logo

ఉసురు తీసిన చీటీలు

ఆయనో పొరుగుసేవల ఉద్యోగి. భార్య, ముగ్గురు పిల్లలున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసమని ప్రైవేటు వ్యక్తుల వద్ద చీటీలు వేశారు. 

Published : 21 Mar 2023 04:07 IST

డబ్బులివ్వకపోడంతో ఒత్తిడికి గురై పొరుగుసేవల ఉద్యోగి మృతి
నిర్వాహకుల ఇంటి ఎదుట కుటుంబసభ్యులు, బాధితుల ఆందోళన

మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచిస్తున్న డీఎస్పీ వెంకటశివారెడ్డి, తహసీల్దారు శివరామిరెడ్డి 

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : ఆయనో పొరుగుసేవల ఉద్యోగి. భార్య, ముగ్గురు పిల్లలున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసమని ప్రైవేటు వ్యక్తుల వద్ద చీటీలు వేశారు.  గడువు ముగిసినా నిర్వాహకులు డబ్బులివ్వలేదు. దీంతో ఒత్తిడికి గురైన ఆ ఉద్యోగి ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందిన ఘటన కడప చిన్నచౌకు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కడప నగరంలోని శంకరాపురానికి చెందిన యు.నారాయణ కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో పొరుగుసేవల కింద బిల్‌ కలెక్టరుగా పని చేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవి అలియాస్‌ యల్లమ్మ, ఆమె భర్త సిద్దయ్య స్థానికంగా ప్రైవేటు చీటీలు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ చీటీలు వేయమని చెప్పడంతో రూ.5 లక్షల చీటీలు రెండు, రూ.2 లక్షల చీటీ ఒకటి వేశారు. నవంబరులో ఒకటి, డిసెంబరులో ఒకటి, జనవరిలో ఒక చీటీ చొప్పున మూడు చీటీల గడువు పూర్తి కావడంతో డబ్బులివ్వాలని నారాయణ నిర్వాహకులను అడుగుతున్నా వారు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామందికి చీటీ డబ్బులివ్వలేదని తెలియడం, మూడు రోజుల కిందట లక్ష్మీదేవి, ఆమె భర్త సిద్దయ్య ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడంతో ఆందోళనకు గురైన నారాయణ ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. తమకు రావాల్సిన డబ్బులిప్పించాలని డిమాండు చేస్తూ నారాయణ కుటుంబ సభ్యులు, బాధితులు మృతదేహాన్ని లక్ష్మీదేవి ఇంటికి తరలించి భీష్మించుకుని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటశివారెడ్డి, తహసీల్దారు శివరామిరెడ్డి, సీఐ శ్రీరాంశ్రీనివాసులు, ఎస్సైలు అమర్‌నాథ్‌రెడ్డి, రోషన్‌ అక్కడికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పారు. లక్ష్మీదేవి, ఆమె భర్త సిద్దయ్య, పిల్లలు శశికళ, రాజాపై 20 రోజుల కిందట కేసు నమోదు చేశామని చిన్నచౌకు సీఐ శ్రీరాంశ్రీనివాసులు తెలిపారు. భార్యాభర్తలిద్దరూ పరారీలో ఉన్నారని, నిందితులను అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.

 నారాయణ (పాత చిత్రం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని