logo

ప్రైవేటీకరణ వైపు... సర్కారు చూపు!

పర్యాటకులను ఆకర్షించే కొత్త ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల్లో కొన్ని ప్రైవేటు సంస్థలకు కొత్త అభివృద్ధి పనులను ఒప్పంద విధానంలో అప్పగించడానికి కసరత్తు చేస్తోంది

Published : 26 Mar 2023 06:03 IST

హార్సిలీహిల్స్‌లో నిర్మాణాలు కలేనా?

అందని నిధులతో ముందుకు సాగని ప్రగతి
- న్యూస్‌టుడే, బి.కొత్తకోట

పర్యాటక కేంద్రమైన  హార్సిలీహిల్స్‌

పర్యాటకులను ఆకర్షించే కొత్త ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల్లో కొన్ని ప్రైవేటు సంస్థలకు కొత్త అభివృద్ధి పనులను ఒప్పంద విధానంలో అప్పగించడానికి కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో రిసార్టుల నిర్మాణాన్ని పర్యాటకశాఖ చేపట్టే అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. హరిత హిల్‌ రిసార్టు పేరిట రూ.6.50 కోట్ల అంచనాలతో కొత్త ప్రాజెక్టు కోసం పర్యాటకశాఖ అధికారులు అయిదేళ్ల కిందట ప్రతిపాదనలు పంపారు. ఇందుకోసం హార్సిలీహిల్స్‌లోని పర్యావరణ అధ్యయన కేంద్రం వెనుక మూడెకరాలను రెవెన్యూశాఖ పర్యాటకశాఖకు అప్పగించింది. రాతిబండలతో నిండిన ఈ ప్రదేశంలో రిసార్టులను నిర్మించడానికి అనువుగా ఉంటుందని అధికారులు గుర్తించారు.

కొండకు మహర్దశ

సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉన్న హార్సిలీహిల్స్‌ ప్రకృతి రమణీయతకు... ఆహ్లాదకర వాతావరణానికి మారుపేరుగా నిలుస్తోంది. వేసవి గ్రీష్మతాపంతో తల్లడిల్లుతున్న జనం సేదతీరడానికి అనువైన హిల్‌ స్టేషన్‌గా భావిస్తున్నారు. ఆంధ్రా ఊటీగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ కొండకు వస్తున్న పర్యాటకులు ఏటికేడాది పెరుగుతున్నారు. పర్యాటక, అటవీ, పోలీసుశాఖలతో పాటు ప్రైవేటు అతిథి గృహాలున్నాయి. పర్యాటకశాఖకు చెందిన గవర్నరు బంగ్లాతో పాటు అతిథి గృహాలు, టెంట్‌ హౌస్‌, కాటేజీల్లో 52 గదులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి వేసవిలో కొండపై ఉన్న గదులు పర్యాటకులకు సరి పోవడం లేదు. ఎండా కాలంలో కొండపై బస చేసేందుకు వచ్చి గదుల్లేక వెనుదిరిగి వెళ్లిపోతున్న పర్యాటకుల సంఖ్య భారీగానే ఉంటోంది. దీన్ని గుర్తించిన పర్యాటకశాఖ ఆధునాతన వసతులతో రిసార్టులను నిర్మించాలని, రానున్న 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉండేవిధంగా ప్రణాళికను సిద్ధం చేసింది. రిసార్టుల నిర్మాణంతో కొండకు మహర్ధశ వస్తుందని, పర్యాటకశాఖ రాబడి భారీగా పెరుగుతుందని ఆశించారు. అయితే ఈలోగా ఒబెరాయ్‌ సంస్థకు అయిదు నక్షత్రాల హోటల్‌ నిర్మాణానికి కొండపై 15 ఎకరాల భూమిని కేటాయించింది. వచ్చే ఏడాది రూ.250 కోట్లతో హోటల్‌ నిర్మాణపనులను ప్రారంభించ డానికి ఒబెరాయ్‌ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుకు మంత్రి మండలి ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ఈ పరిస్థితుల్లో పర్యాటకశాఖ సొంతంగా రిసార్టుల నిర్మాణాన్ని చేపట్టే అవకాశాలు మృగ్య మవుతున్నాయి. కాగా మరోవైపు ప్రస్తుతం కొండపై ఉన్న కాటేజీలకు మరమ్మతులు చేయించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ఇప్పుడున్న అతిథి గృహాలు, హరిత హోటళ్లను ప్రైవేటుకు ధీటుగా ఆధునికరించడానికి నిధుల కొరత అవరోధంగా మారింది.


వసతుల కల్పనకు ప్రాధాన్యం

హార్సిలీహిల్స్‌లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అయిదు నక్షత్రాల హోటల్‌ రూపుదిద్దుకోబోతోంది. పర్యాటకులకు అత్యాధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఇలాంటి సమయంలో గత ప్రతిపాదనల మేరకు రిసార్టులు నిర్మించినా పర్యాటకులు రావడం కష్టమేనని భావిస్తున్నాం. రిసార్టుల నిర్మాణం కోసం సేకరించిన భూమిని ప్రైవేటు సంస్థకు అప్పగించే ఆలోచనలో ఉన్నాం. కొండపైకి వస్తున్న పర్యాటకులకు వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాం.
 నాగభూషణం,  జిల్లా పర్యాటకశాఖ  అధికారి (డీటీవో)


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని