logo

బోర్డులు పీకెయ్‌... భవనాలు కట్టెయ్‌!

పీలేరు, పరిసర పంచాయతీల పరిధిలో ప్రభుత్వ, డీకేటీ భూములను కొందరు ఆక్రమించుకోగా అప్పటి మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి స్వాధీనం చేసుకున్నారు.

Published : 20 Mar 2023 04:49 IST

బోర్డును తొలగించి చేపడుతున్న నిర్మాణాలు

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే : పీలేరు, పరిసర పంచాయతీల పరిధిలో ప్రభుత్వ, డీకేటీ భూములను కొందరు ఆక్రమించుకోగా అప్పటి మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం ఆ భూములు రూ.కోట్లు పలుకుతున్నాయి. కబ్జాదారులు ఆక్రమిత భూముల్లో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్నారు. పీలేరు పంచాయతీ సర్వే నంబరు 30లో చెరువు పొరంబోకు స్థలం 20 ఎకరాలు ఉంది. చెరువు కట్ట కింద ఎకరం భూమిపై ఓ బడా బాబు కన్నేశాడు. భారీగా మట్టిని నింపి చదును చేసి రెండు బోరు బావులు తవ్వించాడు. ఆక్రమణల స్వాధీన ప్రక్రియలో ఈ భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అక్రమార్కులు ఇక్కడ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించేశారు. అయినా రెవెన్యూ అధికారుల్లో కదలికలేదు. ఇదే అవకాశంగా తీసుకున్న కబ్జాదారులు నిర్మాణాలు చేపట్టారు. బళ్లారి- నాయుడుపేట జాతీయ రహదారి పక్కనే ఈ స్థలం ఉండడంతో ఎకరం రూ.8 కోట్ల ధర పలుకుతోంది. కబ్జాదారులపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై తహసీల్దారు రవిని వివరణ కోరగా పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని