logo

నేర వార్తలు

కడప నగరంలో కెమెరాలు చోరీ చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. కడప నగరంలోని పెన్నార్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ వెల్లడించారు.

Published : 21 Mar 2023 04:07 IST

పోలీసుల అదుపులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప నగరంలో కెమెరాలు చోరీ చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. కడప నగరంలోని పెన్నార్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ వెల్లడించారు. ‘రాజస్థాన్‌ రాష్ట్రం బార్మిర్‌ జిల్లాకు చెందిన కమలేష్‌కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌ కడపలో ఉన్న బంధువుల ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవారు. ఇటీవల వచ్చి కడప నగరంలోని ఓ దుకాణంలో పనికి చేరారు. కడప ఎన్టీఆర్‌ కూడలిలోని స్మార్ట్‌ కెమెరాల దుకాణంపై అతని దృష్టిపడింది. కెమెరాలను దొంగలిస్తే ఫొటోగ్రాఫర్‌గా పనిచేయవచ్చిని నిర్ణయించుకున్నాడు. కానీ దొంగతనం ఎలా చేయాలో తెలియలేదు. యూట్యూబ్‌లో చూసి షెట్టర్‌ను ఎలా పగులగొట్టాలో నేర్చుకున్నాడు. తన స్నేహితుడు ప్రవీణ్‌కుమార్‌కు విషయాన్ని చెప్పాడు. ఈ నెల 16న రాత్రి ఇద్దరూ కలిసి స్మార్ట్‌ కెమెరాల దుకాణం షెట్టర్‌ను ఇనుపచువ్వతో పైకెత్తి దుకాణంలోకి వెళ్లి 18 కెమెరాలు, రెండు డ్రోన్‌ కెమెరాలు, మూడు ఖరీదైన లెన్స్‌లు దొంగలించారు. దుకాణ నిర్వాహకుడు జమాల్‌ ఒకటో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. నిందితులు కెమెరాలను తీసుకుని ముంబైకి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు కడప రైల్వేస్టేషన్‌లో నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.8 లక్షలు విలువ చేసే కెమెరాలు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు’ అని ఎస్పీ చెప్పారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ తుషార్‌ డూడి, డీఎస్పీ వెంకటశివారెడ్డి,, సీఐ నాగరాజు పాల్గొన్నారు.


గొలుసు అపహరణ కేసులో ఒకరు...

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప చిన్నచౌకు ఠాణా పరిధిలో జరిగిన గొలుసు చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. ‘ఈ నెల 18న ప్రకాష్‌నగర్‌కు చెందిన దానమ్మ ఉదయం నడకకు వెళ్తుండగా సిద్దవటం మండలం టక్కోలు గ్రామానికి చెందిన కంచెర్ల దేవేందర్‌రెడ్డి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిన్నచౌకు పోలీసులు, చలమారెడ్డిపల్లె క్రాస్‌రోడ్డు వద్ద కంచెర్ల దేవేందర్‌రెడ్డిని అరెస్టు చేశారు. అతని నుంచి రూ.1.20 లక్షలు విలువ చేసే బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు’ అని ఎస్పీ చెప్పారు. సమావేశంలో డీఎస్పీ వెంకటశివారెడ్డి, చిన్నచౌకు సీఐ శ్రీరాం శ్రీనివాసులు, ఎస్సైలు రోషన్‌, అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.


రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప- కనుమలోపల్లె మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తి సోమవారం రైలుకింద పడి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై రారాజు తెలిపారు. మృతిచెందిన వ్యక్తికి 45 నుంచి 50 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


చెక్కు బౌన్స్‌ కేసులో ఒకరికి ఏడాది జైలు

కడప న్యాయవిభాగం, న్యూస్‌టుడే : రుణం చెల్లింపు నిమిత్తం ఇచ్చిన బ్యాంక్‌ చెక్కు బౌన్స్‌ కావడంతో కడప నగరానికి చెందిన ఎస్‌.షామీర్‌బాషాకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కడప రెండో అదనపు మేజిస్ట్రేట్‌ షేక్‌ రియాజ్‌ సోమవారం తీర్పు ఇచ్చారు. కడప నగరానికి చెందిన కదిరి నాగేంద్ర కిరణ్‌ వద్ద ఎస్‌.షామీర్‌బాషా రూ.26 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పు చెలింపు నిమిత్తం షామీర్‌బాషా బ్యాంకు చెక్కు ఇచ్చారు. ఆ చెక్కును నగదు కోసం బ్యాంకులో జమచేయగా, షామీర్‌బాషా ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో చెక్కు బౌన్స్‌ అయింది. దాంతో కదిరి నాగేంద్ర కిరణ్‌ కోర్టులో కేసు దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో షామీర్‌బాషాకు జైలు శిక్షతో పాటు, రూ.19 లక్షలు చెల్లించాలని మేజిస్ట్రేట్‌ తీర్పు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని