logo

నేరవార్తలు

తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని టెంకాయతోపు వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న టిప్పర్‌ని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.

Published : 06 Feb 2023 02:27 IST

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

పెళ్లకూరు, న్యూస్‌టుడే : తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని టెంకాయతోపు వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న టిప్పర్‌ని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు.. నాయుడుపేట నుంచి తిరుపతి వైపు వెళ్తున్న టిప్పర్‌ టెంకాయతోపు దగ్గర ఒక్కసారిగా ఆగడంతో వెనుక వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. స్థానికులు గుర్తించి బయటకు తీయగా అప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు గుర్తించారు. మరకొరికి వ్యక్తి తీవ్రగాయాలు కాగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హర్షవర్దన్‌రెడ్డి (28), పుత్తూరుకు చెందిన ధరయ్య(25)గా గుర్తించారు. గాయపడిన యువకుడు అన్నమయ్య జిల్లా పీˆలేరుకు చెందిన అజయ్‌గా గుర్తించారు. వీరంతా రేణుగుంటలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు కాగా ఆదివారం పార్టీ కోసం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


వీరపునాయునిపల్లె : ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన అనిమెల గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిమెలకు చెందిన జెర్రి ఆశ్రిత్‌, మాకం గంగన్న ద్విచక్ర వాహనంపై వీఎన్‌పల్లెకు వెళ్తుండగా... అదే గ్రామానికి చెందిన మాకం మంజునాథ మరో ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని 108లో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఆశ్రిత్‌ (50) మార్గ మధ్యలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కడప నేరవార్తలు: కడప చిన్నచౌకు ఠాణా పరిధిలోని అంబేడ్కర్‌ కూడలి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కడప సింహపురి కాలనీలో ముత్తుకూరు రమాదేవి (55) తన కుమార్తెతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఆదివారం తన కుమార్తెను ఆర్టీసీ బస్టాండ్‌లో వదిలిపెట్టేందుకు రోడ్డు దాటుతుండగా వై.కూడలి నుంచి వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ప్రమాదవశాత్తు ఆమెను ఢీకొంది. స్థానికులు ఆమెను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు