logo

వేర్వేరు చోట్ల 10 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న అయిదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిందితుల వివరాలను ఎస్పీ వెల్లడించారు.

Published : 21 Mar 2023 04:07 IST

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌, పక్కన ఏఎస్పీ తుషార్‌ డూడి, అధికారులు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న అయిదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిందితుల వివరాలను ఎస్పీ వెల్లడించారు. ‘కడప చిన్నచౌకు ఠాణా పరిధిలోని వాటర్‌గండి గ్రామంలో ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో చిన్నచౌకు పోలీసులు నిఘా ఉంచారు. కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, ఫ్యాక్షన్‌ జోన్‌ డీఎస్పీ చెంచుబాబు, సీఐలు నాగభూషణం, శ్రీరాంశ్రీనివాసులు తమ సిబ్బందితో వెళ్లి దాడులు చేశారు. స్మగ్లర్లు పోలీసులపై రాళ్లు, గొడ్డళ్లు విసిరి ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా తప్పించుకుని స్మగ్లర్లను అరెస్టు చేశారు. దాడుల్లో తమిళనాడు రాష్ట్ర ధర్మపురి జిల్లా అరూర్‌ తాలూకాకు చెందిన రజనీకాంత్‌, రవి, సేలం జిల్లాకు చెందిన రమేష్‌, పళని మురుగన్‌, గణేశన్‌ను అరెస్టు చేసి వారి నుంచి 11 ఎర్రచందనం దుంగలు, ఒక వాహనం, రెండు గొడ్డళ్లు, అయిదు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు’ అని ఎస్పీ చెప్పారు. ఏఎస్పీ తుషార్‌ డూడి, ఎస్సైలు అమర్‌నాథ్‌రెడ్డి, రోషన్‌ పాల్గొన్నారు.


అరెస్టయిన నిందితులు, స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలతో పోలీసులు

పోరుమామిళ్ల : పోరుమామిళ్ల అటవీ రేంజ్‌ పరిధిలోని టేకూరుపేట అటవీ ప్రాంతంలో 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని  తిరుపతి టాస్క్‌ఫోర్సు సీఐ బాలకృష్ణ తెలిపారు. టేకూరుపేట- కవలకుంట్ల ప్రాంతంలోని కొమ్మినేని రస్తా వద్ద కారును అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అయిదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశామని తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోరుమామిళ్లకు చెందిన పాలగిరి నాగార్జున, పెద్దేటి నాగరాజు, గుజ్జల వెంకటేశ్వర్లు, చినమల వెంకటయ్య, పులివెందులకు చెందిన ప్రకాష్‌లను అరెస్టు చేశామని తెలిపారు. ఈ దాడిలో ఆర్‌ఐ చిరంజీవులు, ఆర్‌ఎస్సై రాఘవేంద్ర పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని