logo

కమ్మేస్తున్న గంజాయి మత్తు!

ఈ ఏడాది జనవరి 11న వైయస్‌ఆర్‌ జిల్లా దువ్వూరు వద్ద పోలీసులు అయిదుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.40 లక్షలు విలువ చేసే 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Published : 26 Mar 2023 04:51 IST

విశాఖ నుంచి కడపకు భారీగా సరఫరా

యువతే లక్ష్యంగా పెద్దఎత్తున అమ్మకాలు
పిల్లల జీవితాలపై తల్లిదండ్రుల ఆందోళన

- ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, కడప నేరవార్తలు, గాలివీడు

ఇటీవల పోలీసులు స్వాధీనపరచుకున్న  గంజాయి పొట్లాలు


* ఈ ఏడాది జనవరి 11న వైయస్‌ఆర్‌ జిల్లా దువ్వూరు వద్ద పోలీసులు అయిదుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.40 లక్షలు విలువ చేసే 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నకిలీ నోట్లు సైతం లభ్యమయ్యాయి.


* ఫిబ్రవరి 21న కడప నగరంలోని తారకరామనగర్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుంచి ఒకటిన్నర కిలో గంజాయి పట్టుకున్నారు. పొట్లాలు తయారు చేసి యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.


* ఈ నెల 24న వైయస్‌ఆర్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 23.95 కిలోల గంజాయి స్వాధీనంతో పాటు 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.


* ఈ నెల 4న 28 కిలోల గంజాయితోపాటు 19 మందిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో దొరికినంత గంజాయి మరే రాష్ట్రంలోనూ స్వాధీనం చేసుకోలేదని నార్కోట్రిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) నివేదిక-2021 పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టుబడినా కేసు రూపంలో చూపించకుండా దాచిపెడుతున్నారు.


భావితరాలకు మార్గదర్శకంగా ఉండాల్సిన నేటి యువత గంజాయి ఊబిలో చిక్కుకుని వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. జీవితంలో నిర్ణీత లక్ష్యాలతో ముందుకు సాగాల్సిన వారు.. గంజాయికి బానిసలుగా మారుతున్నారు. మద్యం తరువాత ఎక్కువ మంది గంజాయికి వ్యసనపరులవుతున్నారు. వీరిలో అధిక శాతం యువత ఉంటోంది. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాజకీయం చొరబడి.. ఆదాయ మార్గంగా ఎంచుకుని ముఠాల ద్వారా కార్యకలాపాలు సాగుతున్నాయి. గంజాయిని నిర్మూలించే విషయంలో సర్కారు ఉపేక్ష భావితరాలకు శాపంగా  మారుతోంది.

విశాఖపట్నం జిల్లా ఒడిశా రాష్ట్రం నుంచి వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాలకు భారీఎత్తున గంజాయి సరఫరా అవుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా బ్యాగుల్లో కిలోలకొద్దీ పొట్లాలతో ప్రయాణికుల్లా నటిస్తూ తరలిస్తున్నారు. ఇటీవల వరుస ఘటనల్లో భారీ మొత్తంలో పోలీసులు పట్టుకున్నారు. రెండు జిల్లాల్లోని ముఠా నేతలకు చేరుతున్న గంజాయి మధ్యవర్తుల ద్వారా చిల్లర వ్యాపారులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విద్యాసంస్థలే లక్ష్యంగా పలు చోట్ల విక్రయాలు సాగుతున్నాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు గల యువత ఎక్కువగా గంజాయికి బానిసలవుతూ మత్తులో వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు గుర్తించి మందలించినా యువతలో మార్పు రాకపోగా, కొన్ని రోజులపాటు ఇంటికి రాకుండా పోతున్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా మత్తును వదలడం లేదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. గంజాయి సరఫరా నిందితుల్లో యువకులే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో ఈ నెల 4వ తేదీన పట్టుబడిన గంజాయి కేసులో 19 మంది నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వీరిలో 13 మంది వరకు 19 నుంచి 23 ఏళ్ల వయసున్న యువకులే ఉన్నారు. పోలీసులు అడపాదడపా దాడులు చేస్తూ గంజాయితో పాటు విక్రయించే వారిని అరెస్టు చేస్తున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో 70 కేసులు నమోదు చేసి, వందల కిలోల గంజాయిని స్వాధీనపరుచుకుని పలువురిని అరెస్టు చేశారు. కడప నగరంతో పాటు మదనపల్లె, రాయచోటి, పీలేరులో ఠాణాల పరిధిలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మహిళలు సైతం గంజాయిని విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గంజాయి విక్రయాలే వృత్తిగా ఎంచుకున్నారు. వీరిని పలుమార్లు అరెస్టు చేసినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు రావడంలేదు. ఎక్కువగా యువత మత్తు కోసమని గంజాయిని తాగుతుండగా, పదేళ్ల లోపు ఉన్నవారు కూడా గంజాయి మత్తుకు బానిస కావడం గమనార్హం.


- అన్నమయ్య జిల్లా

గాలివీడులో నాలుగు రోడ్ల కూడలి మార్గంలోని ఓ బ్యాంకు సమీపంలో నివాసముంటున్న ఓ వ్యక్తి యువతకు గంజాయి విక్రయిస్తున్నారు. పాపిరెడ్డిగారిపల్లె చివరన చింతవనం, కళాశాల మార్గం, వెలిగల్లు జలాశయం క్వార్టర్స్‌, కుషావతి నది అక్విడెక్టు సమీపంలో గంజాయి వినియోగిస్తున్న యువత ఎక్కువగా కనిపిస్తున్నారు. గాలివీడులో ఓ యువకునికి అతడి తల్లిదండ్రులు స్వయం ఉపాధి కింద నూతనంగా దుకాణం పెట్టించినప్పటికీ మత్తు పదార్థాలకు అలవాటు పడి మతిస్థిమితం లేకుండాపోవడంతో బెంగుళూరులో వైద్య సేవలందిస్తున్నారు. మదనపల్లె పట్టణ సమీపంలోని ఓ గ్రామంలో కొన్ని నెలల కిందట ఇంజినీరింగ్‌ యువకుడు గంజాయికి బానిసయ్యాడు.చెన్నైలో చదివిస్తుండగా గ్రామానికి వచ్చి వ్యసనం బారిన పడ్డాడు. అతడిలో ఏ మాత్రం మార్పురాకపోగా తరచూ తండ్రిపై దాడికి పాల్పడే వాడు. దీన్ని భరించలేక తండ్రి సుపారీ ఇచ్చి బాసిసైన కుమారుడిని హత మార్చాడు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఇలాంటి పరిణామాలు జిల్లావ్యాప్తంగా ఎన్నో చోటు చేసుకుంటున్నాయి.


-వైయస్‌ఆర్‌ జిల్లా

కడప, బద్వేలు, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాలతో పాటు కడప నగరంలోని మాసాపేట, పూసలవీధి, వినాయకనగర్‌, అగాడి, ఖలీల్‌నగర్‌, నకాష్‌వీధి, తారకరామనగర్‌, అంగడివీధి, ప్రకాష్‌నగర్‌, మృత్యుంజయకుంట, అశోక్‌నగర్‌, చిన్నచౌకు, బుడ్డాయపల్లె, రామకృష్ణనగర్‌, రవీంద్రనగర్‌, రైల్వే వంతెన, రైల్వేస్టేషన్‌, బాలాజీనగర్‌, పాతబస్టాండు, గుర్రాలగడ్డ, ఉక్కాయపల్లె, అంబాభవానీ వీధి, తిలక్‌నగర్‌, బీడీ కాలనీ, బిల్టప్‌, లోహియానగర్‌, ఏఎస్‌ఆర్‌.నగర్‌, కేసీ.కాల్వ గట్టు ఇలా పలు ప్రాంతాల్లో గంజాయిని పొట్లాల రూపంలో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఎక్కువగా అశోక్‌నగర్‌, మాసాపేట, తారకరామనగర్‌ తదితర ప్రాంతాల్లో అమ్మకాలు సాగుతున్నాయి. కడప నగరంలోని తారకరామనగర్‌, ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం ప్రాంతంలో యువత పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. ఇటీవల సిద్దవటం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంలో 11 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులను విచారించగా కేరళకు తీసుకెళ్తున్నట్లు తేలింది.


నిఘా పెట్టాం
- అన్బురాజన్‌, ఎస్పీ, వైయస్‌ఆర్‌ జిల్లా

విద్యాసంస్థల వద్ద మహిళా పోలీసులతో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశాం. విద్యార్థుల ద్వారా సమాచారాన్ని సేకరించి ఇటీవల గంజాయితో పాటు 11 మందిని అరెస్టు చేశాం. గంజాయి విక్రయాలు, వినియోగించే వారి సమాచారం డయల్‌ 100 లేదా తన ఫోన్‌ నంబర్‌ 9440796900కు ప్రజలు ఇవ్వచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. నిందితులను కఠినంగా అణచివేస్తాం. తరచూ నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నాం. ఈ మేరకు ఆరుగురిపై ప్రయోగించాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని