logo

‘కేసుల మాఫీకే సీఎం దిల్లీ పర్యటన’

‘శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు వైకాపాను ఛీకొట్టారు. రాయలసీమ పట్టభద్రులు వద్దంటూ ఓటుతో బుద్ధి చెప్పారు.

Published : 19 Mar 2023 04:25 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పక్కన నాయకులు

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే : ‘శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు వైకాపాను ఛీకొట్టారు. రాయలసీమ పట్టభద్రులు వద్దంటూ ఓటుతో బుద్ధి చెప్పారు. ఇంత జరిగినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 175 సీట్లు గెలుస్తామంటూ ఉపన్యాసాలిస్తున్నారు. ఎన్నికలు, శాసనసభ సమావేశాలు జరుగుతుంటే కేసుల మాఫీ కోసం హుటాహుటిన దిల్లీ వెళ్లారు’ అని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సొంత గడపలో రూ.40 కోట్లు ఖర్చు పెట్టినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవలేకపోయారన్నారు. నాలుగేళ్ల పాలనలో వైకాపా అరాచకాలను చూసిన యువత తమ శక్తిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించారన్నారు. ప్రస్తుతం 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రికి  గుణపాఠం చెప్పారన్నారు. నియంత పాలన ఎక్కువ కాలం ఉండదని, మీ బిడ్డనంటూ సీఎం జగన్‌ ప్రజలను మోసం చేశారన్నారు. ప్రతిపక్షాల నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అందరూ అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయిస్తే, సీఎం జగన్‌ మూడు రాజధానుల పేరుతో విశాఖను రాజధాని చేస్తామన్నారని, ఉత్తరాంధ్ర ప్రజలు ఓటుతో మాకు రాజధాని వద్దు, పులివెందుల ఫ్యాక్షనిజం వద్దని చెప్పారన్నారు. వచ్చే ఎన్నికల్లో 155 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అన్నపూర్ణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనవెంట తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, జడ్పీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ లక్ష్మీరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్‌ హరికృష్ణ, నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, నాయకులు మన్మోహన్‌రెడ్డి, మునిరెడ్డి, గుర్రప్ప, జనార్దన్‌, శ్రీనివాసులు, ఖాసీం తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని