logo

బంతి... ధరలు భ్రాంతి

మార్కెట్‌లో బంతి పూల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలో బంతి రూ.10 కూడా పలకడం కష్టంగా మారింది.

Updated : 20 Mar 2023 04:54 IST

తోటల్లోనే వదిలేసిన రైతులు
వరుస నష్టాలతో కుదేలు

రామసముద్రం మండలం గొల్లపల్లె వద్ద తొలగించిన బంతి తోట

రామసముద్రం, న్యూస్‌టుడే: మార్కెట్‌లో బంతి పూల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలో బంతి రూ.10 కూడా పలకడం కష్టంగా మారింది. దీంతో వ్యాపారులు తోటల వద్ద కొనుగోలు మానేశారు. ఎగుమతులు పడిపోయాయి. దీంతో బంతి రైతులు లబోదిబోమంటున్నారు. ఎకరం బంతిసాగుకు రైతులు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రైతుకు దక్కడం లేదు. జిల్లాలోని మదనపల్లె, రామసముద్రం, నిమ్మనపల్లె, వాల్మీకిపురం, పీలేరు, వైయస్‌ఆర్‌ జిల్లాలో పెండ్లిమర్రి, పులివెందుల, తొండూరు, లింగాల, మైదుకూరు, ఖాజీపేట మండలాల్లో చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, పెద్దపంజాణి, చౌడేపల్లె, కుప్పం, శాంతిపురం, రామకుప్పం వంటి మండలాల్లో 1200 ఎకరాలకు పైగానే రైతులు బంతి, చామంతి సాగు చేపట్టారు. సాగుకు ఈ రెండు జిల్లాల పరిధిలో రూ.12 కోట్లు వరకు వ్యయం చేశారు. జనవరి నెలలో విత్తిన మొక్కలు ప్రస్తుతం రోజువారిగా 250 టన్నుల వరకు దిగుబడులు వస్తున్నాయి. ధరలు పడిపోవడంతో రైతులకు పూలు కోసే కూలీ, రవాణా ఖర్చులు కూడా చేతికి దక్కడం లేదు. దీంతో రైతులు పూలు కోయకుండా పొలాల్లోనే వదలివేయడం, పశువులకు ఆహారంగా చేయడం, మొక్కలనే పీకేయడం, తోటను ఎరువుగా దుక్కిలో కలిపేడం జరుగుతోంది. ధరల పతనంతో బంతి రైతులు రూ.12 కోట్లు వరకు పెట్టుబడిని కోల్పోయారు. రాబడి రూపంలో అంతకు రెట్టింపు నష్టాన్ని మూటగట్టుకున్నారు. ప్రభుత్వం బంతిరైతును ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఉద్యానశాఖాధికారి దృష్టికి తీసుకెళ్లగా పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు చెప్పారు. పరిహారం మంజూరైతే రైతుల ఖాతాలకు జమ చేస్తామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని