logo

ప్రొద్దుటూరు సీఐ, ఏఎస్‌ఐలపై వేటు

ప్రొద్దుటూరులో పోలీసు వ్యవస్థ పనితీరుపై ఎస్పీ అన్బురాజన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులపై వేటు వేశారు.

Updated : 22 Mar 2023 03:54 IST

డీజిల్‌ వ్యవహారంలో ఆరోపణలే కారణం

ఈనాడు డిజిటల్‌, కడప: ప్రొద్దుటూరులో పోలీసు వ్యవస్థ పనితీరుపై ఎస్పీ అన్బురాజన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులపై వేటు వేశారు. బయోడీజిల్‌తో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న డీజిల్‌పై చర్యలు తీసుకోలేదన్న కారణంగా ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణా సీఐ మధుసూదన్‌గౌడ్‌,  ఏఎస్‌ఐ అహ్మద్‌ బాషాను వీఆర్‌కు బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ మధుసూదన్‌గౌడ్‌ కర్నూలులో, ఏఎస్‌ఐ అహ్మద్‌ బాషాను కడప వీఆర్‌లో రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణా పరిధిలో బయోడీజిల్‌, కర్ణాటక డీజిల్‌ దిగుమతి వ్యవహారంలో ఆరోపణలు రావడంతో విచారించిన పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. పొరుగు రాష్ట్రాల నుంచి బయోడీజిల్‌, డీజిల్‌ అక్రమంగా దిగుమతి చేసుకుని పెద్ద ఎత్తున ప్రొద్దుటూరులో విక్రయాలు జరుగుతున్నాయి. మైదుకూరు రోడ్డు, ఆటోనగర్‌ తదితర ప్రాంతాల్లో డీజిల్‌ అక్రమంగా నిల్వ ఉంచుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో లీటరుపై దాదాపు రూ.10 తక్కువ ఉండటంతో ట్యాంకుల కొద్దీ అక్కడి నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఆ ఇంధనాన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు, లారీలు, ఇతర వాహనాలకు వినియోగిస్తున్నారు. ఈ వ్యవహారంపై ‘ఈనాడు’లో ఈ నెల 17న ‘ప్రొద్దుటూరుకు కర్ణాటక డీజల్‌’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఎస్పీ ఆదేశాలతో ప్రొద్దుటూరులో బయోడీజిల్‌, కర్ణాటక డీజిల్‌ అక్రమ నిల్వలపై పోలీసు అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. గ్రామీణ పోలీసుస్టేషన్‌ పరిధిలో దాడులు నిర్వహించినా..ఆ తనిఖీల్లో గ్రామీణ ఠాణా పోలీసులు లేకపోవడం గమనార్హం. కడప స్పెషల్‌ పార్టీ పోలీసులు, ప్రొద్దుటూరులోని మిగతా ఠాణాల సీఐలు, ఎస్‌.ఐ.లు, ఇతర శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భారీగా కర్ణాటక డీజిల్‌ బయట పడింది. వేలాది లీటర్ల కర్ణాటక డీజిల్‌ సీజ్‌ చేయడంతో పాటు పలువురు నిందితులపై కేసులు సైతం నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని