logo

ఉన్నవి వాడరు... కొత్తవి కడతారు!

కడప నగరపాలక సంస్థ పరిధిలో 21 చోట్ల మరుగుదొడ్ల నిర్మాణానికి అధికారులు స్వచ్ఛభారత్‌ కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపారు. వీటిలో జిల్లా పరిషత్తు, పాతబస్టాండు, ఏడు రోడ్లు, రాజీవ్‌మార్గ్‌, నెహ్రూ పార్కు, పాత మున్సిపల్‌ కార్యాలయం, నగరపాలక సంస్థ కార్యాలయం, దిశ పోలీస్‌స్టేషన్ల వద్ద ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.46 లక్షలు విడుదల చేశారు.

Updated : 06 Feb 2023 06:30 IST

రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగంపై విమర్శలు 

కడపలో ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ తీరిదీ

కడప నగరం మద్రాసు రోడ్డులో నిర్మిస్తున్న ప్రజా మరుగుదొడ్లు

న్యూస్‌టుడే, కడప నగరపాలక: కడప నగరపాలక సంస్థ పరిధిలో 21 చోట్ల మరుగుదొడ్ల నిర్మాణానికి అధికారులు స్వచ్ఛభారత్‌ కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపారు. వీటిలో జిల్లా పరిషత్తు, పాతబస్టాండు, ఏడు రోడ్లు, రాజీవ్‌మార్గ్‌, నెహ్రూ పార్కు, పాత మున్సిపల్‌ కార్యాలయం, నగరపాలక సంస్థ కార్యాలయం, దిశ పోలీస్‌స్టేషన్ల వద్ద ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.46 లక్షలు విడుదల చేశారు. వీటిలో కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 15 ప్రాంతాల్లో నిర్మాణానికి రూ.1.37 కోట్లు మంజూరయ్యాయి. ప్రగతి భవన్‌, జేసీ బంగళా, మద్రాస్‌ రోడ్డు, సంధ్యా కూడలి, వై కూడలి, పాత కంపోస్ట్‌యార్డు, పాత కడప సబ్‌స్టేషన్‌, మేకల వధశాల, రవీంద్రనగర్‌, అక్కాయపల్లి పెట్రోలుబంకు, శాస్త్రినగర్‌, రాయచోటి రోడ్డుపై వంతెన కింద, పుట్లంపల్లి చెరువు, మహవీర్‌ కూడలి, రాజీవ్‌పార్కు ప్రాంతాల్లో ప్రజా మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఒక్కోదాని నిర్మాణానికి రూ.7.80 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ప్రజామరుగుదొడ్లు నిర్మించి వదిలేస్తే ప్రయోజనం లేదని నగరవాసులు వాపోతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా గతంలో నిర్మించిన మరుగుదొడ్ల వివరాలు అందుబాటులో లేవని, ఇప్పుడు నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్వహణకు నగరపాలక సంస్థ ప్రణాళిక సిద్ధం చేసిందని చెబుతున్నారు.


చిత్రంలో కనిపిస్తున్నవి నమ్మా టాయిలెట్లు. 2014-15 మధ్య కాలంలో పాత రిమ్స్‌ కూడలిలో నిర్మించారు. వీటి నిర్మాణానికి రూ.25 లక్షలు ఖర్చు చేశారు. నిర్మించిన అనంతరం వారం రోజులు కూడా వినియోగంలో లేవు. రూ.లక్షలు పోసి నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా ఎందుకు మారాయన్న అంశంపై అధికారులెవరూ దృష్టి సారించలేదు.


ఇవి 2014-15 మధ్య కాలంలో స్వచ్ఛభారత్‌ కింద మాసాపేట, నగరపాలక క్రీడా మైదానం పక్కన నిర్మించిన మరుగుదొడ్లు. రూ.90 లక్షలు స్వచ్ఛభారత్‌ నిధులతో పాత కడప ప్రధాన రహదారి, నెహ్రూ పార్కు, ఏడు రోడ్ల కూడలి, రాజీవ్‌ పార్కు తదితర ప్రాంతాల్లో నిర్మించినవి ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు. మిగిలినవి ఎక్కడున్నాయో అధికారులకే తెలియకపోవడం గమనార్హం. ఇప్పటికే ఉన్నవి వినియోగంలో లేకున్నా కొత్తగా ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి తిరిగి రూ.1.85 కోట్లు మంజూరు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని