logo

ఎవరేమన్నా తగ్గేదేలె!

స్థానిక ప్రజాప్రతినిధుల మాటకు కాలం చెల్లింది. వారు చేసే తీర్మానాలకు విలువే లేకుండా పోయింది! ఇలాంటి పన్నులు వద్దు.

Updated : 26 Mar 2023 06:09 IST

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులపై తగ్గని అధికారులు
ఎట్టకేలకు నగరపాలక బడ్జెట్‌కు ఆమోదం
న్యూస్‌టుడే, కడప నగరపాలక

మాట్లాడుతున్న మేయర్‌ సురేష్‌బాబు, పక్కన ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా

స్థానిక ప్రజాప్రతినిధుల మాటకు కాలం చెల్లింది. వారు చేసే తీర్మానాలకు విలువే లేకుండా పోయింది! ఇలాంటి పన్నులు వద్దు. పన్నులు ఇలా వసూలు చేయొద్దు అని ఎవరెన్ని సార్లు చెబుతున్నా, ఇలాగైతే మేం ప్రజల్లోకి వెళ్లలేమని గోడు వెళ్లబోసుకుంటున్నా నగరపాలక సంస్థ అధికారులు తగ్గేదేలె అంటున్నారు. ఇక లాభం లేదనుకున్న ప్రజాప్రతినిధులు ‘నగరపాలక సంస్థ ఆదాయాన్ని రూ.24 కోట్ల నుంచి రూ.46 కోట్లకు పెంచిన మీకు మా అభినందనలు’ అంటూ ప్రశంసించారు. రూ.574.34 కోట్ల భారీ బడ్జెట్‌ను ఆమోదించేశారు! 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌ను ఆమోదించడంతో నగర వాసులపై పన్నుల భారం పెరగనుంది.

మెప్పించడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నొప్పిస్తోంది: రూ.574.32 కోట్ల ఆదాయం, రూ. 535.47 కోట్ల ఖర్చు, రూ.38.85 కోట్ల మిగులు... అంకెల్లో చూస్తే ఈ బడ్జెట్‌ అద్భుతంగానే ఉంది. రూపాయి రాకపోకల వాస్తవికతను పరిశీలిస్తే ఇది కేవలం పన్నుల బడ్జెట్‌ అని స్పష్టమవుతోంది! 2022-23 ప్రారంభంలో రూ.33.98 కోట్లు ఉన్న ఆస్తి పన్ను ఈ ఏడాది రూ.43.74 కోట్లకు పెంచారు. నీటి పన్నులు, ప్రభుత్వ బదిలీ పన్నులు (స్టాంప్‌డ్యూటీ తదితరాలు) దాదాపు మార్పులేదు. వీటి ద్వారా రూ.25 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఉపయోగార్థ ఛార్జీలు (ట్రేడ్‌లెసెన్స్‌, చెత్తపన్ను) 2022-23లో రూ.1.41 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.12.87 కోట్లు అంటే 900 శాతం పెరుగుతాయని అంచనా వేశారు. ప్రజా పన్నులు (రోడ్డు కటింగ్‌, ఎగ్జిబిషన్‌ నిర్వహణ తదితరాలు) రూ.1.16 కోట్ల నుంచి రూ.3.58 కోట్లకు (300 శాతం ఎక్కువ) పెంచారు. టౌన్‌ప్లానింగ్‌ (బిల్డింగ్‌ లైసెన్స్‌ ఫీజులు, డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, ఓపెన్‌ స్థలాల పన్ను, ఇంపాక్ట్‌ ఫీజులు, అక్యుపెన్సీ ఫీజు తదితరాలు) రూ.14.30 కోట్ల నుంచి రూ.23.95 కోట్లకు పెరగనుంది. మార్కెట్లు, ఇతర వనరుల ద్వారా రూ.5 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా. 2022-23లో ఈ పద్దుల కింద రూ 97.75 కోట్లు వస్తుందని లెక్కలేశారు. ఇప్పుడు ఆ మొత్తం రూ.136.51 కోట్లకు పెరిగింది. ్య ప్రభుత్వం నుంచి వచ్చే క్యాపిటల్‌ జమలను పరిశీలిస్తే 2022-23లో రూ.472.38 కోట్లు వస్తాయని అంచనా వేయగా, కేవలం రూ.95.21 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రూ.597.23 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రూ.236.96 కోట్లకు పరిమితమైంది. 2023-24లో రూ.403.78 కోట్లు వస్తుందని అంచనా వేశారు. సమావేశంలో కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, డిప్యూటీ కమిషనర్‌ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


ఏ అంచనాతో పెంచారు?

2022-23లో రూ.30 లక్షల వరకు ఉన్న చెత్తపన్నును 2023-24 నాటికి రూ.7.55 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చెత్తపన్నే వద్దని, తగ్గించాలని, మురికివాడల్లో వసూలు చేయరాదని చేసిన తీర్మానాలు ఏమయ్యాయి. ట్రేడ్‌ లైసెన్స్‌, ఇంపాక్ట్‌ ఫీజులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ రుసుం, ఇతర అపరాధ రుసుం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటన్నింటినీ ఏ అంచనాతో పెంచారు? 

 పాకా సురేష్‌కుమార్‌,  కార్పొరేటర్‌, 47వ డివిజన్‌


పన్నులు బాధాకరమే

నగరపాలక సంస్థ విధిస్తున్న పన్నులు ప్రజలకు భారంగా మారాయి. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కమిషనర్‌ వేగంగా చేపడుతున్నారు. రిమ్స్‌ మార్గంలోని చెరువుకట్ట వద్ద ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేయాలి, గాంధీనగర్‌ పాఠశాల వద్ద దుకాణ సముదాయం నిర్మించాలి.
 బండి నిత్యానందరెడ్డి , డిప్యూటీ మేయర్‌


పింఛను నుంచి చెత్తపన్ను

వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పింఛన్లలో చెత్త పన్నును పట్టుకుంటున్నారు. వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని దీనిపై ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పడం లేదు. నగరంలోని వివిధ డివిజన్లలో వాలంటీర్లు ఇదే తరహాగా వ్యవహరిస్తున్నారు.
 ఉమాదేవి,  కార్పొరేటర్‌, 49వ డివిజన్‌


అధికారుల తీరు సమంజసం కాదు

పన్నులు, జరిమానాలు వసూలు చేయొద్దని  చెప్పం. వాటిని విధించడానికి అధికారులకు ఎంత హక్కు ఉంటుందో, వాటిని చెల్లించేందుకు ప్రజలకు హక్కులుంటాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా దుకాణాల వద్దకు వెళ్లి బోర్డు పన్ను కట్టలేదని ఓ దుకాణం బోర్డును కత్తితో కోసేశారు. ప్రజలు తిరిగి ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తారు. అధికారుల తీరు సమంజసం కాదు.

 షఫీ,  కార్పొరేటర్‌, 30వ డివిజన్‌ 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు