logo

అధికారుల అండగా... అక్రమాలు దండిగా!

అధికార పార్టీకి చెందిన ఓ నేత ప్రభుత్వ భూమిని కబ్జా చేసేయడమే కాకుండా సర్కారు నుంచి పరిహారం పొందడానికి అన్నీ చక్కబెడుతున్నారు.

Published : 21 Mar 2023 04:07 IST

సర్కారు భూములపై అధికార పార్టీ నాయకుల కన్ను
పరిహారానికి ఒకరు... అమ్మకానికి మరొకరు యత్నం
ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, మైదుకూరు

అధికార పార్టీకి చెందిన ఓ నేత ప్రభుత్వ భూమిని కబ్జా చేసేయడమే కాకుండా సర్కారు నుంచి పరిహారం పొందడానికి అన్నీ చక్కబెడుతున్నారు. మరో నేత కాజేసిన ప్రభుత్వ భూమిని ఇతరులకు చక్కగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ రెండు అక్రమాలు స్థానిక అధికారులకు తెలిసినా నేతల అధికార దర్పం ముందు తలూపుతూ అధికారికంగా పచ్చజెండా ఊపడం గమనార్హం.


చిత్రంలో కనిపిస్తున్నవి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం పెద్దఓరంపాడు రెవెన్యూ గ్రామ పరిధిలో వందలాది ఎకరాల్లోని ప్రభుత్వ భూములు. ఇక్కడ మండల ప్రజాప్రతినిధిగా ఉన్న అధికార పార్టీకి చెందిన ఓ నేత తన పేరిటే కాకుండా.. భార్య, తల్లి పేరిట 23 ఎకరాల భూమిని కబ్జా చేసి ఉద్యాన పంటల సాగు చేపట్టారు. తన సోదరి, మామ పేరిట బొట్టిమీదపల్లె వద్ద మరో 20 ఎకరాలను ఆక్రమించారు. బొట్టిమీదపల్లె వద్ద ఆక్రమించుకున్న భూమిలో మూడెకరాలను అమ్మకానికి సైతం పెట్టారు. తన బినామీలు, అనుచరులకు దాదాపు 150 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను కట్ట బెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ అధికార యంత్రాంగం ద్వారా అధికారికంగా రికార్డుల్లో నమోదు చేయించుకునే ప్రయత్నాలు దశలవారీగా పూర్తిచేస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయంగా ఎలా ఉంటుందో... ఏమోననే ఆలోచనతో రికార్డులకు ఎక్కిన భూములను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడి తంతు రెవెన్యూశాఖాధికారులకు తెలిసినా అధికార పార్టీ నేత ముందు తలవాల్చుతూ... అన్ని సవ్యంగా చేసిపెడుతున్నారు. ఈ వ్యవహారంపై సోమవారం రాజంపేట సబ్‌కలెక్టరుకు ఫిర్యాదు అందింది. ఈ విషయమై తహసీల్దారు పీరుమున్ని మాట్లాడుతూ ‘గతంలో కొందరు అధికారులు డీకేటీ భూములను కొందరికి కట్టబెట్టారు. వారికి అర్హత ఉందా?.. లేదా? అని పరిశీలించారా...లేదో తెలియదు. ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తే తమకు అన్ని రకాల హక్కులున్నాయంటున్నారు. ఈ వ్యవహారం నానుతూ ఉంది’ అని పేర్కొన్నారు.


ఇది వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు మండలం నంద్యాలంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 789లోని 4.17 ఎకరాల ప్రభుత్వ భూమి. ఈ భూమిలోకి ఎవరూ ప్రవేశించరాదంటూ నాలుగేళ్ల కిందట హెచ్చరిక బోర్డు నాటుతున్న రెవెన్యూ సిబ్బందిని చిత్రంలో చూడొచ్చు. వైకాపా అధికారంలోకి రాగానే మైదుకూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కబ్జా చేశారు. ఉద్యాన పంటలు సాగు చేయడంతో పాటు ప్రభుత్వం నుంచి బిందుసేద్యంతో పాటు ఇతరత్రా రాయితీలు దర్జాగా పొందారు. జాతీయ రహదారి పక్కనున్న భూమి కావడంతో అత్యంత విలువ కూడా చేస్తోంది. తాజాగా కర్ణాటక నుంచి కష్ణపట్నం నౌకాశ్రయానికి రహదారి అనుసంధానంలో భాగంగా జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. రెవెన్యూ అధికారులు భూసేకరణ చేపట్టారు. నంద్యాలంపేట వద్ద వైకాపాకు చెందిన బడా నేత ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమికి పరిహారం ఇచ్చేందుకు వీలుగా అవార్డు అమలు చేసి ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. ఆక్రమణలపై గతేడాది స్పందనలో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా... సంబంధిత పొలంలో వేరుసెనగ పంట ఉన్నందున పంట నూర్పిడి పూర్తికాగానే స్వాధీనం చేసుకుంటామనే సమాధానం అధికారుల నుంచి వచ్చింది. ఈ భూమి ఎవరిదో తెలియదనే విధంగా సహ చట్టం కింద మండల వ్యవసాయాధికారి సమాధానమిచ్చారు. ఈ- క్రాప్‌లోనూ నమోదు చేసుకోలేదని పేర్కొన్నారు. ఇంత వ్యవహారం నడిచిన భూమికి తాజాగా అక్రమంలో భాగస్వాములై దాదాపు రూ.2 కోట్ల పరిహారం చెల్లింపునకు అన్ని రకాలుగా సన్నాహాలు చేశారు. మరోపక్క ఈ వ్యవహారాన్ని బయటపెడుతూ జిల్లా వినియోగదారుల ఫోరం మాజీ సభ్యుడు ఎం.రామచంద్రనాయుడు సోమవారం స్పందన కార్యక్రమంలో జేసీ సాయికాంత్‌వర్మకు ఫిర్యాదు చేశారు. ఎర్రచందనం స్మగ్లరుగా కేసులున్న వ్యక్తి కాజేసిన భూమికి పరిహారం ఇవ్వడానికి జరిగిన సన్నాహాలను ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు. 67వ నెంబరు జాతీయ రహదారి విస్తరణకు సేకరించిన భూమికి పరిహారం చెల్లింపును నిలుపుదల చేసి ప్రజాధనాన్ని కాపాడాలని కోరారు. ఈ విషయమై తహసీల్దారు అనూరాధ మాట్లాడుతూ ప్రభుత్వ భూమికి పరిహారం చెల్లింపులు జరగలేదని, నిలుపుదలకు చర్యలు తీసుకుంటామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని