logo

తయారీలో తంటాలు... పంపిణీకి పాట్లు

ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ‘జగనన్న గోరుముద్ద’ పథకం కింద ఈ నెల 21వ తేదీ నుంచి విద్యార్థులకు అదనంగా రాగిజావ ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు.

Updated : 23 Mar 2023 06:17 IST

వంట ఏజెన్సీ నిర్వాహకులపై అదనపు భారం

కొన్ని చోట్ల పాత్రల కొరతతో తప్పని అవస్థలు
ఉదయం 8.45 గంటలకు ప్రారంభంపై అభ్యంతరం
ఇదీ ప్రభుత్వ పాఠశాలలో రాగిజావ సరఫరా తీరు
-న్యూస్‌టుడే, కడప

ఇంటి నుంచి గ్లాసులు తెచ్చుకున్నామని చూపుతున్న విద్యార్థినులు

ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ‘జగనన్న గోరుముద్ద’ పథకం కింద ఈ నెల 21వ తేదీ నుంచి విద్యార్థులకు అదనంగా రాగిజావ ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు.  రాగి జావ పంపిణీలో ఇబ్బందులున్నాయని వంట ఏజెన్సీ నిర్వాహకులు వాపోతుండగా, సమయపాలనపై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

‘జగనన్న గోరుముద్ద’ పథకం కింద వైయస్‌ఆర్‌ జిల్లాలో 2,123 పాఠశాలల్లో 1,71,091 మంది, అన్నమయ్య జిల్లాలో 3,031 పాఠశాలల్లో 2,44,319 మంది లబ్ధి పొందుతున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, రుచి, శుచి, శుభ్రత లేదని ఇప్పటికే చాలామంది తినడానికి విముఖత చూపుతున్నారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు, హాజరు, తినేందుకు ముందుకొస్తున్నవారి సంఖ్యకు అసలు పొంతన కుదరడం లేదు. చాలామంది చిరుతిళ్లతో ఆకలి తీర్చుకుంటుండగా, మరికొందరు ఇళ్ల నుంచి తెచ్చుకొంటున్నారు. కోడిగుడ్డు కొందరే తింటున్నారు.

ఎలా సాధ్యం?

ఈ నెల 21వ తేదీ నుంచి అమలవుతున్న రాగిజావ పంపిణీలో ఎదురయ్యే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోలేదు. వంట పాత్రల కొరత ఉంది. రాగిజావను ఉడికించడానికి వాయుబండ/కట్టెలు వాడాలి. ఇలా చేయాలంటే అదనపు భారమవుతుందని వంట ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు. పైగా ఉదయం 8.45 గంటలకే విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. ఆ సమయానికి విద్యార్థులు ఎంతమంది వస్తారనేది లెక్క చెప్పడం కష్టం. పొద్దునే బడికి వచ్చి చేయాలన్నా అవస్థలు తప్పవు. ప్రతి విద్యార్థికి బెల్లం పొడి 10 గ్రాములు, రాగి పిండి 10 గ్రాముల చొప్పున 150 మి.లీ జావను ప్రతి మంగళ, గురు, శనివారం అందించాల్సి ఉంటుంది. వారంలో మూడు రోజులపాటు ఉదయాన్ని బడికి రావాలంటే కష్టంగా ఉంటుందని వంట ఏజెన్సీల ప్రతినిధులు వాపోతున్నారు. ఉదయం 8.45 గంటలకే అందించాలన్న అంశంపై ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.

గ్లాసులు మీరే తెచ్చుకోండి

రాగిజావ తాగడానికి అవసరమైన గ్లాసులను విద్యార్థులే తెచ్చుకోవాలని విద్యాశాఖ అధికారులు చెప్పారు. ఈ నెల 21న తొలిరోజు చాలామంది తెచ్చుకోలేదు.  ప్రధానోపాధ్యాయులు, గురువులు సొంత డబ్బులతో ప్లాస్టిక్‌, పేపరుతో తయారు చేసిన గ్లాసులను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. వేడిగా ఉండటంతో చేతులు కాలడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. రాగిజావ తయారీకి కావాల్సిన పాత్రలు, పిల్లలు తాగడానికి అవసరమైన స్టీల్‌ గ్లాసుల సరఫరాను విస్మరించింది. గ్యాస్‌, కట్టెల వాడకానికి ఏం ఇస్తారనేది స్పష్టత లేదు.

బిల్లులిస్తాం

వంట ఏజెన్సీల ప్రతినిధులు గ్యాస్‌, కట్టెలు వాడితే అందుకయ్యే ఖర్చుకు బిల్లులు ఇస్తాం. ప్రస్తుతం గ్లాసులను ఇంటిని తెచ్చుకోవాలని విద్యార్థులకు చెప్పాం. గ్లాసుల సరఫరాకు ప్రభుత్వం గుత్తపత్రాలు ఆహ్వానించింది. త్వరలో ఆయా పాఠశాలలకు పంపిణీకి చర్యలు తీసుకుంటాం.

- రాఘవరెడ్డి, డీఈవో, వైయస్‌ఆర్‌ జిల్లా
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని