logo

యువతతోనే దేశాభివృద్ధి

ఆదర్శనీయమైన ప్రవర్తన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు, దేశ ఔన్నత్యానికి బాటలు వేస్తుందని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు కృష్ణారెడ్డి అన్నారు.

Published : 26 Mar 2023 05:02 IST

మాట్లాడుతున్న ప్రిన్సిపల్‌ కృష్ణారెడ్డి, పక్కన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, తదితరులు

వైవీయూ (కడప), న్యూస్‌టుడే : ఆదర్శనీయమైన ప్రవర్తన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు, దేశ ఔన్నత్యానికి బాటలు వేస్తుందని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు కృష్ణారెడ్డి అన్నారు. ‘మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ- జాతీయ, రాష్ట్ర కార్యచరణ ప్రణాళిక’లో భాగంగా వైవీయూ, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానాచార్యులు మాట్లాడుతూ విద్యార్థుల సత్ప్రవర్తన, ఉన్నతమైన వ్యక్తిత్వంతోనే డ్రగ్‌ ఫ్రీవర్సిటీగా వైవీయూ ఉందన్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌బ్యూరో సూపరింటెండెంట్‌ ఎస్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ మత్తు పదార్థాలతో జరిగే నష్టం తెలిసి కూడా బానిస కావడం మూర్ఖత్వమన్నారు. మత్తు పదార్థాలతో జీవితమే సర్వనాశనం అవుతుందన్నారు. ఎస్‌ఎస్‌ఏ పథక సంచాలకులు అంబవరం ప్రభాకర్‌ మాట్లాడుతూ యువత మనసును నియంత్రించుకునే తత్వం ఉండాలని, భవిష్యత్తుకు ఉపయోగపడే పనుల గురించి మాత్రమే ఆలోచించాలన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో వచ్చే అనారోగ్య సమస్యలు గురించి రిమ్స్‌ వైద్యులు వెంకట్రాముడు అవగాహన కల్పించారు. మత్తు రహిత భారతావని యువతతోనే సాధ్యమని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు కృష్ణకిశోర్‌ అన్నారు. సమావేశంలో ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి, పీవోలు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని