logo

రాములోరి బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు

ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డి పేర్కొన్నారు.

Published : 20 Mar 2023 04:49 IST

తితిదే ఈవో ధర్మారెడ్డి

కల్యాణ వేదిక ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న తితిదే ఈవో ధర్మారెడ్డి, కలెక్టరు  విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌, జేఈవో వీరబ్రహ్మం, సీఈ నాగేశ్వరరావు తదితరులు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే : ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఒంటిమిట్టలో రామయ్య క్షేత్రంలోని పరిపాలన భవనంలో కలెక్టరు విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌, జేఈవో వీరబ్రహ్మం, జేసీ సాయికాంత్‌వర్మ, సీఈ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆదివారం తితిదే, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కల్యాణ వేదికను పరిశీలించారు. తితిదే ఈవో మాట్లాడుతూ వచ్చే నెల 5న సీతారాముల కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తామన్నారు. సీసీ కెమెరాలు, కంట్రోల్‌ రూమ్‌, బారికేడ్లు, గ్యాలరీలు, విద్యుత్తు సరఫరా ఏర్పాట్ల పనులు వేగవంతంగా చేయాలని, నెలాఖరులోపు పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాములోరి కల్యాణానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరపున హాజరై పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. కలెక్టర్‌ విజయరామరాజు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భద్రత, వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలు, అన్న ప్రసాదం పంపిణీ, సహాయ కేంద్రాలు, సమాచార సూచికలు, పారిశుద్ధ్యం, వీవీఐపీ, వీఐపీలకు పాసులు, ప్రచారం చేయడానికి ప్రత్యేకంగా కమిటీలను నియమించామన్నారు. అధికారులంతా సమన్వయంతో సేవలందించి ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. నాలుగు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తయ్యేలా పక్కా ప్రణాళికతో కదలాలని సివిల్‌, విద్యుత్తు, అటవీ, అన్నదానం విభాగాల అధికారులకు జేఈవో వీరబ్రహ్మం ఆదేశించారు. ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, డ్వామా, ఏపీఎంఐపీ, మెప్పా, డీఆర్‌డీఏ పీడీలు యదుభూషణ్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, రామమోహన్‌రెడ్డి, ఆనంద్‌నాయక్‌, ఓఎస్డీ రఘునాథ్‌, డీఏవో నాగేశ్వరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ ప్రభాకర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటశివారెడ్డి, డీపీవో ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, డీటీసీ మీరా ప్రసాద్‌, ఆర్‌ఎం గోపాల్‌రెడ్డి, డిప్యూటీ ఈవో నటేష్‌బాబు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని