించిన స్థాయిలో వేగంగా సాగడం లేదు.  భవన నిర్మాణ సామగ్రి ధరలు ఆమాంతం పెరిగాయి. అంచనా వ్యయాన్ని పెంచాలని అధికారులపై గుత్తేదారులు తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపినా రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదు.

వేగంగా చేయిస్తాం: జిల్లాలో కేటగిరి-1లోని గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌క్లీనిక్‌ భవనాల పనులను వేగంగా చేయిస్తాం. కేటగిరి-2లో బీఎంసీయూలు, డిజిటల్‌ గ్రంథాలయాలను చేర్చాం. క్షేత్ర స్థాయిలో కొన్నిచోట్ల పనులు ఆగిపోయాయి. మరికొన్నిచోట్ల నిదానంగా సాగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. ఇందుకు గల కారణమేంటని క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించాం. ఈ ఏడాది జూన్‌లోపు అన్నింటినీ పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించాం. ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉంది.

శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని