logo

అమ్మో... ఆ దారిలోనా!

అది అతిపెద్ద జాతీయ రహదారి ప్రాజెక్టు. పల్లె ప్రజానీకం జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కనీస ప్రమాణాలను అటు ఇంజినీరింగ్‌ విభాగం... ఇటు గుత్తేదారు సంస్థ పాటించడంలేదు.

Published : 23 Mar 2023 04:49 IST

రహదారి విస్తరణ పనుల్లో నిబంధనల ఉల్లంఘన

దుమ్ము, ధూళితో వందల ఎకరాల్లో పంటలు ధ్వంసం
రోడ్డు వెంబడి గ్రామాల్లోని ప్రజలకు తప్పని అవస్థలు
ఇదీ ములకలచెరువు-మదనపల్లె జాతీయ రహదారి దుస్థితి

ములకలచెరువు- మదనపల్లె మార్గంలో రేగుతున్న దుమ్ము

అది అతిపెద్ద జాతీయ రహదారి ప్రాజెక్టు. పల్లె ప్రజానీకం జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కనీస ప్రమాణాలను అటు ఇంజినీరింగ్‌ విభాగం... ఇటు గుత్తేదారు సంస్థ పాటించడంలేదు. ఫలితంగా వందలాది ఎకరాల్లో పచ్చటి పంటలు నాశనమవుతున్నాయి. కొందరైతే ఇక్కడి పరిస్థితులకు భయపడి పంటలేయకుండా బీడుగా వదిలేశారు. చివరకు పల్లెల్లో నివాసాలు ఉండటానికి వణికిపోతున్నారు. తమ కష్టాలను చెప్పుకోవడానికి సైతం భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, ములకలచెరువు గ్రామీణ

అనంతపురం- చెన్నై జాతీయ రహదారిలో భాగంగా ములకలచెరువు నుంచి మదనపల్లె వరకు రూ.342 కోట్ల అంచనాతో 42 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. ములకలచెరువు నుంచి అంగళ్లు వరకు పది మీటర్ల వెడల్పున, అంగళ్లు నుంచి మదనపల్లె వరకు నాలుగు వరుసల రహదారితో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ములకలచెరువు నుంచి బురకాయలకోట వరకు పనులు చేపట్టారు. సాధారణంగా రహదారి విస్తరణ పనులు చేపట్టే సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా, పరిసర ప్రజల జీవనానికి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టెండరు నిబంధనల్లో రూపొందించబడతాయి. ఇవన్నీ ఇక్కడ పాటించడంలేదంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయంగా నెలకొంటోంది. ఓ వైపు రహదారి నిర్మాణం పూర్తి చేసి... దానిపై వాహన రాకపోకలు సాగేవిధంగా చర్యలు చేపట్టి మరోవైపు నిర్మాణ పనులు చేపట్టాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో రెండు వైపులా రహదారి తవ్వేసి అడ్డదిడ్డంగా పనులు చేపడుతున్నారు. ఫలితంగా వాహనచోదకులతో పాటు స్థానికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ములకలచెరువు మండలం చీకుచెట్టువారిపల్లిలో దుమ్ము బారిన పడకుండా ఓ ఇంటికి వేసుకున్న తెర

కమ్మేస్తున్న దుమ్ము, ధూళి

రహదారి వెంబడి ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. రహదారి నిర్మాణంతో దుమ్ము, ధూళి రేగుతుండడంతో పంటలు నాశనమవుతున్నాయి. ఇప్పటికే పలువురు రైతులు పంటలను వదిలిపెట్టేయగా, మరి కొందరు దుమ్ము రాకుండా స్వయంగా నీరు జల్లుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పనులన్నీ గుత్తేదారు సంస్థ చేపట్టాల్సి ఉండగా రైతులే బాధ్యత తీసుకుంటున్నారు. సాధారణంగా రహదారి నిర్మాణ సమయంలో దుమ్ములేవకుండా గుత్తేదారు నిరంతరం నీటిని జల్లాల్సి ఉంది. ఈ జాగ్రత్తలేవీ పాటించకపోవడంతో పల్లెల్లో నివాసముంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు తమ నివాసాల్లోకి దుమ్ము, ధూళి చొరబడకుండా తెరలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పాఠశాల యాజమాన్యాలు సైతం రక్షణతెరలు ఏర్పాటు చేసుకుంటున్నా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. పంటల రక్షణకు తెరల ఏర్పాటు రైతులకు అదనపు భారంగా మారుతోంది. ఈ పరిస్థితిని గమనించిన కొందరు రైతులు పంటలు సాగు చేయకుండా పొలాలను వదిలేయడం గమనార్హం. పంటలు సాగు చేస్తున్నవారంతా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాస్త ఉపశమనం లభించినా తిరిగి దుమ్మురేగుతుండడంపై రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

జాగ్రత్తలు తీసుకుంటాం...

దుమ్ము, ధూళితో గ్రామాలతోపాటు పంటలకు తీవ్ర అసౌకర్యంగా ఉంది. గుత్తేదారు ద్వారా భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. పనులు చేపట్టిన ప్రాంతం వరకు రహదారి నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టి.. మిగిలిన ప్రాంతంలో పనులు ప్రారంభించేవిధంగా చర్యలు తీసుకుంటాం.

శివరాం, డీఈ, ఎన్‌హెచ్‌ఏఐ

కొత్త పనులు ఆపేశాం...

ప్రజల ఇబ్బందులను గమనించి పనులు చేపట్టిన ప్రాంతం వరకు తారు రహదారి నిర్మాణం పూర్తి చేసి మిగిలిన పనులను తరువాత మొదలుపెడతాం. రైతుల ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి.

చంద్రశేఖర్‌రెడ్డి, మేనేజరు, కేసీవీఆర్‌ గుత్తేదారు సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని