logo

ఆగిన బిల్లులు.. అసంపూర్తిగా భవనాలు

చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించే బాలబడులు నేటికీ అందుబాటులోకి రావడం లేదు. అసౌకర్యాల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

Updated : 20 Mar 2023 05:24 IST

అద్దె గదుల్లో చిన్నారులకు పాఠాలు 
అసౌకర్యాల మధ్య అంగన్‌వాడీ కేంద్రాలు

బసినికొండలో గోడల వరకు నిర్మించి వదిలేసిన అంగన్‌వాడీ కేంద్ర భవనం

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించే బాలబడులు నేటికీ అందుబాటులోకి రావడం లేదు. అసౌకర్యాల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పక్కా భవనాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినా అవి మొండిగోడలకే పరిమితయ్యాయి. గుత్తేదారులకు బకాయిల కారణంగా నిర్మాణాలు పూర్తి చేయాల్సిన భవనాలు అర్ధాంతరంగా నిలిపి వేశారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు మొండిగోడలకే పరిమితం అయ్యాయి. స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలో చాలా వరకు అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సాగుతోంది.

* అన్నమయ్య జిల్లాలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు తొమ్మిది ఉండగా ప్రధాన కేంద్రాలు 1,858, మినీ విభాగంలో 417 పనిచేస్తున్నాయి. గర్భిణులు 12,537, బాలింతలు 12,069 మంది ఉన్నారు. వీటిలో 1,017 సొంత భవనాలు కాగా, ప్రభుత్వ, పంచాయతీ ఇతర అద్దెలేనివి 425 కేంద్రాలున్నాయి. 833 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అద్దెలకు సంబంధించి రూ.1,20,16,400 ఖర్చు చేస్తున్నారు. 577 భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పెట్టారు. పదేళ్ల క్రితం నాబార్డు, స్త్రీశిశు సంక్షేమ, ఉపాధి హామీ పథకం అనుసంధాన నిధులతో పలు ప్రాంతాల్లో భవనాలు మంజూరయ్యాయి. కాగా ప్రభుత్వాలు మారుతున్న కారణంగా నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో గుత్తేదారులు భవన నిర్మాణాలు నిలిపి వేసినట్లు తెలుస్తుంది. పలు ప్రాంతాల్లో మొండిగోడలకు పరిమితం కాగా, కొన్ని కేంద్రాలు సిమెంట్‌ మోల్డింగ్‌ వేసి వదిలేశారు.

* వైయస్‌ఆర్‌ జిల్లాలో సమగ్ర శిశు సేవా పథకాలు 12 ఉన్నాయి. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు 2,212, మినీ విభాగంలో మరో 177 పనిచేస్తున్నాయి. గర్భిణులు 15,327 మంది ఉంటే 14,509 మందిని నమోదు చేశారు. వీరిలో 13,385 మంది లబ్ధి పొందుతున్నారని ఐసీడీఎస్‌ అధికారులు చెబుతున్నారు. బాలింతలు 15,372 మంది ఉండగా 14,312 మంది పేర్లను నమోదు చేసుకోగా వీరిలో 13,100 మందికి పౌష్టికాహారం తీసుకొంటున్నారని తెలిపారు. ఇక్కడా అదే పరిస్థితి నెలకొంది.

* మదనపల్లె ప్రాజెక్టు పరిధిలో మొత్తం 309 ప్రధాన, మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 121 సొంత భవనాలుండగా, 39 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన భవనాల్లో నిర్వహిస్తున్నారు. 149 అద్దె భవనాల్లో పిల్లలకు చదువు చెబుతున్నారు. ఇక్కడ వివిధ స్కీమ్‌ల కింద అంగన్‌వాడీ కేంద్రాలు అయిదేళ్ల కిందట 13 భవనాలు మంజూరయ్యాయి. మదనపల్లెలో 4, నిమ్మనపల్లె రెండు, కురబలకోటలో ఒకటి, బి.కొత్తకోట మండలంలో ఆరు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టారు. ఇవి వివిధ దశల్లో నిర్మాణాల్లోనే ఆగిపోయాయి.

* మదనపల్లె గ్రామీణ మండలం బసినికొండలో 2018లో ఉపాధి హామీ పథకం, స్త్రీశిశు సంక్షేమశాఖ అనుసంధాన నిధులు రూ.7 లక్షలతో భవనం మంజూరు చేశారు. దీన్ని ప్రారంభించిన గుత్తేదారులు గోడల నిర్మాణాలు పూర్తి చేయగా బిల్లులు మంజూరు కాకపోవడంతో నిర్మాణాన్ని నిలిపి వేశారు. ప్రస్తుతం ఈ భవన ప్రాంగణం పిచ్చిమొక్కలు, తీగ మొక్కలతో అధ్వానంగా మారింది. బకాయిలు మంజూరు కాకనే భవనం అసంపూర్తిగా ఉన్నట్లు పంచాయతీరాజ్‌ ఏఈ వెంకటరమణ పేర్కొన్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

మదనపల్లె ప్రాజెక్టు పరిధిలో 13 భవనాలు వివిధ పథకాల కింద మంజూరు చేశారు. వీటిలో స్లాబ్‌, లెంటల్‌, పునాదుల నిర్మాణాలతో ఆగిపోయాయి. నిర్మాణ పనులు ఎందుకు ఆగిపోయాయో మాకు తెలియదు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

సుజాత, సీడీపీవో, ఐసీడీఎస్‌, మదనపల్లె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని