logo

బాల వనం... నారు ఘనం!

వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో టమోట నారుకు భారీగా గిరాకీ పెరిగింది. రెండు జిల్లాల్లో రబీలో టమోట సాధారణ సాగు విస్తీర్ణం 6,930 హెక్టార్లు కాగా, అనధికారికంగా మరో 5 వేల హెక్టార్ల పైమాటే.

Published : 06 Feb 2023 02:27 IST

700కు పైగానే నర్సరీల్లో పెంపకం

మదనపల్లె వద్ద నర్సరీలో పెంచుతున్న టమోట నారు

న్యూస్‌టుడే, రామసముద్రం, మదనపల్లె పట్టణం: వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో టమోట నారుకు భారీగా గిరాకీ పెరిగింది. రెండు జిల్లాల్లో రబీలో టమోట సాధారణ సాగు విస్తీర్ణం 6,930 హెక్టార్లు కాగా, అనధికారికంగా మరో 5 వేల హెక్టార్ల పైమాటే. నారు పెంపకానికి ఇరు జిల్లాల్లో 700కు పైగానే నర్సరీ (బాల వనం)లు సిద్ధమయ్యాయి. రబీలో నర్సరీల ద్వారా రూ.10 కోట్లకుపైగా లావాదేవీలు జరగనున్నాయి. ప్రధానంగా అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రాంతం టమోట సాగుకు పెట్టింది పేరు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద టమోట మార్కెట్‌ ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచే దేశ, విదేశాలకు టమోట ఎగుమతి అవుతుంటుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, వైయస్‌ఆర్‌ జిల్లాపులి వెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు ప్రాంతాల్లో జనవరి నుంచే టమోట సాగు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి, మార్చిలలో మొక్కల నాటడం నూరు శాతం పూర్తవుతుంది.

* హెక్టారు విస్తీర్ణంలో 20 వేల మొక్కలు అవసరమవుతాయి. వీటిలో సాహో, త్రీ, ఫోర్‌, ప్రభాకర్‌ తదితర కంపెనీ విత్తన నార్లకు డిమాండును బట్టి రూపాయి నుంచి రూ.1.50 వరకు నర్సరీల్లో అమ్మకాలు జరుగుతాయి. సాగు మొత్తం నార్ల నాణ్యత, కల్తీ లేని విత్తనాలపైనే ఆధారపడి ఉంటుంది. గత కొంతకాలంగా నారు నాణ్యత లేక మొక్కలు చనిపోవడం, కల్తీ విత్తనాలతో రైతులు మోసపోయి నష్టాలకు గురయ్యారు. రైతుల పరిస్థితిని గమనించిన ప్రభుత్వం నర్సరీలను ఉద్యానశాఖ పరిధిలోనికి తీసుకొచ్చి నర్సరీల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి చేసింది. టమోట నర్సరీలన్నింటిపై ఉద్యానశాఖాధికారుల పర్యవేక్షణ ఉండడమే కాకుండా నారు కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా రసీదు పొందాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. నారులో కల్తీలున్నట్లు ఉద్యానశాఖ అధికారుల ధ్రువీకరణతో చర్యలు, కంపెనీ నుంచి పరిహారం పొందే వెసులుబాటు ఉంటుంది. దీంతో టమోట రైతులంతా నారు కోసం నర్సరీలపైనే ఆసక్తి చూపుతూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు.

రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి

టమోట నర్సరీలపై నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. ఆయా గ్రామ సచివాలయాల్లోని గ్రామ ఉద్యానశాఖ సహాయకులు పర్యవేక్షిస్తారు. నియోజకవర్గంలోని ఉద్యానశాఖ అధికారి 15 రోజులకొకసారి పర్యవేక్షిస్తూ నారు తాజా పరిస్థితిని యజమానికి తెలియజేస్తారు. రైతులు కొనుగోలు చేసే సమయంలో కంపెనీ పేరు, విత్తన రకం, మొక్కల సంఖ్య, నగదు మొత్తాన్ని నమోదు చేసిన రసీదును తప్పనిసరిగా పొందాలి.

ఈశ్వర్‌ప్రసాద్‌, ఉద్యానశాఖ అధికారి, మదనపల్లె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని