logo

జలం అందక... గొంతు తడవక!

వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని చాలా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రక్షిత నీరందడంలేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని దశలవారీగా గతంలో బృహత్తర తాగునీటి పథకాలు ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది.

Published : 07 Feb 2023 05:34 IST

రూ.కోట్లు వెచ్చిస్తున్నా నిర్వహణ అధ్వానం
కొన్నిప్రాంతాల్లో నెలల తరబడి నిరుపయోగం
క్షేత్ర స్థాయిలో పూర్తిగా కొరవడిన పర్యవేక్షణ
ఇదీ సీపీడబ్ల్యూఎస్‌ పథకాల పనితీరు

- న్యూస్‌టుడే, కడప

రెండేళ్లుగా తెరుచుకోని ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లె శివారు పెన్నానది ఒడ్డునున్న పంపుహౌస్‌

వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని చాలా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రక్షిత నీరందడంలేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని దశలవారీగా గతంలో బృహత్తర తాగునీటి పథకాలు ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. ఏటా రూ.కోట్లు గుమ్మరిస్తున్నా నిర్వహణ తీరు నిస్తేజంగా ఉంది. ప్రాణధార కోసం కొన్ని గ్రామాల ప్రజలు నెలలకొద్దీ కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నా స్వచ్ఛమైన నీరందని దయనీయ పరిస్థితి నెలకొంది.

వైయస్‌ఆర్‌ జిల్లాలో బృహత్తర తాగునీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్‌) 15 ఉన్నాయి. వీటి ద్వారా 477 ఆవాసాల్లో నివాసం ఉంటున్న 3,74,152 మందికి రక్షిత నీరు సరఫరా చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్వహణకు రూ.18.88 కోట్లు కేటాయించారు. మోటార్లు, పంపులు, స్టార్టర్లు, గొట్టాల మరమ్మతులు, గతంలో ఏర్పాటు చేసినవి పాతబడి దెబ్బతింటే కొత్తగా కొనుగోలు చేయడం, సిబ్బందికి వేతనాల చెల్లింపు, విద్యుత్తు బిల్లుల బకాయిలు, ఇతర పనులకు వెచ్చించాల్సి ఉంది. ఇంత పెద్దమొత్తంలో నిధులను ధారపోస్తున్నా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ప్రతిరోజూ పల్లె వాసులకు నీరందటం లేదు. ఇప్పటికీ 348 గ్రామాల్లో 2,96,843 మందికి నీరిస్తున్నామని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా చూస్తే రెండు, మూడు రోజులకు ఒకసారి కూడా సరఫరా చేయడం లేదు. మరో 129 పల్లెల్లో 77,309 మందికి నీరివ్వలేని దుస్థితి నెలకొంది.

రక్షిత జలాలు అందిస్తే ఒట్టు

ఉమ్మడి కడప జిల్లా పరిషత్తు అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఒంటిమిట్ట సీపీడబ్ల్యూఎస్‌ పథకం రెండున్నరేళ్లుగా నిరుపయోగంగా ఉంది. ఇంతవరకు వినియోగంలోకి తీసుకురాలేదు. పథకం ద్వారా పెన్నపేరూరు, రాచగుడిపల్లె, సాలాబాదు, గంగపేరూరు, ఒంటిమిట్ట పంచాయతీల్లో నివాసం ఉంటున్న 29 గ్రామాల్లో 14,792 మందికి నీరందించాల్సి ఉంది. పెన్నానదిలో నిర్మించిన నీటి సేకరణ ఊట బావి 2020, సెప్టెంబరులో సోమశిల వెనుక జలాల్లో మునిగిపోయింది. అప్పటి నుంచి పథకం ద్వారా గ్రామీణుల గొంతు తడిపితే ఒట్టు. మరోవైపు 2022-23లో నిర్వహణకు రూ.50 లక్షలు కేటాయించారు. పథకం ద్వారా ఒక గ్రామంలో కనీసం ఒక్కరికైనా ప్రాణధార ఇవ్వలేదు. రెండేళ్లకు పైగా వాడకంలో లేదు.

కొందరికే ఆ భాగ్యం

వేంపల్లె మండలంలో 17 గ్రామాల్లో 12,694 మందికి సరఫరా చేయాల్సి ఉంటే ఏడు పల్లెల్లో 7,533 మందికి ఇస్తున్నారు. పథకం నిర్వహణకు రూ.70 లక్షలు ఇచ్చారు. ‌్ర కె.ఎర్రగుడి పథకం నిర్వహణకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.84 లక్షలు కేటాయించారు. తొలుత రూపొందించిన ఆకృతి ప్రకారం 57 ఆవాస ప్రాంతాల్లోని 17,184 మందికి నీరివ్వాల్సి ఉంటే ప్రస్తుతం 13 ఊర్లలోని 3,049 సరఫరా చేయడం గగనమైంది. ‌్ర పులివెందుల పథకం కోసం రూ.4.35 కోట్లకు అనుమతిచ్చారు. ఇక్కడ 70 గ్రామాల్లోని 76,830 మంది నీరివ్వాల్సి ఉంది. ఇక్కడ మాత్రం 35 చోట్ల 46,904 మందికి అందిస్తున్నారు. ‌్ర మైదుకూరు సీపీడబ్ల్యూఎస్‌ పథకం నిర్వహించడానికి రూ.203 లక్షలకు ఆమోదం తెలిపారు. ఇక్కడ 71 ఆవాస ప్రాంతాల్లోని 35,996 మందికిగాను 68 చోట్ల 33,633 మందికి నీరందించేలా ఏర్పాట్లు చేశారు. అది కూడా ప్రతిరోజూ ఇవ్వడం లేదు. ‌్ర యోగి వేమన, కమలాపురం, కొండాపురం, ముద్దనూరు, మైలవరం, బ్రహ్మంగారిమఠం, కొత్తమాధవరం, సిద్దవటం పథకాల పనితీరు నిరాశాజనకంగా ఉంది. జిల్లా పరిషత్తు ద్వారా నిధులిస్తూ పథకాల పనితీరు, పనుల పర్యవేక్షణ బాధ్యతలు ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు అప్పగించారు. ఈ రెండు విభాగాల అధికార యంత్రాంగంలో సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే పల్లె ప్రజలను అవస్థలకు గురిచేస్తోంది. తరచూ మోటార్లు, స్టార్టర్లు, పంపులు దెబ్బతింటున్నాయి. పైపులైనుకు రంధ్రాలు (లీకేజీలు) ఏర్పడుతున్నాయి. విద్యుత్తు తీగలు తెగిపోవడం, కాలి పోవడం జరుగుతున్నాయి. మరోవైపు పాత యంత్రాలు సమర్థంగా పనిచేయలేక మొరాయిస్తున్నాయి. ఈ కారణంగా పూర్తి స్థాయిలో రోజువారీగా లేదా రెండు రోజులకు ఒకసారి కూడా నీరివ్వడం లేదు. భూతల, భూఉపరితల జలాశయాల్లో నీరు నింపిన ప్రతిసారి క్లోరినేషన్‌ చేయాలి. ట్యాంకులను ప్రతి 15 రోజులకు ఒకమారు శుభ్రం చేయాలనే మాటను విస్మరించారు.

అన్నమయ్యలో మారని తీరు

అన్నమయ్య జిల్లాలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు నియోజకవర్గాల పరిధిలో 10 సీపీడబ్ల్యూఎస్‌ పథకాలున్నాయి. ఇక్కడ 907 గ్రామాల్లో 2,86,859 మందికి నీరివ్వాల్సి ఉంది. వీటి నిర్వహణకు 2022-23లో రూ.14.08 కోట్లు కేటాయించారు. నిర్దేశిత లక్ష్యంలో 60 శాతం మందికి కూడా స్వచ్ఛమైన నీరు అందడంలేదు. అన్నమయ్య జలాశయం నుంచి పుల్లంపేట మండలంలోని 25 గ్రామాల్లో 9,729 మందికి రక్షిత జలాలు సరఫరా చేయాల్సి ఉంది. 2021, నవంబరులో వరదలకు నీటి సేకరణ ప్రధాన పైపులైను దెబ్బతినగా, ఇంతవరకు పునరుద్ధరించలేదు. రాజంపేట మండలం హెచ్‌.చెర్లోపల్లి పథకం ద్వారా 41 పల్లెల్లో 11,289 మందికి నీరందించాల్సి ఉంది. బాహుదా నదిలో ఊట బావి తవ్వించారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో 2020, 2021 నవంబరులో చెయ్యేరులో జల ప్రళయం బీభత్సం సృష్టించింది. గొట్టాలు చెల్లాచెదురుగా కొట్టుకుపోయాయి. ఇంతవరకు బాగు చేయలేదు. అత్తిరాల పథకం నుంచి 27 గ్రామాలకు ఇవ్వాల్సి ఉంటే 25 గ్రామాలకు ఇవ్వడం గగనమైంది. కె.బోయనపల్లి పథకం నుంచి 20 ఆవాస ప్రాంతాల్లో 9,618 మందికి సరఫరా చేయాల్సి ఉంటే 14 ఊర్లకు ఇస్తున్నారు. పెనగలూరు, పొందలూరు, గాలివీడు, ఆకేపాడు, లక్కిరెడ్డిపల్లె, పీలేరు పథకాల పనితీరు అధ్వానంగా ఉంది.


పథకాల పనితీరుపై పర్యవేక్షణ

సీపీడబ్ల్యూఎస్‌ పథకాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. సోమశిల వెనుక జలాల్లో ఊటబావి మునకలో చేరడంతో ఒంటిమిట్ట పథకం కొన్ని నెలలుగా పనిచేయ డంలేదు. త్వరలో వినియోగంలోకి తీసుకొస్తాం. అన్నిచోట్ల గ్రామీణులకు రక్షిత జలాలందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
 వెంకటేశ్వర్లు, ఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌, కడప


త్వరలో పునరుద్ధరిస్తాం :  ఏడాది కిందట చెయ్యేరు వరదలకు పుల్లంపేట, కె.బోయనపల్లి సీపీడబ్ల్యూఎస్‌ పథకాల పైపులైన్లు దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరణకు నిధులివ్వాలని ప్రతిపాదనలు పంపించాం. త్వరలో మరమ్మతులు చేయిస్తాం. మిగతా పథకాల పనితీరును పర్యవేక్షిస్తున్నాం.నిర్దేశిత గ్రామాలకు పూర్తిస్థాయిలో రక్షిత జలాలందిస్తాం.
 ప్రసన్నకుమార్‌, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌, అన్నమయ్య జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని