logo

వీరికేమో బిల్లు... వారంతా గొల్లు!

పెండింగ్‌ బిల్లుల చెల్లింపు వ్యవహారం వైకాపాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల, అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గాల్లోని బిల్లుల బకాయిలకు ప్రాధాన్యమిస్తూ చెల్లిస్తున్నారు.

Published : 22 Mar 2023 02:07 IST

బిల్లుల చెల్లింపుల్లో పులివెందుల, రాయచోటికే ప్రాధాన్యం
ఇతర నియోజకవర్గాలకు ఇప్పట్లో బకాయిలు రానట్లే?
ఈనాడు డిజిటల్‌, కడప, రాయచోటి

పెనగలూరు- ఎన్‌ఆర్‌పురం మధ్య రాకపోకలకు ప్రత్యామ్నాయంగా నిర్మించిన రహదారి

పెండింగ్‌ బిల్లుల చెల్లింపు వ్యవహారం వైకాపాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల, అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గాల్లోని బిల్లుల బకాయిలకు ప్రాధాన్యమిస్తూ చెల్లిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఇతరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వరుస క్రమంలో ప్రాధాన్యాలు విస్మరించి చెల్లింపులు జరగడంపై ఆ పార్టీ నేతలు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను తీవ్రస్థాయిలో నిలదీస్తున్నారు.


అన్నమయ్య జిల్లా పెనగలూరు-ఎన్‌ఆర్‌పురం రహదారులు, భవనాలశాఖ రహదారి 2021, నవంబరులో వరదలకు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలను పునరుద్ధరిస్తూ ప్రత్యామ్నాయ రహదారిని తాత్కాలికంగా రూ.25 లక్షలతో నిర్మించారు. దీనికి బిల్లులు చెల్లింపునకు టోకెన్‌ అయినప్పటికీ దీని కంటే వెనుక ఉన్నవాటికి బిల్లులు చెల్లింపులు పూర్తయ్యాయి.


అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సర్పంచి మోహన్‌రెడ్డి కలెక్టర్‌ ఒత్తిడి మేరకు ఎఫ్‌డీఆర్‌ పనులు చేపట్టారు. బిల్లులు చెల్లింపు బాధ్యత నాదంటూ కలెక్టరు భరోసా ఇవ్వడంతో సర్పంచి పనులు చేపట్టగా ఇప్పటికీ బిల్లులివ్వలేదు.


అన్నమయ్య జిల్లా నందలూరుకు చెందిన వైకాపా నాయకుడు సుబ్బనర్సయ్య రహదారులు, భవనాలశాఖ కల్వర్టులను రూ.10 లక్షలతో నిర్మించారు. ఇప్పటికీ బిల్లులివ్వలేదు. ఈయనకు ఎన్‌డీబీ కింద భారీ మొత్తంలో బిల్లులు రావాల్సి ఉన్నా ఇంతవరకు ఇవ్వలేదు.


వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేలులో నాయకుడు సుబ్బారెడ్డి రహదారులు, భవనాలశాఖ రహదారికి మరమ్మతులు చేపట్టారు. రూ.23 లక్షలు వరకు మూడేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉండగా చెల్లించలేదు. ఇంజినీరింగ్‌ అధికారులను ఎంత మెరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది.


వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల, అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గాలకు మాత్రం ఇటీవల బిల్లులు చెల్లింపులు జరిగాయి. ముఖ్యమంత్రి జగన్‌ ఇలాకా కావడంతో పాటు ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని బిల్లుల మంజూరుకు కృషి చేస్తున్నారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సిఫార్సు లేఖలకు ప్రాధాన్యమిచ్చి చెల్లిస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు సీఎం కార్యాలయంలో ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి లాబీయింగ్‌తో బిల్లులవుతున్నాయని వైకాపా నేతలు అభిప్రాయపడుతున్నారు. రహదారులు, భవనాలశాఖతోపాటు పంచాయతీరాజ్‌, జలవనరులశాఖల్లో భారీ మొత్తంలో పెండింగ్‌ బిల్లులున్నాయి. దీనిపై జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పందిస్తూ ఫిబ్రవరిలోనే బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ సైతం ఇచ్చారు. పులివెందుల, రాయచోటి నియోజకవర్గాలకు మినహా ఇతర ప్రాంతాలకు చెల్లింపులు జరగలేదు. దీనిపై ఆయా ప్రాంతాల నేతలు తమ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. కొందరు స్పందిస్తుండగా, మరికొందరు తమ వ్యక్తిగత పనులు సరిపెట్టుకుంటూ నేతలు, కార్యకర్తలను విస్మరిస్తున్నారు. దీంతో అంతర్గతంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

వరదలకు కొట్టుకుపోయిన  పెనగలూరు- ఎన్‌ఆర్‌పురం రహదారి (పాత చిత్రం)


బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడంతో కలవరం...

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెండింగ్‌ బిల్లుల ప్రస్తావనే లేకపోయింది. అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో రూ.వందల కోట్ల బకాయిలున్నాయి. మూడేళ్లకుపైగా పేరుకుపోవడంతో బకాయిలకు సంబంధించిన స్పష్టమైన లెక్కలు సైతం ఆయా విభాగాల్లో లేకపోయాయి. వివిధ పథకాల కింద చేపట్టిన పనులకు నిధులు మంజూరు కాలేదు. బ్యాంకుల రుణ సాయంతో పాటు కేంద్రం సాయం చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మళ్లించుకుపోవడంతో నెలల తరబడి బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధులు కేటాయించి ప్రత్యేకంగా చెల్లింపులు జరుగుతాయని అందరూ భావించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రెండు నెలలకు ముందు నుంచే బిల్లులు చెల్లింపులు నిలిపివేశారు. చివరకు ప్రభుత్వ అధికారులు వినియోగించే వాహనాలతోపాటు వారి కార్యాలయాల అద్దె బిల్లులనూ ఆపేశారు. పీడీ ఖాతాలకు చెల్లించాల్సిన బిల్లుల ప్రస్తావన కూడా బడ్జెట్‌లో లేకపోయింది. ఈ పర్యవసానంగా ఏ విభాగంలోనూ టెండర్లు పిలిచినా దాఖలు చేసేవారు లేకపోయారు. గుత్తేదారుల నుంచి స్పందన లేకపోవడంతో మళ్లీ మళ్లీ పిలిచి విరమించుకుంటున్న దాఖలాలున్నాయి. ఎఫ్‌డీఆర్‌ కింద తాత్కాలిక పనులు తప్ప శాశ్వతంగా చేపట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  


మా పరిధిలో లేదు : బిల్లులు అప్‌లోడ్‌ చేయడం వరకే మా బాధ్యత. చెల్లింపులంతా సీఎఫ్‌ఎంఎస్‌ పరిధిలో ఉంటుంది. ఎవరికి చెల్లింపులు చేయాలి... చేయరాదన్నది... మా చేతిలో లేదు.  

పి.మహేశ్వరరెడ్డి, ఎస్‌ఈ, రహదారులు,  భవనాలశాఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని