logo

లాటరీకి రాంరాం... ప్రతిభకు పట్టం

మహాత్మా జ్యోతిబాఫులే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు పద్ధతి మారింది. ఇంత వరకు లాటరీ విధానంలో విద్యార్థులను చేర్చుకునేవారు... ఇక నుంచి ప్రతిభ ఆధారంగా సీటు కేటాయించనున్నారు.

Published : 20 Mar 2023 04:49 IST

మహాత్మా జ్యోతిబాఫులే గురుకుల పాఠశాలలో చేరేందుకు కొత్త విధానం
ఏప్రిల్‌ 4 వరకు గడువు

జమ్మలమడుగు గురుకుల పాఠశాలలో ధ్యానం చేస్తున్న విద్యార్థులు

న్యూస్‌టుడే, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు పట్టణం : మహాత్మా జ్యోతిబాఫులే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు పద్ధతి మారింది. ఇంత వరకు లాటరీ విధానంలో విద్యార్థులను చేర్చుకునేవారు... ఇక నుంచి ప్రతిభ ఆధారంగా సీటు కేటాయించనున్నారు. అయిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణులైనవారిని ప్రవేశానికి అర్హులుగా తేలుస్తారు. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. వెబ్‌సైట్‌ ద్వారా https:///mjpap-bcwreis.apcfss.in దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే విద్యార్థి వివరాల నమోదు, పరీక్ష కేంద్రాల కేటాయింపు జరుగుతాయి. ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

అర్హత వివరాలివి

ఈ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జిల్లాలోని ఏదైనా ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ గుర్తింపు ఉన్న స్కూల్‌లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో నాల్గో తరగతి చదువుతూ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ పిల్లలైతే 2010 సెప్టెంబరు ఒకటి - 2014 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. బీసీ, ఈబీసీ విద్యార్థులు 2012 సెప్టెంబరు ఒకటి - 2014 ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.లక్షకు మించకూడదు. ఐదో తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థి ఇంటర్మీడియెట్‌ వరకు గురుకుల పాఠశాలల్లోనే విద్యను అభ్యసించవచ్చు.

జిల్లాలో ఖాళీల వివరాలు

జిల్లాలో నాలుగు గురుకుల పాఠశాలల్లో మొత్తం 200 సీట్లు ఉన్నాయి. ఇందులో బాలికలకు 120, బాలురకు 80 సీట్లను కేటాయించారు. వనిపెంట బాలికల గురుకుల పాఠశాలలో 80, తొండూరు బాలికల పాఠశాలలో 40, జమ్మలమడుగు 40, కమలాపురం బాలుర గురుకుల పాఠశాలలో 40 సీట్లు భర్తీ చేయనున్నారు.

పరీక్ష సైతం కొత్తగానే

కరోనా వ్యాప్తి కారణంగా గత రెండేళ్లు లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక జరిగింది. ఈ సారి కొత్త విధానంలో ప్రవేశపరీక్షను నాల్గో తరగతి స్థాయిలోనే నిర్వహించనున్నారు. తెలుగు 10, ఆంగ్లం 10, సైన్స్‌, సాంఘిక శాస్త్రంలో 15, లెక్కలు 15 మొత్తం 50 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. విద్యార్థులు ఓఎంఆర్‌ షీట్‌లో జవాబులను రెండు గంటల్లో పూరించాల్సి ఉంటుంది.

సీట్లలో ఎవరికి ఎంత శాతం

జ్యోతిబాఫులే గురుకుల పాఠశాలలో రిజర్వేషన్‌ల ప్రకారం సీట్లను భర్తీ చేస్తారు. 74 శాతం బీసీలు, 15 ఎస్సీ, 6 ఎస్టీ, 2 ఓబీసీ, 3 శాతం అనాథ పిల్లలకు కేటాయించారు.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలోని మహాత్మా జ్యోతిబాఫులే గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ఈ ఏడాది ప్రతిభ ద్వారా సీట్లను భర్తీ చేయనున్నాం. తమ పాఠశాలలో చేరితో నాణ్యమైన విద్యతోపాటు మంచి ఆహారాన్ని అందిస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

కేవీఎస్‌ రామకృష్ణారెడ్డి, జ్యోతిబాఫులే పాఠశాలల జిల్లా కన్వీనరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని