logo

వాళ్లొద్దు... వెంటనే మారుద్దాం!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అధికార వైకాపా జీర్ణించుకోలేకపోతోంది. గృహ సారథుల ద్వారా సరైన ఫలితాలు రాలేదని గ్రహించింది.

Updated : 23 Mar 2023 06:21 IST

సగం మంది గృహ సారథులకు మంగళం
వాలంటీర్ల కుటుంబ సభ్యులకే అవకాశం
వైకాపా అధిష్ఠానం నుంచి ఆదేశాల జారీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితోనే నిర్ణయం

నేటి నుంచి   క్షేత్రస్థాయిలో ప్రక్రియ ఆరంభం

-ఈనాడు డిజిటల్‌, కడప

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అధికార వైకాపా జీర్ణించుకోలేకపోతోంది. గృహ సారథుల ద్వారా సరైన ఫలితాలు రాలేదని గ్రహించింది. వీరిలో సగం మందికి మంగళం పలకాలని నిర్ణయించుకుంది. వెంటనే మార్పునకు శ్రీకారం చుట్టాలని భావించింది. ఈ మేరకు గురువారం నుంచి క్షేత్రస్థాయిలో ప్రక్రియ ప్రారంభం కానుంది.

గృహ సారథుల  విషయమై సచివాలయ వాలంటీర్లకు అందిన  సందేశం

సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల నియామకôతో క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో 5.65 లక్షల మందితో వైకాపా సైన్యం అందుబాటులోకి వచ్చింది. వీరితో పార్టీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి. వీరి ద్వారా ఏడాదిలో జరిగే శాసనసభ ఎన్నికల్లో రాజకీయాన్ని మలుపు తిప్పేయాలని వైకాపా భావించింది. ఈ ప్రయోగం ద్వారా ఆశించిన ఫలితాలు రాలేదని ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రహించింది. 2019లో అధికార పగ్గాలు చేపట్టాక వాలంటీర్ల వ్యవస్థను వైకాపా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి 50 ఇళ్ల బాధ్యతలు అప్పగించింది. నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం, చరవాణుల బిల్లులు, పురస్కారాలు, సత్కారాలు తదితర వాటికి కలిపి ఏడాదికి రూ.వేల కోట్లు వెచ్చిస్తోంది. వీరికి ప్రత్యామ్నాయంగా గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల పేరుతో మరో కొత్త సైన్యాన్ని సృష్టించింది. వీరిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం, సామాజిక పింఛన్లు వీరి ద్వారా ఇప్పించడం ద్వారా ప్రజలకు పరిచయం చేసింది. వాలంటీర్ల ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరలేదని.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లక్ష్యం నెరవేరని పరిస్థితుల్లో  గృహసారథులను మోహరించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేయి కాల్చుకున్నట్లు గ్రహించింది.

సగం మందికి ఉద్వాసన

గృహ సారథులు సగం మందికి ఉద్వాసన పలకాలని వైకాపా అధిష్ఠానం నేతలను ఆదేశించింది. వారి స్థానంలో వాలంటీర్ల కుటుంబ సభ్యుల్లో ఒకరికి స్థానం ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు మార్పులు చేసి జాబితాలను రూపొందించి పంపాలని స్పష్టం చేసింది. దీంతో వార్డులు/ గ్రామాల వారీగా గురువారం నుంచి సమావేశాలు నిర్వహించి గృహ సారథులను ఎంపిక చేయాలని పురమాయించింది. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు సారథులను గతంలో వైకాపా నియమించింది. వీరికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచార, పంపిణీ బాధ్యతలు అప్పగించింది. చాలా చోట్ల వాలంటీర్లకు.. గృహ సారథులకు పొసగని పరిస్థితులేర్పడ్డాయి.  ఆధిపత్య పోరు తలెత్తింది. సమన్వయం లేకపోవడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణంగా గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్లను ఎన్నికల సంఘం దూరంగా పెట్టింది. రానున్న సాధారణ ఎన్నికల్లో దూరంగా పెట్టే అవకాశాలున్నాయి. వాలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలుండవనే అంచనాకు వచ్చింది. సమన్వయ లోపాన్ని అధిగమించడంతోపాటు వాలంటీర్ల కుటుంబసభ్యులకు బాధ్యతలు అప్పగించే పక్షంలో ప్రభావితం చేయెచ్చనే అభిప్రాయానికి వచ్చింది. ఇకపై ప్రతి ఇద్దరిలో వార్డు/ గ్రామ వాలంటీరు జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడు ఒకరు ఉండేవిధంగా గృహ సారథులను ఎంపిక చేయనున్నారు. మార్పునకు రాజకీయపరంగా ప్రతిబంధకం అయినట్లయితే మూడో వ్యక్తిగా వాలంటీరు కుటుంబ సభ్యుడిని నియమించాలని ఆదేశించింది. తాజా నిర్ణయంపై ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే గృహసారథుల నియామకంతో అక్కడక్కడ తలవంపులు వచ్చాయి.. ప్రస్తుతం మళ్లీ మార్పులు... చేర్పులతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు మరింత జఠిలమయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. తొలగించిన గృహసారథులు పార్టీ మారే అవకాశాలున్నాయని, ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉందంటూ నిట్టూరుస్తున్నారు. ఇదిలా ఉండగా ఫీల్డ్‌ ఆపరేషన్‌ ఏజెన్సీ(ఎఫ్‌ఓఏ) పేరుతో వాలంటీర్లకు బుధవారం చరవాణి సందేశాలు అందాయి. ప్రతి సచివాలయ పరిధిలో సమావేశాలు నిర్వహించడం.. గృహ సారథుల నియామకాలు కొత్తగా చేపట్టాలని.. వాలంటీర్‌ కుటుంబసభ్యులు తప్పనిసరిగా ఉండాలని కోరుతూ సందేశాలు చేరాయి. కొత్తగా ఎంపిక చేసిన వారి పేరు, ఫోన్‌ నంబరు, వయసు తదితర వివరాలు సేకరించి పంపాలని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు