logo

అంతా అనధికారమే!

పచ్చని వ్యవసాయ భూములు స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో బక్కచిక్కిపోతున్నాయి. ఎలాంటి అనుమతుల్లేకుండా వ్యవసాయేతర భూములుగా మారుస్తున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

Published : 23 Mar 2023 04:49 IST

అక్రమ లేఅవుట్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి
జమ్మలమడుగు డివిజన్‌ పరిధిలో 365 గుర్తింపు

జమ్మలమడుగు డివిజన్‌లోని అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండు

చేస్తూ  ధర్నా చేస్తున్న రాష్ట్ర మాల మహానాడు నాయకులు (పాత చిత్రం)

పచ్చని వ్యవసాయ భూములు స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో బక్కచిక్కిపోతున్నాయి. ఎలాంటి అనుమతుల్లేకుండా వ్యవసాయేతర భూములుగా మారుస్తున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మరోవైపు భూములపై అవగాహన లేక ఆ స్థలాలను కొనుగోలు చేసినవారు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రధానంగా జిల్లాలోని జమ్మలమడుగు డివిజన్‌ పరిధిలో ఇప్పటికే 365 అనధికార లేఅవుట్లు గుర్తించడం గమనార్హం.

న్యూస్‌టుడే, జమ్మలమడుగు

జమ్మలమడుగు డివిజన్‌ పరిధిలో జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, రాజుపాలెం, దువ్వూరు, చాపాడు మండలాలు ఉన్నాయి. పచ్చని పంటలతో ఉండే ఈ ప్రాంతంలో అనధికార లేఅవుట్లు వేయడంతో ఆ పచ్చదనం కనుమరుగవుతోంది. ఒక్క ప్రొద్దుటూరు ప్రాంతంలోనే 149 అనధికార  లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూదోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతోందని ఈ ఏడాది ఫిబ్రవరి 22న రాష్ట్ర మాలమహానాడు నాయకులు జమ్మలమడుగు పాత బస్టాండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ముద్దనూరు, తాడిపత్రి, ప్రొద్దుటూరు రహదారుల్లో భూముల ధరలు పెరిగిపోవడంతో అటువైపు వెంచర్లు వెలుస్తున్నాయి. ప్రొద్దుటూరు, మైదుకూరు మధ్యలో ఉన్న చాపాడు మండలంలో ఎకరా రూ.3 కోట్లకుపైగా ధర పలుకుతుండడం గమనార్హం.

* ప్రొద్దుటూరు మండల పరిధిలో 15 పంచాయతీలుండగా 14 పంచాయతీల పరిధిలో పెద్దఎత్తున అనధికార లేఅవుట్లు ఉండడం గమనార్హం. పట్టణం చుట్టూ ఎటు చూసినా స్థలాలు ఖరీదుగా మారడంతో స్థిరాస్తి వ్యాపారులు వ్యవసాయ భూములను వ్యాపార సముదాయాలుగా మార్చేస్తున్నారు. కొత్తపల్లె పంచాయతీ, గోపవరం, దొరసానిపల్లె, పెద్దశెట్టిపల్లె, చౌడూరు ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. చాలా మంది రైతుల నుంచి పొలాలను కొనుగోలు చేసి వ్యవసాయేతర భూమిగా బదలాయించకుండానే ప్లాట్లుగా విక్రయిస్తున్నారు.

అడాకు అప్పగిస్తాం

అడా (అన్నమయ్య అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) అనధికార లేఅవుట్లపై నిఘా పెడుతుంది. ఇటీవల జరిగిన జిల్లా ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకుంది. జమ్మల మడుగు డివిజన్‌లోని పది మండలాల్లోని అనధికార లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించాం. ఆ జాబితాను అడా అధికారులకు అందజేస్తాం.

విజయభాస్కర్‌, డీఎల్‌పీవో, జమ్మలమడుగు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని