logo

రోగులు ఎక్కువ... వసతులు తక్కువ!

జిల్లా కేంద్రమైన రాయచోటిలో వంద పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణానికి రెండేళ్ల కిందట ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసింది

Published : 07 Feb 2023 05:34 IST

రెండేళ్లుగా సాగుతున్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలు

గదుల కొరతతో వరండాలోనే రోగులకు అత్యవసర వైద్య సేవలు

  - న్యూస్‌టుడే, రాయచోటి

జిల్లా కేంద్రమైన రాయచోటిలో వంద పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణానికి రెండేళ్ల కిందట ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసింది. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారు సంస్థ పనులు ప్రారంభించింది. ఓపీ విభాగాలతోపాటు శస్త్రచికిత్సలు థియేటర్లు, రోగులకు ప్రత్యేక వార్డులు, ఇతర ఆధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పాత భవనాలపైనే అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారే తప్ప పక్కన ఎలాంటి గదులు నిర్మాణం జరగడం లేదు. దీంతో వైద్యులు, సిబ్బంది, రోగులు అసౌకర్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.     

ఆసుపత్రి భవన నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారు సంస్థకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసే పరిస్థితి లేక అదనపు సమయం కోరినట్లు సమాచారం. పనుల్లో నాణ్యత ప్రమాణాలపై దృష్టిసారిస్తున్న అధికార యంత్రాంగం బిల్లులు సకాలంలో చెల్లించేందుకు నిధులు రప్పించడంలో విఫలమవుతోంది. జిల్లా కేంద్రమైన రాయచోటి సమీప పది మండలాల నుంచి నిత్యం ఇక్కడకు రోగులు వైద్యసేవల నిమిత్తం వస్తుంటారు. ప్రధానంగా మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించేందుకు గది లేకపోవడంతో ఆరు నెలల కిందట వరకు ఆరు బయటే పరీక్షలు నిర్వహిస్తుండడంతో ఇటీవల శవపరీక్ష గదిని పూర్తి చేసి ప్రారంభించారు. మిగిలిన వార్డులకు సంబంధించిన గదులేవీ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో చికిత్స చేసేందుకు అవసరమైన పడకల్లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

* ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల్లో  కొందరిని పులివెందులకు డిప్యుటేషన్‌పై పంపడంతో శస్త్ర చికిత్సల సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. రాయచోటి కేంద్రంగా రాజంపేట, పీలేరు, మదనపల్లె, సత్యసాయి జిల్లాలోని కదిరి నియోజకవర్గాల్లోని మండలాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులొస్తుంటారు. రెండేళ్ల కిందట 400 దాటని ఓపీ ప్రస్తుతం 700కుపైగా నమోదవుతోంది. వీరికి అవసరమైన రక్తపరీక్షలు చేసే గది ఇరుకుగా ఉండడంతో రోగులు, సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రమాదాల్లో గాయపడినవారితోపాటు ఇతర అత్యవసర వైద్యసేవలకు వచ్చిన వారికి ప్రత్యేక వార్డు లేక పోవడంతో వరండాలోనే ప్రథమ చికిత్స అందిస్తున్నారు. కు.ని, ఇతర శస్త్ర చికిత్సలు, ఇన్‌పేషంట్లకు సరిపడా పడకలు లేకపోవడంతో వరండాల్లోనే వైద్యసేవలందిస్తున్నారు. ఆసుపత్రి భవనం పైభాగంలో పనులు చేస్తుండడంతో దుమ్ము, ధూళితో రోగులు, వైద్యులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు.

రెండు నెలల్లో పూర్తి చేస్తాం : ఆసుపత్రి భవన నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తి చేస్తాం. రోగులు ఇబ్బందులు పడకుండా మెరుగైన వైద్యసేవలందిస్తున్నాం.
చంద్రశేఖర్‌, సూపరింటెండెంట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని