logo

రహదారులే పార్కింగ్‌ స్థలాలు!

కడప పురపాలక స్థాయి నుంచి నగరపాలక సంస్థ స్థాయికి ఎదిగి సుమారు 20 ఏళ్లు కావస్తోంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం ప్రకారం పన్నులు, జరిమానాలు వసూలు చేస్తున్న నగరపాలక యంత్రాంగం ఆ స్థాయికి తగిన వసతులను కల్పించడంలో విఫలమవుతోంది.

Updated : 20 Mar 2023 04:56 IST

జరిమానాలతో హడలెత్తిస్తున్న పోలీసులు
అసహనానికి గురవుతున్న నగరవాసులు

మద్రాస్‌ రోడ్డులో నిబంధనలకు విరుద్దంగా ఆపిన కార్లు

న్యూస్‌టుడే, కడప నగరపాలక : కడప పురపాలక స్థాయి నుంచి నగరపాలక సంస్థ స్థాయికి ఎదిగి సుమారు 20 ఏళ్లు కావస్తోంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం ప్రకారం పన్నులు, జరిమానాలు వసూలు చేస్తున్న నగరపాలక యంత్రాంగం ఆ స్థాయికి తగిన వసతులను కల్పించడంలో విఫలమవుతోంది. నిధుల అవసరం లేకుండా కల్పించదగిన వసతుల విషయంలోనూ శ్రద్ధ చూపకపోవడం నగరవాసులను  ఆవేదనకు గురిచేస్తోంది. కడపలో నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్‌ తీవ్ర సమస్యగా మారింది. నగరంలో వన్‌టౌన్‌ ఠాణా కూడలి అత్యంత కీలకమైన ప్రాంతం. చుట్టుపక్కల వస్త్ర, నగల దుకాణాలు, కిరాణ, కూరగాయల మార్కెట్లు ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రోజూ ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చిపోతుంటారు. వారిలో చాలామంది నాలుగు చక్రాల వాహనాలను వినియోగిస్తున్నారు. వన్‌టౌన్‌ ఠాణా సమీపంలో అవసరమైన స్థాయిలో కార్ల పార్కింగ్‌ స్థలాలు లేకపోవడంతో ద్విచక్ర వాహనాలకు కేటాయించిన స్థలాల్లో నిలుపుతున్నారు. అనుమతి లేని ప్రాంతంలో వాహనాలను పార్కింగ్‌ చేశారన్న కారణంపై పోలీసులు జరిమానా విధిస్తున్నారు. కార్ల యజమానులకు ఇది భారంగా మారుతోంది. రహదారులపైనే వాహనాలను నిలుపుతుండడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధాన తపాలా కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని కార్ల పార్కింగ్‌ కోసం కేటాయించగా కొన్ని నెలల క్రితం జడ్పీ అధికారులు ఆ స్థలం చుట్టూ కంచె వేశారు. దిశ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న స్థలంలో కొంతభాగాన్ని తోపుడుబండ్ల వారు ఆక్రమించారు. మిగిలిన స్థలంలో 10 కార్లకు మించి పట్టవు. ఇక్కడ పార్కింగ్‌ చేసిన కార్లను పని ముగించుకున్న తర్వాత బయటకు తీయడానికి తగిన మార్గమే ఉండదు.

* క్రిస్టియన్‌లైన్లో రోగులు, వైద్యులు వాహనాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. సమీపంలో పార్కింగ్‌ స్థలాలు లేవు. ఎన్టీఆర్‌ కూడలి నుంచి ఎర్రముక్కపల్లి కూడలి వరకు రహదారులకు ఇరువైపులా ప్రముఖ వ్యాపార సంస్థలు, వైద్యశాలలు, హోటళ్లు, బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థలున్నాయి. దీని పరిధిలో ఎక్కడా కార్ల పార్కింగ్‌కు స్థలాలు లేవు. దేవునికడప ఆలయం, పెద్ద దర్గా తదితర ప్రాంతాల్లో వాహనాలను నిలపడానికి ఇబ్బందులు తప్పడం లేదు. సమస్యపై నగరపాలక ప్రణాళిక విభాగం అధికారి నాగేంద్రకుమార్‌ను వివరణ కోరగా వాహనాల పార్కింగ్‌కు తగిన స్థలాలను ఎంపిక చేయాలని కమిషనర్‌ ఇప్పటికే ఆదేశించారన్నారు. ట్రాఫిక్‌ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని రెండు సార్లు నిర్వహించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు పార్కింగ్‌ స్థలాలను ఎంపిక చేయనున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని