logo

కలుపు ఏరివేత... కాలువల్లో శుభ్రత

నేటి తరం విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చదువుతో పాటు సృజనాత్మకతకు పదును పెడుతూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. పీలేరు మండలానికి చెందిన ఓ విద్యార్థి రైతులకు ఉపయుక్తమైన వీడ్‌ డ్రీ మూవర్‌ (కలుపు ఏరివేత పరికరం) ఆవిష్కరించి రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

Updated : 27 Mar 2023 06:39 IST

న్యూస్‌టుడే,  పీలేరు గ్రామీణ, కడప విద్య

తయారు చేసిన పరికరంతో విద్యార్థి కార్తిక్‌, గైడ్‌ టీచర్‌ ఉషారాణి

నేటి తరం విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చదువుతో పాటు సృజనాత్మకతకు పదును పెడుతూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. పీలేరు మండలానికి చెందిన ఓ విద్యార్థి రైతులకు ఉపయుక్తమైన వీడ్‌ డ్రీ మూవర్‌ (కలుపు ఏరివేత పరికరం) ఆవిష్కరించి రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

పీలేరు మండలం రాయలవారిపల్లెకు చెందిన రూప, మోహన్‌ దంపతుల కుమారుడు చీకటిపల్లె కార్తిక్‌ పట్టణంలోని కాకతీయ విద్యా సంస్థల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వీరిది వ్యవసాయ కుటుంబం కావడంతో సాగు చేస్తున్న పంటకు కలుపు తీసే పనులు తలకు మించిన భారం అవుతోంది. ఇది గ్రహించిన ఈ విద్యార్థి తన ఆలోచనకు పదును పెట్టి పాఠశాల బయాలజీ ఉపాధ్యాయురాలు ఉషారాణి, బాబా ఫకృద్దీన్‌ మార్గదర్శకత్వంలో వ్యవసాయ పంటల్లో రైతుకు గుదిబండగా మారుతున్న కలుపు ఏరివేతకు ఉపయోగపడే విధంగా పరికరాన్ని రూపొందించాడు. ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 23న కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక సదస్సులో దీన్ని ప్రదర్శించారు. అక్కడ న్యాయ నిర్ణేతల మన్ననలు పొంది జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది.

తక్కువ ఖర్చుతో తయారు : ఈ పరికరం సాధారణ రైతు తక్కువ ఖర్చుతో తయారు చేసుకునేలా రూపొందించారు. ఒక ఇనుప పైపును తీసుకుని, చిన్నపిల్లల సైకిల్‌కు వాడే ప్లాస్టిక్‌ చక్రాలకు అమర్చి ఒక నీళ్ల డబ్బా పట్టే విధంగా పెట్టను తయారు చేసుకోవాలి. అక్కడ ఏర్పాటు చేసే డబ్బాకు ఒక స్ప్రే పరికరాన్ని ఏర్పాటు చేయాలి. ఈ భాగం పని చేయడానికి చేతితో ఉపయోగించి స్ప్రే పని చేసే విధంగా రెండు బ్రేకు వైర్లు ఏర్పాటు చేయాలి. పంట పొలాల సాళ్ల మధ్యలో వెళ్లే విధంగా రెండు ఇనుప మడకలను అమర్చాలి. ఈ పరికరం వరిమడికి తప్ప మిగతా అన్ని రకాల పంటలకు సంబంధించి కలుపు ఏరివేతతో పాటు పురుగు మందు పిచికారీ చేసే అవకాశం ఉంటుంది. ఆరుతడి పంటలకే ఇది పరిమితం. దీనికి ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ డబ్బాలో కలుపును నియంత్రించే మందుల ద్రావకాన్ని నింపుకోవాలి. పంట సాళ్ల వెంబడి మడకల ద్వారా దున్నుకుంటూ వెళ్లాలి. తద్వారా అక్కడ ఉన్న కలుపును పెకిలిస్తుంది. మొక్కల మధ్యలో ఉన్న కలుపు మొక్కలు చనిపోయే విధంగా దీనికి ఏర్పాటు చేసిన పిచికారీ యంత్రం ద్వారా నివారణ మందును పిచికారీ చేసే వెసులుబాటు ఉంది.


రైతులకు ఉపయోగపడేలా తయారీ   - కార్తిక్‌, విద్యార్థి

అనుకోకుండా వచ్చిన ఆలోచనతో కాకతీయ విద్యా సంస్థల కరస్పాండెంట్‌ వెంకట్రమణరెడ్డి ప్రోత్సాహంతో ఈ పరికరాన్ని ఆవిష్కరించాను. జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక కావాలని కోరుకుంటున్నా. ప్రపంచ దేశాల్లో ఉన్న రైతులందరికీ ఈ పరికరం ఉపయోగపడుతుంది. అందరికీ అందుబాటులోకి వస్తే ఎంతో మేలు జరుగుతుంది.


తయారు చేసిన మ్యాన్‌హోల్‌ శుభ్రపరిచే పరికరంతో విద్యార్థి మహమ్మద్‌ సిరాజ్‌

ములకలచెరువు గ్రామీణ: తంబళ్లపల్లె మండలం, కన్యమడుగు జడ్పీ హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి మహమ్మద్‌ సిరాజ్‌ వినూత్నంగా ఆలోచించి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. గైడ్‌ ట©చర్‌ రమణమ్మ సహకారంతో విద్యార్థి తయారు చేసిన మ్యాన్‌హోల్‌ శుభ్రపరిచే పరికరం జాతీయ స్థాయికి ఎంపికైంది. దిల్లీలో జరుగే వైజ్ఞానిక సదస్సులో తన ప్రయోగాన్ని ప్రదర్శించనున్నారు. మారుమూల పాఠశాలకు చెందిన విద్యార్థి ఎంపిక కావడంతో సర్పంచి శ్యామలమ్మ, ఎంపీటీసీ సభ్యుడు మహేష్‌, స్కూల్‌ కమిటీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.


చేనేతల శ్రమ తగ్గేలా!

ఇన్‌స్పైర్‌మనాక్‌ ప్రదర్శనలో కడప నగరం చెమ్ముమియాపేట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్‌ ఫైజాసుల్తానా రూపొందించిన ఫెడల్‌ ఫ్రీ హ్యాండ్లూమ్‌ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైంది. ‘నేత పని వారు ఉపయోగిస్తున్న మగ్గంలో మార్పులు చేయడం. వారికి శారీరక శ్రమ తగ్గించడం. వికలాంగులు సైతం ఈ పరికరంతో సులభంగా నేత నేయడం. మగ్గం ఉపయోగించేటప్పుడు రెండు కాళ్లను, రెండు చేతులను పనిలో వినియోగిస్తారు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ లేకుండా పరికరాన్ని తయారుచేశాం. నాలుగు అవయవాలు చేసే పనిని ఒక్క చేతితో సులభంగా చేసేలా ఏర్పాటు చేశాం’ అని విద్యార్థిని ఫైజా సుల్తానా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని