logo

పురిటి బిడ్డకు బొబ్బలు వచ్చినా పట్టించుకోవడం లేదు

మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యం సక్రమంగా అందించట్లేదని... ప్రసవానికి వచ్చిన తమను బిడ్డ పుట్టినప్పటి నుంచి సరిగా పట్టించుకోవట్లేదని.. డబ్బులు ఇస్తేనే వైద్యం అందిస్తున్నారని తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

Published : 21 Mar 2023 04:07 IST

జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బాలింత, ఆమె కుటుంబ సభ్యుల ఆవేదన

మదనపల్లె వైద్యం, న్యూస్‌టుడే: మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యం సక్రమంగా అందించట్లేదని... ప్రసవానికి వచ్చిన తమను బిడ్డ పుట్టినప్పటి నుంచి సరిగా పట్టించుకోవట్లేదని.. డబ్బులు ఇస్తేనే వైద్యం అందిస్తున్నారని తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కోసువారిపల్లెకు చెందిన మహేశ్వర్‌రెడ్డి సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య అరుణ ఈ నెల 14వ తేదీన రెండో ప్రసవానికి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరారు. మరుసటి రోజు వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స ద్వారా మగబిడ్డను తీశారు. బిడ్డను కొంత సమయం పాటు ఎస్‌ఎన్‌సీయూలోని వార్మర్స్‌లో పెట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజులుగా బిడ్ద శరీరంపై బొబ్బలు వచ్చి చీము పడుతోందని చెప్పినా.. వైద్య సిబ్బంది పట్టించుకోవడంలేదన్నారు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేటు చిన్నపిల్లల వైద్యశాల పేరు చెప్పి అక్కడకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని చెబుతున్నారని ఆరోపించారు. ప్రసవానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.5 వేల నగదును తీసకున్నారని ఆరోపించారు. అనంతరం పసిబిడ్డను కుటుంబ సభ్యులు మదనపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పద్మాంజలిదేవిని వివరణ కోరగా ఆసుపత్రిలో డబ్బు వసూళ్లు చేస్తున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా సిబ్బంది డబ్బు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యుడు అందుబాటులో ఉన్నారని ఆయనకు చూపిస్తే చికిత్స అందిస్తారని ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని