logo

తెదేపాలో ఆనందం.. వైకాపాలో అంతర్మథనం!

ఎన్నో ఎత్తుగడలు వేసినా ప్రజల ముందు ఓడిపోయామంటూ వైకాపా శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి.

Updated : 19 Mar 2023 09:24 IST

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి విజయం

భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి

 ఈనాడు డిజిటల్‌, కడప, అనంతపురం: ఎన్నో ఎత్తుగడలు వేసినా ప్రజల ముందు ఓడిపోయామంటూ వైకాపా శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇలాకా వైయస్‌ఆర్‌ జిల్లాతో ముడిపడిన పశ్చిమ రాయలసీమ స్థానం (వైయస్‌ఆర్‌ జిల్లాలోని 7, అన్నమయ్య జిల్లాలో 3 నియోజకవర్గాలు) నుంచి గట్టెక్కవచ్చుననే ఆశలు నీరుగారిపోయాయి. రాయలసీమలో ఇప్పటికీ బలంగా ఉన్నామనే గాంభీర్యంతో ఉన్న వైకాపాకు చివరకు ఫలితాలు తారుమారు కావడంతో మింగుడుపడని పరిస్థితులు నెలకొన్నాయి. అందులోనూ పులివెందులకు చెందిన తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి విజయం సాధించడం తలెత్తుకోలేక పోతోంది. 2017లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీటెక్‌ రవి ఇదే తరహాలో అనూహ్యంగా విజయం సాధించారు. అందులోనూ సీఎం జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిపై గెలుపొందారు. దీన్ని మరవక ముందే తెదేపాకు మరో గెలుపునిచ్చిందనే బాధ వైకాపా శ్రేణుల్లో నెలకొంది. ఇతర స్థానాల కంటే పశ్చిమ రాయలసీమ స్థానంపై దేశ, విదేశాల్లోని తెలుగువారిలో విస్తృత చర్చ నడుస్తోంది. అధికార వైకాపా ఎమ్మెల్సీ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఈ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించిన దాఖలాలు తక్కువ. ఈ ఎన్నికలను మాత్రం వైకాపా మరింత ధీమాతో ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించి సీరియస్‌గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే సంకల్పంతో ఓట్లు చేర్చడం దగ్గర నుంచి ఓటింగ్‌ వరకు పటిష్ట వ్యూహాన్ని పన్నింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాయలసీమ జిల్లాల బాధ్యతలు అప్పగించింది. అన్ని రకాల వనరులు ఆయన ద్వారా అందించే విధంగా ఏర్పాట్లు చేసింది. సీఎం జగన్‌ నమ్ముకున్న వాలంటీర్ల సాయంతో ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టభద్రుల ఓటర్లను ఆకర్షించేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడినా ఓటర్లు మాత్రం వైకాపాను ఆదరించలేదు. ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడడంలేదు. సాధారణ ఎన్నికల ముందు వచ్చిన ఫలితాలు భవిష్యత్తు సంకేతంగా కొందరు చర్చించుకోవడమే కాకుండా అంగీకరిస్తున్నారు. ఇటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోనూ తెదేపా ఘన విజయం సాధించింది. పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె పరిధిలోని ఓటర్లు వైకాపాకు గట్టి దెబ్బకొట్టినట్లుగా అందరూ భావిస్తున్నారు.

ఓటమి భారంతో వైకాపా అభ్యర్థి  వెన్నపూస రవీంద్రారెడ్డి


తెలుగు తమ్ముళ్లలో జోష్‌

పులివెందులలో కేకును కోస్తున్న తెదేపా నాయకులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఎన్నడూ లేనంతగా బాణసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ పరిస్థితిపై అధికార యంత్రాంగంలో విస్తృత చర్చ సాగుతోంది. అందులోనూ పోలీసుశాఖలో కొన్ని గంటల్లోనే ఎంతో మార్పు కనిపించింది. లోకేశ్‌ పాదయాత్ర సాగుతున్న ప్రాంతాల్లో పోలీసులు హడావుడిగా కనిపిస్తూ భద్రతను కట్టుదిట్టం చేశారు. గతంలో పట్టించుకోకున్నా ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఎంతో మార్పు కనిపించింది. అన్నమయ్య జిల్లా శివారులో శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో సాగుతున్న పాదయాత్ర వద్ద ఎంతో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి వైయస్‌ఆర్‌ జిల్లా అందులోనూ పులివెందుల నియోజకవర్గం వ్యాప్తంగా తెదేపా శ్రేణులు ఎన్నడూ లేనంతగా సంబరాలు జరుపుకొన్నారు.


60 గంటలు నిర్విరామంగా లెక్కింపు


ఓట్ల లెక్కింపులో సిబ్బంది

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఊహించిన అంచనాలే నిజమయ్యాయి. ఇందుకు తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి దక్కిన ఓట్ల సరళే నిదర్శనం. అనంత జేఎన్‌టీయూలో ఈనెల 16వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 18వ తేదీ (శనివారం) రాత్రి 8 గంటలు దాకా.. అంటే 60 గంటలపాటు నిర్విరామంగా లెక్కింపు సాగింది. మూడు షిప్టుల పద్ధతిలో లెక్కింపు నిర్వహించారు. మధ్యమధ్యలో కొన్ని సందర్భాల్లో అంతరాయాలు కలిగినా మొత్తానికి ప్రక్రియ ముగిసింది.

కలెక్టర్‌ పనితీరు భేష్‌ : పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదటి నుంచి ఉత్కంఠగా కొనసాగింది. తెదేపా, వైకాపా కీలక నేతలు సైతం లెక్కింపు కేంద్రంలోకి ప్రవేశించారు. ఏజెంట్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వివాదాలు, ఉద్రిక్తత వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కలెక్టర్‌ నాగలక్ష్మి ఎంతో సమన్వయంతో లెక్కింపును నడిపించారు. ఒకానొక దశలో రెండో ప్రాధాన్య లెక్కింపులో కలెక్టర్‌కు ఒత్తిళ్లు అధికమయ్యాయి. అయినా సరే ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గట్టిగా నిలబడ్డారు. వైకాపా నిరసన చేపట్టడానికి యత్నిస్తే ఘాటుగా హెచ్చరికలు చేశారు. నిమిషాల్లో ఖాళీ చేయాల్సి వచ్చింది.
చెల్లని ఓట్లు 19,108 : ఎన్నడూ లేనివిధంగా ఈదఫా చెల్లని ఓట్లు ఎక్కువ ఉండటం విశేషం. వైకాపా నాయకులు ఓట్ల నమోదులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తగిన విద్యార్హత లేకపోయినా పాఠశాల, ఇంటర్‌ విద్య, ఆఖరుకు నిరాక్షరాస్యులు సైతం పట్టభద్రులుగా నమోదయ్యారు. అలాంటి వారికి అవగాహన లేకపోవడంతో సరైన రీతిలో ఓటు వేయలేదు. ఈక్రమంలో ఏకంగా 19,108 ఓట్లు చెల్లనవిగా గుర్తించారు. ఇందులో వైకాపాకు చెందిన ఓట్లే అధికంగా ఉన్నట్లు సమాచారం.  


ఫలించిన  పక్కా వ్యూహం

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా వ్యూహం ఫలించింది. అభ్యర్థి ఎంపిక మొదలుకొని ఓట్ల లెక్కింపు వరకు వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఉద్యోగ వర్గాలు, పట్టభద్రుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవడంలో సఫలీకృతమైంది. అన్నింటికి మించి వాలంటీరు వ్యవస్థ, బోగస్‌ ఓట్లు, దౌర్జన్యాలను ఎదుర్కొని విజయం సాధించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డిని పార్టీ అధినేత చంద్రబాబు ఆరు నెలల ముందుగానే ప్రకటించారు. రామగోపాల్‌రెడ్డి 1996 నుంచి పార్టీలో పనిచేసిన అనుభవం, రాయలసీమలో కింది స్థాయి నాయకులకు సైతం ఆయన సుపరిచితుడు.


సమన్వయం  చేసుకుంటూ...

ఆయా ప్రాంతాల్లో పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ మండల, గ్రామ స్థాయి వరకు వెళ్లి ఓటు నమోదు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మరోవైపు ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రణాళికాబద్ధంగా అమలు చేశారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగులు, నిరుద్యోగుల, యువతకు ఇచ్చిన హామీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయించారు. ఉద్యోగులు, నిరుద్యోగులను మోసం చేస్తున్న తీరును తెలియజేసి తెదేపాపై నమ్మకం కలిగేలా చేశారు.


తెదేపా అధినేత  దిశానిర్దేశం

తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ సూచనలు చేశారు. జగన్‌ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక అరాచకాలతో రాష్ట్రం, పిల్లల భవితవ్యం అంధకారంలోకి వెళ్లిపోతుందనే విషయాన్ని అర్థమయ్యేలా వివరించగలిగారు. అన్ని నియోజకవర్గాల బాధ్యులతో విస్తృత ప్రచారం చేయించారు.


లెక్కింపులో  అప్రమత్తంగా...

మూడు రోజుల పాటు సాగిన ఓట్ల లెక్కింపుపై తెదేపా శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాయి. నేతలు పార్థసారథి, శ్రీనివాసరెడ్డి, ఆలం నరసానాయుడు మూడు రోజుల పాటు లెక్కింపు కేంద్రంలోనే ఉంటూ చివరి వరకు ఏజెంట్లలో ధైర్యం నింపారు. ప్రతి ఓటుపై శ్రద్ధ చూపిస్తూ ప్రతి విషయాన్ని కలెక్టరు దృష్టికి తీసుకెళ్లి అప్రమత్తం చేశారు. అధికార పార్టీ అడపాదడపా కవ్వింపు చర్యలకు పాల్పడినా సంయమనం పాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని